ప్రసారానికి పోటాపోటీ
కోట్ల కాసుల రాశులు కురిపించే ఐపీఎల్ మరో భారీ వేలం ప్రక్రియకు సిద్ధమైంది. పదేళ్లుగా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ప్రసార హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. బడాబడా నెట్‌వర్క్ సంస్థలు, టెలికామ్ కంపెనీలే కాదు ఈసారి ఈ–కామర్స్ దిగ్గజాలు హక్కుల కోసం పోటెత్తడంతో బోర్డుకు రూ.20 వేల కోట్ల పైచిలుకు రాబడి రానుంది.
♦ ఐపీఎల్ ‘బ్రాడ్ కాస్టింగ్’ వేలం నేడు
♦ ఐదేళ్లకే రూ.20 వేల కోట్లు!
ముంబై: ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ సోమవారం ఇక్కడ జరుగనుంది. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులు, డిజిటల్ (ఇంటర్నెట్, మొబైల్) హక్కుల కోసం దిగ్గజ టీవీ చానెళ్లు, టెలికామ్ సంస్థలు ప్రతిష్టకు పోతున్నాయి. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ధనాగారం ఊహించనంత మొత్తంతో నిండిపోనుంది. రికార్డు స్థాయిలో ఐదేళ్ల కాలానికే రూ. 20 వేల కోట్ల పైచిలుకు ఆదాయం వస్తుందని బోర్డు వర్గాలు ఆశిస్తున్నాయి. వీరి అంచనాలకు అనుగుణంగానే మొత్తం 24 సంస్థలు మీడియా రైట్స్ కోసం సై అంటే సై అంటున్నాయి. ప్రత్యేకించి కొత్తగా డిజిటల్ విభాగంలో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది.
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ సంస్థలు ఎలాగైనా హక్కులు చేజిక్కించుకోవాలనే కసితో టెండర్లు దాఖలు చేశాయి. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, వెబ్ సర్వీస్ ప్రొవైడర్ యాహూ, సామాజిక నెట్‌వర్కింగ్ సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలు కూడా ఐపీఎల్ హక్కుల కోసం ఎగబడటం విశేషం. ఈ రెండు రకాల మీడియా రైట్స్‌ను మార్కెటింగ్ వ్యూహాలకు అనుగుణంగా పలు రకాలుగా విభజించారు. దేశం లోపల, భారత ఉపఖండం, ఉపఖండం వెలుపల, అంతర్జాతీయ మార్కెట్ ఇలా విభజించారు.
2018 నుంచి 2022 వరకు మీడియా హక్కులను అమ్ముతారు. టెండర్ల ప్రక్రియపై బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి మాట్లాడుతూ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల కోసం సోమవారం నిర్వహించే వేలం ఊహకందని రాబడితో చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. ఐపీఎల్ తొలినాళ్లలో పదేళ్ల కాలానికి సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ రూ. 8200 కోట్లు వెచ్చించి టీవీ హక్కులు పొందింది. డిజిటల్ హక్కులను గత మూడేళ్ల (2015–17) కాలానికి నోవి డిజిటల్ సంస్థ రూ. 302.2 కోట్లతో చేజిక్కించుకుంది.
వేలంలో పాల్గొంటున్న సంస్థలివే...
స్టార్ ఇండియా, సోనీ నెట్‌వర్క్, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, ఫాలోఆన్ ఇంటరాక్టివ్ మీడియా, తాజ్ టీవీ ఇండియా, టైమ్స్ ఇంటర్నెట్, సూపర్‌స్పోర్ట్ ఇంటర్నేషనల్, రిలయన్స్ జియో డిజిటల్, గల్ఫ్ డీటీహెచ్, గ్రూప్ ఎమ్ మీడియా, బెల్ ఎన్ ఈకోనెట్ మీడియా, సై యూకే, ఈఎస్‌పీఎన్ డిజిటల్ మీడి యా, బీటీజీ లీగల్ సర్వీసెస్, బీటీ పీఎల్‌సీ, ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితర సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి.