పిల్లల ఫీజులకూ పనికొస్తుంది.. | Homecare provision critical for children with long-term illness | Sakshi
Sakshi News home page

పిల్లల ఫీజులకూ పనికొస్తుంది..

Published Sun, Nov 24 2013 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

పిల్లల ఫీజులకూ పనికొస్తుంది..

పిల్లల ఫీజులకూ పనికొస్తుంది..

ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి కనక.. ఏదో ప్రీమియం కట్టామా.. పాలసీ తీసుకున్నామా అనే ధోరణిలోనే చాలా మంది ఉంటారు తప్ప.. వీటి ద్వారా వచ్చే పూర్తి ప్రయోజనాలపై అవగాహన మాత్రం ఉండటం లేదు. పాలసీదారు మంచాన పడినప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా కూడా ఈ పాలసీలు తోడ్పడతాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇలాంటి సందర్భాల్లో పనికొచ్చే ‘క్రిటికల్ ఇల్‌నెస్’ కవరేజీపై అవగాహన పెంచుకోవాలి.
 ఇటీవల వస్తున్న వ్యాధుల్లో ప్రాణాంతకమైనవీ ఉంటున్నాయి. దీంతో వైద్యఖర్చులు కంపెనీ పరంగానో వ్యక్తిగతంగానో తీసుకునే ప్రాథమిక పాలసీల కవరేజీని మించిపోతున్నాయి. పైగా, ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పట్టేస్తోంది. సెలవులు తప్పవు. జీతం రాకపోనూ వచ్చు. కానీ ఆదాయం లేకున్నా పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటద్దె, కారు ఈఎంఐలు, ఇంట్లో నిత్యావసరాలు, క్రెడిట్ కార్డు చెల్లింపుల వంటివి తప్పవు. ఇలాంటపుడు అప్పటిదాకా కూడబెట్టిన సొమ్మేమైనా ఉంటే బయటకు తీయాల్సి ఉంటుంది. అందుకని ఇలాంటి సమయాల్లో ఆదుకోవడానికి ‘క్రిటికల్ ఇల్‌నెస్’ కవరేజీ పనికొస్తుంది.
 క్రిటికల్ కవరేజీ అంటే...
 ప్రత్యేకంగా కీలకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యల (క్రిటికల్ ఇల్‌నెస్) కోసం ఉద్దేశించిన కవరేజీ ఇది. ఆరోగ్య బీమా పాలసీకి అదనంగా జత చేసుకోవచ్చు. బీమా సంస్థను బట్టి... ఆసుపత్రిలో చేరడానికి ముందు, ఆ తర్వాత, కోలుకోవడానికి పట్టే కాలంలో తలెత్తే ఖర్చులను కూడా దీని ద్వారా పొందవచ్చు. అవయవ మార్పిడి వ్యయాలు కూడా పొందవచ్చు. క్రిటికల్ ఇల్‌నెస్ (సీఐ) బయటపడినప్పుడు కావాలనుకుంటే పాలసీ మొత్తాన్ని ఒకేసారిగా కూడా తీసుకోవచ్చు. దీన్ని ఆస్పత్రి ఖర్చులకే కాకుండా రోజువారీ ఖర్చుల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.
 కవరేజీ తీసుకునేటప్పుడు...
 ఎక్కువ వ్యాధులకు కవరేజీ ఇచ్చే బీమా సంస్థను ఎంచుకోవాలి. ఐఆర్‌డీఏ ఆదేశాల ప్రకారం బీమా సంస్థలు కనీసం 12 క్రిటికల్ వ్యాధులకు తప్పనిసరిగా కవరేజీ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు 20 దాకా కూడా ఇస్తున్నాయి. మన సౌలభ్యానికి అనుగుణంగా క్యాష్‌లెస్ లేదా బెనిఫిట్ పాలసీ ప్రయోజనాలు అందించే బీమా సంస్థను ఎంచుకోవాలి. బెనిఫిట్ పాలసీ ఉంటే.. ఏకమొత్తంగా పాలసీ డబ్బు తీసుకునే వీలుంటుంది. ట్రీట్‌మెంట్‌తో పాటు రోజువారీ ఖర్చులకూ ఇది ఉపయోగపడుతుంది. ఈ పాలసీ మొత్తం కుటుంబానికి పనికొస్తుంది. పాలసీదారు లేదా జీవిత భాగస్వామి లేదా సంతానంలో (ఇద్దరు) ఎవరికి సీఐ వచ్చినా ఈ పాలసీ ఉపయోగపడుతుంది.  చిన్న వయసులోనే ఇలాంటి పాలసీలు తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. ఏ ఏడాదైనా క్లెయిమ్ గానీ చేయకపోతే అదనంగా 5% మేర రెన్యువల్ డిస్కౌంటు కూడా లభిస్తుంది. ప్రస్తుతం చాలా చిన్న వయసులోనే సీఐలు వస్తున్నందున సాధ్యమైనంత ముందుగా ఇలాంటి పాలసీలు తీసుకోవడం ఉత్తమం.
 తగినంత బీమా ఉండాలి..
 కీలక వ్యాధుల చికిత్స ఖర్చులకు సరిపడేంతగా బీమా కవరేజీ ఉండాలి. ఇది ఎంత ఎక్కువగా ఉంటే ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది. కనీసం రూ.5 లక్షల కవరేజీ అయినా ఉండేలా చూసుకోవాలి. పాలసీ తీసుకునేటప్పుడు ఏవేవి పాలసీ పరిధిలోకి వస్తాయో, ఏవి రావో క్షుణ్నంగా చదివి, అడిగి తెలుసుకోవాలి. మొత్తం మీద ఒక బేసిక్ హెల్త్ పాలసీకి జతగా సీఐ కవరేజీ తీసుకుంటే కుటుంబం మొత్తానికి గరిష్టమైన కవరేజీ లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement