
జర్నలిస్టు పిల్లలందరికి 50 శాతం రాయితీ
కడప ఎడ్యుకేషన్:
జిల్లాలో పత్రికల్లో పనిచేసే జర్నలిస్టు పిల్లలందరికి ప్రైవేటు పాఠశాలలో 50 శాతం రాయితీ ఇప్పించేందుకు కృషి చేస్తానని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక డీసీఈబీలో మంగళవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిçస్టులతో నిర్వహించిన సమావేశంలో డీఈఓ మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే జర్నలిస్టులకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం మానవతా సహృదంతో 50 శాతం రాయితీ ఇవ్వాలని కోరారు. జిల్లాలో గతేడాదే కొంతమేర అమలు అయ్యిందని ఈ ఏడాది పూర్థిస్థాయిలో అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎక్కడైనా 50 శాతం రాయితీ ఇవ్వకుంటే తమదృష్టికి తీసుకు రావాలన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ డీఈఓ ప్రతాప్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో పనిచేసేటప్పుడే ఆ జిల్లాలో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం రాయితీ ఇప్పించారన్నారు. సమావేశానంతరం పలు పత్రికల ప్రతినిధులకు రాయితీకి సంబంధిచిన పత్రాలను అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు రామాంజనేయరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.