
సాక్షి, న్యూఢిల్లీ : ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు మీడియాలో మొదలయింది. తోటి జర్నలిస్టులు, రైటర్లు తమను లైంగికంగా వేధించారని, తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ పలువురు మహిళా జర్నలిస్టులు శుక్రవారం నాడు సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. ఎవరు, ఎప్పుడు, ఎలా? తమ పట్ల అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించారో, ఎవరు తమకు అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపించారో, ఎవరు తమను ఏమేమీ కోర్కెలు కోరారో వారు సోషల్ మీడియా సాక్షిగా బయట పెడుతున్నారు. ఎక్కువ మంది బాధితులు తమను సోషల్ మీడియా ద్వారానే వేధించినట్లు చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల్లో కొందరు తమ ప్రవర్తనకు చింతిస్తూ బేషరుతుగా క్షమాపణలు చెప్పగా, మరి కొందరు సంస్థ విచారణ కమిటీ ముందు హాజరవుతున్నామని, వాస్తవాస్తవాలేమిటో అవే బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇంకొందరు తమకు ఎలాంటి పాపం తెలియదని, తమ ఉత్తమ నడవడిని శంకించరాదంటూ వివరణ ఇవ్వగా, తమ ప్రతిష్టను, క్యారెక్టర్‌ను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కొందరు ఎదురు దాడికి దిగారు. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారంటూ ప్రముఖ బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా ఆరోపణల వివాదం రగులుతున్న నేపథ్యంలో ‘మీ టూ’ అంటూ మహిళా జర్నలిస్టులు ముందుకు వస్తున్నారు. ‘మీ టూ’ ఉద్యమం ముందుగా హాలీవుడ్‌లో ప్రారంభమైన విషయం తెల్సిందే.
బేషరతుగా క్షమాపణలు: అనురాగ్ వర్మ
‘నేను పంపించిన స్నాప్‌చాట్ సందేశాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. నేను అనుచితంగా ప్రవర్తించిన మాట వాస్తవమే. ఏదో అప్పుడు హాస్యానికన్నట్లు సందేశాలు పంపించాను. అందులో వాస్తవం లేదు. ఫొటోలు, వీడియోలతో మీలో ఎంతో మందిని ఇబ్బంది పెట్టాను. క్రాస్ ఫొటోలే కాకుండా నగ్న ఫొటోలు కూడా పంపించాను. అందుకు నన్ను క్షమించండి’ అంటూ 2017, అక్టోబర్ నెల వరకు ‘హఫ్ పోస్ట్ ఇండియా’లో పనిచేసిన జర్నలిస్ట్ అనురాగ్ వర్మ శుక్రవారం ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చారు.
Hello. My snapchats have been problematic. I have been problematic. The content that I thought was "funny" at the time was actually not. I'm sorry, I have made many of you uncomfortable with my crass photos and videos that I thought would pass as a humour.
— Anurag Verma (@kitAnurag) October 4, 2018
ఆలస్యంగానైనా విచారిస్తున్నా : కామిక్ ఉత్సవ్ చక్రవర్తి
యూట్యూబర్, కామిక్ ఉత్సవ్ చక్రవర్తిపై ఎక్కువ మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఏదో అప్పటికప్పుడు క్షణికావేశంతో పంపించిన సందేశాలు, ఫొటోలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ తొలుత సమర్థించుకోబోయిన చక్రవర్తి 24 గంటల తర్వాత బేషరతుగా బాధితులకు క్షమాపణలు చెప్పారు. ‘కాస్త ఆలస్యమైనప్పటికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఈ 24 గంటలు నేను ఎంతో వేధనను అనుభవించాను. ఇక నా వల్ల ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని కోరుకుంటున్నాను. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి, చేసిన తప్పులను ఎలా సరిదిద్దు కోవాలో కూడా మీరే సూచించండి’ అని ఆయన సోషల్ మీడియా ద్వారానే వివరణ ఇచ్చారు.
ఆస్ట్రేలియాలో కామెడీ షో నిర్వహించేందుకు నౌకలో వెళుతున్నప్పుడు తమను లైంగికంగా వేధించినట్లు ఎక్కువ మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. చక్రవర్తి ఫ్రీలాన్సర్‌గా తమతో పనిచేస్తున్నందుకు ‘ఆల్ ఇండియా బకర్డ్’ టీమ్ కూడా క్షమాపణలు తెలిపింది. ఉత్సవ్ చక్రవర్తి కూడా 2015 వరకు ‘హఫ్‌పోస్ట్ ఇండియా’ మీడియాలో పనిచేశారు. వర్మ, చక్రవర్తి తమ సంస్థలో పనిచేసినప్పుడు వారిపై ఎలాంటి ఆరోపణలు రాలేదని, వారు ఎవరినైనా వేధించారా? అన్న విషయాన్ని సంస్థగతంగా పరిశీలిస్తున్నామని ఎడిటర్ ఇన్ చీఫ్ అమన్ సేథి తెలిపారు. తాము మాత్రం ఇలాంటి వేధింపులను సహించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు.
నేనెంతో బాధ పడుతున్నా: మిహిర్ చిత్రే
ఆడవాళ్లను లైంగికంగా వేధించినందుకు ప్రముఖ అడ్వర్‌టైజింగ్ ప్రొఫెషనల్ మిహిర్ చిత్రే కూడా శుక్రవారం నాడు క్షమాపణలు చెప్పారు. ‘మిమ్మల్ని, మీతోటి వారిని బాధ పెట్టినందుకు నేనెంతో బాధ పడుతున్నాను. నా తప్పును ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు అనుచితంగా ప్రవర్తించను’ అని ఆయన ట్విట్టర్‌లో స్పందించారు.
I'm certainly guilty of a lack of judgement on my part about all this. I'm terribly hurt that I've hurt you & others. That was never ever my intent. I stand corrected and I've too much to look within. Thank you for making me realise this. Never again. I'm sorry. @FuschiaScribe https://t.co/shwt9xBaOG
— Mihir Chitre (@mihir_chitre) October 5, 2018
కమిటీ దర్యాప్తు జరుపుతోంది : రెసిడెంట్ ఎడిటర్
ఓ మహిళా జర్నలిస్ట్ తనపై చేసిన లైంగిక ఆరోపణలను ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ రెసిడెంట్ ఎడిటర్ కేఆర్ శ్రీనివాస్ పరోక్షంగా ఖండించారు. ఈ ఆరోపణలను విచారించేందుకు ఓ మహిళా ఎగ్జిక్యూటివ్ ఆధ్వర్యాన సంస్థాగతంగా ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయిందని, తాను విచారణకు హాజరై అన్ని విషయాలను కమిటీ ముందు వివరిస్తానని ఆయన తెలిపారు.
కిరణ్ నగార్కర్ కూడా
ఓ ఓటలో ఇంటర్వ్యూ సందర్భంగా రైటర్ కిరణ్ నగార్కర్ తనను అసభ్యంగా తాకారని ఓ మహిళా జర్నలిస్ట్ వెల్లడించారు. అదే రైటర్ తమనూ లైంగికంగా వేధించారని మరో ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆనక స్పందించారు. ఈ ఆరోపణలన్నీ అబద్ధమని నగార్కర్ ఖండించారు. హాలివుడ్‌తో ప్రారంభమై బాలివుడ్, టాలీవుడ్ మీదుగా మీడియాకు పాకిన ‘మీ టూ’ ఉద్యమం కళా, సాహితీ రంగాలకు కూడా విస్తరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment