తీవ్ర వ్యాధులపై బ్రహ్మాస్త్రం..! | Critical Illness Insurance Policy sakshi special story | Sakshi
Sakshi News home page

తీవ్ర వ్యాధులపై బ్రహ్మాస్త్రం..!

Published Mon, Mar 4 2024 12:53 AM | Last Updated on Mon, Mar 4 2024 12:53 AM

Critical Illness Insurance Policy sakshi special story - Sakshi

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్‌

మారిన జీవనశైలితో వ్యాధుల ముప్పు

వీటికి మెరుగైన చికిత్సలు

కానీ, వీటి ఖరీదు ఎక్కువే

సాధారణ హెల్త్‌ ప్లాన్‌ ఒక్కటీ చాలదు

తీవ్ర వ్యాధి వచి్చనా బతికుంటేనే పరిహారం!

జీవనశైలి వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అదే సమయంలో వైద్య శాస్త్రం పురోగతి, అత్యాధునిక టెక్నాలజీ, రోబోటిక్‌ పుణ్యమా అని మెరుగైన చికిత్సా విధానాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కనుక ఇప్పుడు ఏదైనా తీవ్ర ఆరోగ్య సమస్య వస్తే, వైద్యుల కృషితో విజయవంతంగా అధిగమించొచ్చు. కానీ, ఇందుకు కావాల్సిందల్లా ముందస్తు సన్నద్ధత.

అందుకే ఆరోగ్య బీమా ఎంత అవసరమో.. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలో.. అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు, ముందస్తుగా అనుకుని ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలకు కవరేజీ వర్తిస్తుంది. కానీ, ఏదైనా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ (మొండి వ్యాధులు, తీవ్ర అనారోగ్యం) కారణంగా ఎక్కువ రోజుల పాటు చికిత్స అవసరం పడితే ఏంటి పరిస్థితి..?

రెగ్యులర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో ఉన్న కవరేజీ సరిపోతుందా..? చాలకపోవచ్చు. రెగ్యులర్‌ ఇండెమ్నిటీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అన్ని రకాల వ్యాధుల్లోనూ గట్టెక్కిస్తుందని అనుకోవద్దు. తీవ్ర వ్యాధుల్లో చికిత్సల ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే అప్పుడు ఆదాయం ఆగిపోవచ్చు. ఇలాంటి సందర్భాలను అధిగమించేందుకు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ ఆదుకుంటుంది.

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ విడిగా ప్లాన్‌ రూపంలోనూ లేదంటే రైడర్‌ రూపంలోనూ తీసుకోవచ్చు. పాలసీలో పేర్కొన్న ఏదైనా వ్యాధి బారిన పడినట్టు తేలితే నిబంధనల మేరకు పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. ఇండెమ్నిటీ పాలసీలు కేవలం ఆస్పత్రిలో అయ్యే వ్యయాలకే పరిహారాన్ని చెల్లిస్తాయి. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ అలా కాదు. ఏక మొత్తంలో చెల్లింపులు చేస్తాయి.

దీంతో ఆయా తీవ్ర వ్యాధుల చికిత్సకు అయ్యే భారీ వ్యయాలను తట్టుకోగలరు. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ కింద ఏకమొత్తంలో వచి్చన పరిహారాన్ని దేనికి అయినా వినియోగించుకోవచ్చు. చికిత్స కోసమే వినియోగించాలని లేదు. కనుక రెగ్యులర్‌ ఇండెమ్నిటీ ఆధారిత ఆరోగ్య బీమా పాలసీ కింద ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, అదనంగా అయ్యే వ్యయాలను క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీతో గట్టెక్కొచ్చు. కానీ, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ తీసుకున్న వెంటనే అమల్లోకి రాదు. ఓ చిన్న కొర్రీ ఉంటుంది. అదే సర్వైవల్‌ పీరియడ్‌. అలాగే, మరికొన్ని షరతులు కూడా ఉంటాయి. వీటిపై అవగాహనతోనే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ తీసుకోవాలి.  

సరై్వవల్‌ పీరియడ్‌
క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ను ఇండివిడ్యువల్‌ ప్లాన్‌గాను, లేదంటే రైడర్‌గానూ తీసుకోవచ్చు. జీవిత బీమా కంపెనీలు దీన్ని ఎండోమెంట్, టర్మ్‌ ప్లాన్లకు రైడర్‌గా అందిస్తుంటే.. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు స్టాండలోన్‌ పాలసీగా ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిల్లో సరై్వవల్‌ పీరియడ్‌ (జీవించి ఉండే కాలం) అనే క్లాజ్‌ ఉంటుంది. ఏదేనీ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ (జాబితాలోని) బారిన పడితే పరిహారం అన్నది, వెంటనే రాదు. క్లెయిమ్‌ చేసుకోవాలంటే, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత నిరీ్ణత రోజుల పాటు పాలసీదారు జీవించి ఉండాలి

. ఉదాహరణకు 30 రోజుల సరై్వవల్‌ పీరియడ్‌ ఉందనుకోండి. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాతి నుంచి 30 రోజుల పాటు జీవించి ఉన్నప్పుడే క్లెయిమ్‌కు అర్హత వస్తుంది. ఈ 30 రోజుల్లోపు మరణించినట్టయితే బీమా సంస్థ నుంచి పరిహారం పొందేందుకు అర్హత లభించదు. ‘‘ఇన్సూరెన్స్‌ కంపెనీలు సాధారణంగా 30 రోజుల సరై్వవల్‌ పీరియడ్‌ అమలు చేస్తుంటాయి.

కొన్ని కంపెనీలు ఈ సరై్వవల్‌ పీరియడ్‌ను తగ్గించుకునే ఆప్షన్‌ ఇస్తున్నాయి. బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అయితే 30 రోజుల కాలాన్ని, 15 రోజులకు తగ్గించేందుకు అంగీకరిస్తోంది. ఇందుకు గాను 5 శాతం అదనంగా ప్రీమియంను చార్జ్‌ చేస్తోంది. మరో 5–10 శాతం అదనపు ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వస్తే, అప్పుడు సరై్వవల్‌ పీరియడ్‌ 7 రోజులకు లేదంటే సున్నాకు తగ్గిస్తోంది’’అని ప్రమోట్‌ ఫిన్‌టెక్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిషా సంఘ్వి తెలిపారు.  

వెయిటింగ్‌ పీరియడ్‌...
పాలసీ కొనుగోలు చేసిన రోజు నుంచి 90–180 రోజుల వరకు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బారిన పడినా కానీ, క్లెయిమ్‌కు అర్హత లభించదు. ఈ వెయిటింగ్‌ పీరియడ్‌ తర్వాత నుంచి పాలసీ అమలు సమయంలో ఎప్పుడైనా వ్యాధి నిర్ధారణ అయితే క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అంటే పాలసీ తీసుకున్నా కానీ, కవరేజీ లేని కాలంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ప్రముఖ బీమా సంస్థలు ఎక్కువ శాతం 90 రోజుల వెయిటింగ్‌ పీరియడ్‌ను అమలు చేస్తున్నాయి.  

ఎన్నింటికి కవరేజీ..?
క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌లో మొత్తంగా ఎన్ని వ్యాధులకు కవరేజీ వరిస్తుందన్నది ముఖ్యంగా చూడాల్సిన అంశాల్లో ఒకటి. ఎందుకంటే నేడు జీవనశైలి వ్యాధుల ముప్పు గణనీయంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా గుండె జబ్బులు, మూత్ర పిండాల వ్యాధులు, కేన్సర్‌ రిస్క్‌ ఎక్కువగా ఉంటోంది. కొన్ని పాలసీలు లేదా రైడర్‌లు 10–20 వ్యాధులకు కవరేజీ ఆఫర్‌ చేస్తున్నాయి. 60 నుంచి 99 వ్యాధుల వరకు కవరేజీనిచ్చేవీ ఉన్నాయి.

ఎన్ని ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఉంటే, అంత మంచిదనుకుంటారేమో..? కానీ, ఇది తప్పుడు అభిప్రాయం. తీసుకునే ప్లాన్‌లో ముఖ్యమైన వ్యాధులకు, అది కూడా సమగ్రమైన కవరేజీ ఉందా? అన్నదే కీలకం. ‘‘60 లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులకు కవరేజీనిచ్చే ప్లాన్, కేన్సర్‌ను పలు దశలుగా వేరు చేసి ఆఫర్‌ చేయవచ్చు. మరో పాలసీలో కేవలం 25 వ్యాధులకే కవరేజీ ఉండొచ్చు.

ఈ ప్లాన్‌ అన్ని కేన్సర్‌లను ఒక్కటిగానే పరిగణించి, నిర్ధారణ అయిన వెంటనే క్లెయిమ్‌కు అనుమతించొచ్చు’’అని ఎలిఫెంట్‌ డాట్‌ ఇన్‌ (అలియన్స్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌) ప్రొడక్ట్‌ హెడ్‌ కల్పేష్‌ చవాన్‌ పేర్కొన్నారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం టాప్‌–5 తీవ్ర వ్యాధులకు సంబంధించి 90% క్లెయిమ్‌లు వస్తున్నాయి. టాప్‌–10 క్రిటికల్‌ ఇల్‌నెస్‌లు కాకుండా, ఇతర వ్యాధుల కారణంగా వచ్చే క్లెయిమ్‌లు చాలా తక్కువ.

కనుక దాదాపు 60 అంతకంటే ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఉందంటే, వాటి బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఇక్కడ ఏ ప్లాన్‌ తీసుకోవాలనే సందేహం రావచ్చు. అధిక వ్యాధులకు కవరేజీ ఇస్తూ, అందులో ఒక్కో వ్యాధి వారీ కవరేజీ పరిమితి లేకపోవడం, ఉన్నా మెరుగైన కవరేజీ, అన్ని కేన్సర్‌లను ఒకటిగానే పరిగణించేట్టు అయితే ఆ ప్లాన్‌ను తీసుకోవచ్చు. లేదంటే ఎలాంటి షరతుల్లేకుండా ఆఫర్‌ చేసే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్, అది టాప్‌ 25–30 వ్యాధులకు కవరేజీ ఇచ్చేది అయినా నిస్సందేహంగా తీసుకోవచ్చు. సంఖ్య కంటే షరతులు, కవరేజీకే ప్రాధాన్యం ఇవ్వాలి.  

రైడర్‌ – స్టాండెలోన్‌ ప్లాన్‌
క్రిటికల్‌ ఇల్‌నెస్‌ను రైడర్‌గా లేదంటే, స్టాండలోన్‌ పాలసీగా తీసుకుంటే ఏవైనా వ్యత్యాసాలు ఉంటాయా? అన్న సందేహం కలగొచ్చు. రైడర్‌ రూపంలో అయితే సులభంగా తీసుకోవచ్చు. బీమా పాలసీ తీసుకునే సమయంలోనే ఈ రైడర్‌ను కూడా ఎంపిక చేసుకుంటే, ఒకేసారి వైద్య పరీక్షలు చేస్తారు కనుక, మళ్లీ విడిగా తీసుకోవడాన్ని నివారించొచ్చు. కాకపోతే టర్మ్‌ ఇన్సూరెన్స్‌తోపాటు తీసుకుంటే కవరేజీ పరంగా పరిమితి ఉంటుంది.

జీవిత బీమా కవరేజీ మించి క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ కవరేజీ తీసుకోవడానికి అనుమతించరు. అంటే కోరుకున్నంత కవరేజీ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండదు. జీవిత బీమా ప్లాన్‌తో వచ్చే రైడర్లలో సాధారణంగా వ్యాధి ముదిరిన దశలోనే కవరేజీ అనే షరతు ఉంటుంది. ఉదాహరణకు కేన్సర్‌ మొదటి దశను ఇవి కవర్‌ చేయవు. అలాగే, రైడర్‌లలోనూ రెండు రకాలు ఉన్నాయి. కాంప్రహెన్సివ్‌ రైడర్‌ అయితే, బేస్‌ పాలసీ కవరేజీకి అదనంగా ఉంటుంది.

యాక్సిలరేటెడ్‌ రైడర్‌ అయితే, బేస్‌ పాలసీలో భాగంగానే కవరేజీ ఉంటుంది. యాక్సిలరేటెడ్‌ రైడర్‌ తీసుకుని ఏదైనా తీవ్ర వ్యాధి బారిన పడి క్లెయిమ్‌కు వెళితే, ఆ మేరకు బేస్‌ కవరేజీ తగ్గిపోతుంది. స్టాండలోన్‌ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌లో కవరేజీ విస్తృతంగా ఉంటుంది. పైగా జీవిత బీమా లేదా టర్మ్‌ ఇన్సూరెన్స్‌తో తీసుకునే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ జీవితాంతం పనిచేయదు. జీవిత బీమా ఎంత కాలానికి తీసుకుంటారో? అంత వరకే పరిమితం అవుతుంది.

విడిగా తీసుకుంటే మీరు జీవితాంతం రెన్యువల్‌ చేసుకోవచ్చు. పాలసీ వర్డింగ్స్‌ డాక్యుమెంట్‌ సమగ్రంగా చదవడం ద్వారా వేటికి కవరేజీ వస్తుంది, వేటికి రాదు? షరతులు అన్నీ తెలుస్తాయి.   స్టాండలోన్‌ ప్లాన్‌ ప్రీమియం, రైడర్‌తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. స్టాండలోన్‌ ప్లాన్‌లో ప్రీమియం ప్రతి కొన్నేళ్లకోసారి పెరుగుతూ వెళుతుంది. ఈ పెరుగుదల, రైడర్‌తో పోలి్చనప్పుడు అధికంగా ఉంటుంది. రైడర్‌లో కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ, ప్రతికూలతలను సైతం పరిగణనలోకి తీసుకోవాలి.

జీవితాంతం రెన్యువల్‌కు అవకాశం ఉందా? వ్యాధులకు విస్తృతమైన కవరేజీ ఉందా? సర్వైవల్‌ పీరియడ్‌ జీరో లేదంటే 7–15 రోజులుగా ఉందా? (వీలైనంత తక్కువ) అని కూడా చూడాలి. అలాగే, విడిగా ఒక్కో వ్యాధికి సంబంధించి కవరేజీ ఎందులో ఎక్కువ ఉంటే, అదే అనుకూలంగా పరిగణించొచ్చు. ఒకవేళ రైడర్‌ ఆకర్షణీయంగా ఉందని భావిస్తే, అప్పుడు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను 85–90 ఏళ్ల కాలానికి తీసుకుని, రైడర్‌ను జోడించుకోవడం సరైనది.

అప్పుడు జీవితాంతం టర్మ్‌ ప్లాన్‌ ప్రీమియం చెల్లింపుల్లో వైఫల్యం లేకుండా చూసుకోవాలి. ఇక ఇప్పటికే జీవిత బీమా పాలసీ తీసుకుని ఉంటే, అటువంటి వారు ఎలాంటి సందేహం లేకుండా స్టాండలోన్‌ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ను తీసుకోవడం సరైనది. మరీ ముఖ్యంగా కవరేజీ విస్తృతంగా ఉండాలని చెప్పి, భారీ ప్రీమియంతో కూడిన ప్లాన్‌ తీసుకుంటే, ఆర్థికంగా భారం అవుతుందేమో ఓసారి ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా వ్యాధి బారిన పడితే, ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పి, ప్రస్తుత బడ్జెట్‌ను భారంగా మార్చుకోరాదు.

కనుక తమ పూర్వీకుల ఆరోగ్య చరిత్ర, వ్యాధుల రిస్‌్కను వైద్య నిపుణుల సూచనతో మదింపు వేసుకుని, అప్పుడు ఎంతకు కవరేజీ తీసుకోవాలనే విషయంలో స్పష్టతకు రావాలి. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్, సాధారణ అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైతే ఆదుకోదు. కనుక రెగ్యులర్‌ హెల్త్‌ ప్లాన్‌ తీసుకోవడం కూడా ఎంతో అవసరం. అందుకే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ను బెనిఫిట్‌ ప్లాన్‌గా చెబుతారు. రెగ్యులర్‌ హెల్త్‌ప్లాన్, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ను ఒకే సంస్థ నుంచి తీసుకుంటే కొంత అనుకూలం.  

టాప్‌ క్రిటికల్‌ ఇల్‌నెస్‌లు / చికిత్సలు
కేన్సర్, యాంజియోప్లాస్టీ(ప్రొసీజర్‌), హార్ట్‌ఎటాక్, అరోటా సర్జరీ, హార్ట్‌ వాల్వ్‌ వైఫల్యం, కార్డియో మయోపతి, ప్రైమరీ పల్మనరీ హైపర్‌ టెన్షన్, సీఏబీజీ, క్రానిక్‌ లంగ్‌ డిసీజ్, క్రానిక్‌ లివర్‌ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్, కోమ, స్ట్రోక్, అల్జీమర్స్, మసు్క్యలర్‌ డిస్ట్రోఫీ, పార్కిన్సన్స్, బ్రెయిన్‌ సర్జరీ, పోలియోమైలైటిస్, మోటార్‌ న్యూరాన్‌ డిసీజ్, బ్యాక్టీరియల్‌ మెనింజైటిస, ఎన్‌సెఫలైటిస్, ఎయిడ్స్‌ (రక్త మార్పిడి వల్ల), థర్డ్‌ డిగ్రీ కాలిన గాయాలు.

కవరేజీ  ఎంత..?
గుండె జబ్బులకు సంబంధించి శస్త్రచికిత్సల ఖరీదు నేడు 2–5 లక్షల మధ్య ఉంది. వైద్య ద్రవ్యోల్బణం 10 శాతం పైనే ఉంటోంది. కనుక భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుత చికిత్సల చార్జీలకు ఐదు నుంచి పది రెట్లు అధికంగా కవర్‌ తీసుకోవాలి. లేదంటే కనీసం నాలుగైదేళ్ల వార్షిక ఆదాయానికి సమానమైన కవర్‌ తీసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.5 లక్షలు ఉందంటే, కనీసం రూ.25  లక్షలు అవసరం. ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి, ఇండెమ్నిటీ హెల్త్‌ కవరేజీ చాలనప్పుడు, అదనంగా అయ్యే వ్యయాలను తట్టుకునేందుకు, ఆ కాలంలో నిలిచిన ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ మాత్రమైనా ఉండాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement