3.1 కోట్ల కస్టమర్ల డేటా లీక్‌పై క్లారిటీ | Star Health taken measures to prevent future incidents strengthening their security mechanisms | Sakshi
Sakshi News home page

3.1 కోట్ల కస్టమర్ల డేటా లీక్‌పై క్లారిటీ

Published Wed, Dec 11 2024 3:27 PM | Last Updated on Wed, Dec 11 2024 4:22 PM

Star Health taken measures to prevent future incidents strengthening their security mechanisms

పాలసీదారుల కీలక సమాచారం లీక్‌ కావడంతో స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ తన భద్రతను పటిష్టం చేసుకునేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఈ తరహా డేటా లీకేజీ ఘటన మరోసారి చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్‌ తెలిపారు.

ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన డేటా లీకేజీ ఘటనలో 3.1 కోట్ల స్టార్‌ హెల్త్‌ కస్టమర్ల మొబైల్‌ ఫోన్, పాన్, చిరునామా తదితర సున్నిత సమాచారం బయటకు రావడం గమనార్హం. షెంజెన్‌ అనే హ్యాకర్‌ ఈ సమాచారాన్ని ఏకంగా ఒక పోర్టల్‌లో విక్రయానికి పెట్టినట్టు వార్తలు వచ్చాయి.

రక్షణ ఏర్పాటు చేసుకోవాల్సిందే..

‘ఒకరితో ఒకరు అనుసంధానమై పనిచేయాల్సిన ప్రపంచం ఇది. ఏజెంట్లు, ఆసుపత్రులు, బీమా కంపెనీలు అన్ని అనుసంధానమై పని చేసే చోట తమ వంతు రక్షణలు ఏర్పాటు చేసుకోవాల్సిందే. బలహీన పాస్‌వర్డ్‌లు తదితర వాటిని హ్యాకర్లు సులభంగా గుర్తించగలరు. కేవలం అంతర్గతంగానే కాకుండా, స్వతంత్ర నిపుణుల సాయంతో మేము ఇందుకు సంబంధించి రక్షణ చర్యలు తీసుకున్నాం’ అని ఆనంద్‌రాయ్‌ వివరించారు. ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయంటూ, బీమా కంపెనీలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో నిలిచిన కొత్త​ పెళ్లి కూతురు.. ఇంకొందరు..

అసలేం జరిగింది..?

స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్‌ షెన్‌జెన్‌ ఏర్పాటు చేసిన ఓ వెబ్‌ పోర్టల్‌లో స్టార్‌ హెల్త్‌ కస్టమర్ల ఫోన్‌ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి ఉంచినట్లు గతంలో గుర్తించారు. స్టార్‌ హెల్త్‌ ఇండియాకు చెందిన కస్టమర్ల అందరి సున్నిత డేటాను బయటపెడుతున్నానని, ఈ సమాచారాన్ని స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీయే అందించిందని హ్యాకర్‌ షెంజెన్‌ క్లెయిమ్‌ చేయడం గమనార్హం. మద్రాస్‌ హైకోర్ట్‌ ఆదేశాల మేరకు స్వతంత్ర సైబర్‌ సెక్యూరిటీ నిపుణులతో ఫోరెన్సిక్‌ దర్యాప్తు చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement