సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక విప్లవం, పాశ్చాత్య ధోరణి ప్రభావంతో వ్యక్తుల ఆదాయానికి, ఖర్చుకు మధ్య పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. పేరుకే ఉద్యోగం.. చివరికి మిగిలేది అప్పే అన్నట్లుగా ఉద్యోగుల పరిస్థితి దిగజారింది. సంపాదనకు తగిన విధంగా పొదుపు చేయాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిధుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. అకస్మాత్తుగా లే–ఆఫ్‌లు వస్తే కనీసం ఈఎంఐలు కూడా కట్టలేని దుస్థితిలో భారతీయ ఉద్యోగులు ఉండటం శోచనీయం.
ఉద్యోగం కోల్పోతే నెల కూడా ఉండలేరు..
75 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఎటువంటి పొదుపు మొత్తాన్ని దాచుకోవట్లేదని దేశీయ ఆర్థిక, పెట్టుబడి, స్టాక్ మార్కెట్ కోర్సులు, రీసెర్చ్ టూల్స్ సంస్థ ఫినాలజీ తాజా సర్వేలో వెల్లడించింది. మూడు లక్షల మంది భారతీయ ఉద్యోగుల నుంచి ‘ఇండియాస్ మనీ హ్యాబిట్స్’ పేరిట డేటాను సేకరించింది. దీని ప్రకారం.. ఉన్నపళంగా ఉద్యోగం కోల్పోతే ప్రతి నలుగురిలో ఒకరు ఒక నెలపాటు కూడా పరిస్థితులను తట్టుకోలేరని వెల్లడించింది. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆరోగ్య బీమా లేదని.. ఆనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు ఎదురైతే పరిస్థితి అగమ్యగోచరమేనని తెలిపింది.
భద్రత పాలసీలకు దూరంగా..
ఇక దేశంలో కొంతమేర పెరిగిన అవగాహన, కంపెనీల్లో తప్పనిసరి కావడంవల్ల 30–40 ఏళ్ల వయస్సు ఉద్యోగులు బీమా పాలసీలను తీసుకుంటే.. 20–30 ఏళ్ల వయస్సు వారి బీమా పాలసీ స్కోరు చాలా దారుణంగా ఉందని నివేదిక పేర్కొంది. అధిక ఆర్జన కారణంగా విలాసవంతమైన జీవనశైలిపై ఎక్కువ ఖర్చుచేయడం వారి ప్రధాన అంశంగా మారిపోయిందని.. ఫలితంగా పొదుపు సూత్రాన్ని పాటించడమే లేదని సర్వే కుండబద్దలు కొట్టింది.
ప్రతీ ఆరుగురు భారతీయ ఉద్యోగుల్లో కనీసం ఒకరికి కూడా ఎటువంటి పాలసీ కవరేజీ లేకపోవడం భవిష్యత్తు ఆలోచనకు దూరంగా ఉండటమేనని చెప్పింది. క్రిటికల్ ఇల్‌నెస్‌లో 69 శాతం మందికి, ప్రమాదవశాత్తూ మరణిస్తే 65 శాతం మందికి సరైన భరోసా దక్కట్లేదని గుర్తించింది. ఈ క్రమంలోనే కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైతే 68 శాతం మంది స్టాక్‌మార్కెట్లు నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది.
15 రోజులకే జీతం ఖాళీ..
సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఉద్యోగుల జీతం 15 రోజులకే ఖాళీ అయిపోతున్నట్టు తెలిపింది. అలాగే..
♦ ఇక్కడ నలుగురిలో ఒకరు రోజుకు వచ్చే జీతం కంటే ఎక్కువ ఖర్చుచేస్తున్నారు.
♦ ఆరుగురిలో ఒకరు తమ వద్ద ఉన్నదాని కంటే రెండు రెట్లు బాకీ ఉన్నారు.
♦ ఈఎంఐలు కట్టడానికి డబ్బులు అందుబాటులో లేకుంటే మెజారిటీ ఉద్యోగులు స్టాక్స్ వెనక్కి తీసుకుంటుంటే.. 24శాతం మంది ఈఎంఐలు కట్టడానికే తిరిగి రుణాలు తీసుకుంటున్నారు.
♦ ఐదు శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు.
♦ 15 శాతం మంది ఈఎంఐలు కట్టలేక ఎగ్గొడుతున్నట్లు సర్వే వెల్లడించింది.
అప్పుల ఊబిలో..
మరోవైపు.. ప్రతీ ఐదుగురు భారతీయ ఉద్యోగుల్లో ఇద్దరు ఎప్పటికీ అప్పుల ఊబి నుంచి తప్పించుకోలేరని నివేదిక హెచ్చరించింది. 27 శాతం మంది ప్రస్తుతం అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతుండగా 68 శాతం మంది పదవీ విరమణ ప్రణాళిక లేకుండా గడిపేస్తున్నారని ప్రస్తావించింది. ఇక 53 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, షేర్లు చూసుకుంటున్నారని.. 36 శాతం మంది పెన్షన్ ఫండ్స్, 7 శాతం మంది అద్దె వస్తుందని, నాలుగు శాతం మంది తమ పిల్లలు చూసుకుంటారనే ధీమాలో ఉన్నట్లు నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment