ఖర్చులు తగ్గించుకుని అయినా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ | Aditya Birla health survey On Health insurance | Sakshi
Sakshi News home page

ఖర్చులు తగ్గించుకుని అయినా హెల్త్‌ ఇన్సూరెన్స్‌

Feb 27 2023 5:02 AM | Updated on Feb 27 2023 5:02 AM

Aditya Birla health survey On Health insurance - Sakshi

ముంబై: అవసరమైతే ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉండి మరీ, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని దేశంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నిర్వహించిన సర్వేలో 85 శాతం మంది ఇదే చెప్పారు. 19 పట్టణాల నుంచి 6,600 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. కరోనాతో అనిశ్చితి, ఆందోళనకర పరిస్థితులతో మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడినట్టు ఈ సర్వే నివేదిక పేర్కొంది.

సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది తమ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో హెల్త్‌ కన్సల్టేషన్‌ (వైద్య సలహా) కూడా భాగంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కనుక మానసిక ఆరోగ్యంపై అత్యవసర అవగాహన అవసరం ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా తర్వాత ఆరోగ్యం, శ్రేయస్సుపై తమ అవగాహన పెరిగినట్టు 84 శాతం మంది సర్వేలో చెప్పారు. వైద్య అత్యవసరాల్లో వినియోగించుకునేందుకు వీలుగా కొంత నిధిని పక్కన పెట్టనున్నట్టు 52 శాతం మంది తెలిపారు.

ఖర్చు దృష్ట్యా తాము మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేందుకు వెనుకాడినట్టు 35 శాతం మంది వెల్లడించారు. తాము బరువు, రక్తపోటు తదితర ఆరోగ్య అంశాలను తరచూ పర్యవేక్షించుకోవడం లేదని ప్రతి ముగ్గురిలో ఒక్కరు చెప్పడం గమనార్హం. కరోనా తర్వాత ఆరోగ్యం విషయంలో ప్రజల ఆలోచన విధానం మారిందని, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడంతోపాటు అత్యవసర పరిస్థితుల పట్ల సన్నద్ధతను అర్థం చేసుకుంటున్నారని ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సర్వే నివేదిక తెలియజేసింది.

‘‘ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరాన్ని కరోనా తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో తాము తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షించుకుంటున్నారు’’అని ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో మయాంక్‌ భత్వాల్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement