Star Health Insurance
-
స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా లీక్.. ఆన్లైన్లో విక్రయం
న్యూఢిల్లీ: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది.స్టార్ హెల్త్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఎస్వో) ఈ డేటాను హ్యాకర్‌కు విక్రయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. యూకేకు చెందిన జేసన్ పార్కర్ అనే పరిశోధకుడు సెప్టెంబర్ 20న ఇందుకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టడం తెలిసిందే. స్టార్ హెల్త్ కంపెనీకి చెందిన డేటాను షెంజెన్ అనే హ్యాకర్ వెబ్సైట్లో ఉంచినట్టు వెల్లడించారు. స్టార్ హెల్త్ ఇండియాకు చెందిన కస్టమర్లు అందరి సున్నిత డేటాను బయటపెడుతున్నానని, ఈ సమాచారాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే అందించిందని హ్యాకర్ షెంజెన్ క్లెయిమ్ చేయడం గమనార్హం.దీనిపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్పందిస్తూ.. విచారణకు సీఐఎస్వో సహకరిస్తున్నారని, అతడు తప్పు చేసినట్టుగా ఎలాంటి సమాచారం గుర్తించలేదని స్పష్టం చేసింది. సంబంధిత సమచారాన్ని ఎవరూ వినియోగించకుండా మద్రాస్ హైకోర్ట్ నుంచి ఆదేశాలు పొందినట్టు తెలిపింది. స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నిర్వహిస్తున్న ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించింది. -
బ్రెయిలీ భాషలో స్టార్ హెల్త్ పాలసీ
చెన్నై: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకుంది. ‘స్పెషల్ కేర్ గోల్డ్’ పాలసీని ‘బ్రెయిలీ’ భాషలో విడుదల చేసింది. కంటి చూపు సరిపడా లేని వారు సైతం ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని స్వయంగా తెలుసుకుని, తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇది వీలు కలి్పస్తుందని సంస్థ తెలిపింది. దేశంలో 3.4 కోట్ల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారని.. వారికి తగిన నైపుణ్యాలు, శిక్షణ ఇచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా అవకాశం ఇవ్వడం ద్వారా మద్దతుగా నిలవనున్నట్టు ప్రకటించింది. సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా ఆరోగ్య బీమా సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని.. బ్రెయిలీలో స్పెషల్ కేర్ గోల్డ్ పాలసీ విడుదల ఈ దిశగా మైలురాయి అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్ పేర్కొన్నారు. అంధులైన వారి సమగ్రమైన, సమ్మిళిత ఆరోగ్య బీమా రక్షణ అవసరాలను ఈ పాలసీ తీరుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంధుడైన పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీకాంత్ బొల్లా పాల్గొన్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ సహకారంతో స్పెషల్ కేర్ గోల్డ్ పాలసీ బ్రెయిలీ వెర్షన్‌ను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రూపొందించింది. -
గ్రామీణుల్లో ఆరోగ్య బీమాపై అవగాహన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్) సీఈవో ఆనంద్ రాయ్ తెలిపారు.విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 28వ తేదీన జాతీయ బీమా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య సంరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని విశ్వసిస్తూ ఐఆర్డీఏ మిషన్ ‘2047 నాటికి అందరికీ బీమా’కు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో బీమా వ్యాప్తిని పెంపొందించడానికి ఈ అవగాహన డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేశామని, ఈ డ్రైవ్‌లో కమ్యూనిటీలకు అవగాహన కల్పించే సమాచార కరపత్రాలతో పాటు సెషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాల్లోని 250 గ్రామాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, మొత్తం 50 రోజుల పాటు సాగే అవగాహన కార్యక్రమాల్లో రాష్ట్రంలో కనీసం 1,25,000 మందిని కలవాలనేది తమ లక్ష్యమని వెల్లడించారు. -
ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయొచ్చా?
స్టార్ హెల్త్ ప్రస్తుత ధర: రూ. 524 టార్గెట్: రూ. 653 ఎందుకంటే: 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్.. దేశీయంగా తొలి స్టాండెలోన్ ఆరోగ్య బీమా రంగ కంపెనీ. ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద బీమా సేవలకు తోడు.. దేశ, విదేశీ ప్రయాణ బీమా ప్రొడక్టుల (సర్వీసుల)ను సమకూరుస్తోంది. 14,200 ఆసుపత్రులతో ఒప్పందం ద్వారా భారత్‌లో అతిపెద్ద ఆరోగ్య బీమా సర్వీసులు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(క్యూ2)లో నికర ఆర్జనా ప్రీమియం (ఎన్ఈపీ)వార్షికంగా దాదాపు 15% జంప్‌చేసి రూ. 3,206 కోట్లకు చేరింది. ఇందుకు రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం సాధించిన రెండంకెల వృద్ధి దోహదపడింది. దీంతో కంబైన్డ్ రేషియో వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం మెరుగుపడి 99.2 శాతాన్ని తాకింది. రిటైల్ హెల్త్ ప్రీమియంలో పటిష్ట పురోగతి, కొత్త ప్రొడక్టుల విడుదల, డిజిటలైజేషన్‌పై నిలకడైన దృష్టి, విస్తారిత పంపిణీ నెట్వర్క్, కొత్త బ్యాంకస్యూరెన్స్ భాగస్వామ్యాలు (పాలసీల విక్రయంలో బ్యాంకులతో ఒప్పందాలు), మెరుగైన సాల్వెన్సీ రేషియో వంటి అంశాలు భవిష్యత్‌లో కంపెనీ పటిష్ట పనితీరు చూపేందుకు సహకరించను న్నాయి. డిజిటలైజేషన్ బాటలో ఇటీవల డైనమిక్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా కొత్తగా హెల్త్ ఇన్సూ రెన్స్ కొనుగోలు లేదా హెల్త్ పాలసీ కొనసాగింపు (రెన్యువల్)ను సులభంగా చేపట్టేందుకు వీలును కల్పించింది. రిటైల్ హెల్త్ విభాగంలో 33% వాటాతో మార్కెట్ లీడర్‌గా కంపెనీ నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రస్తుత ధర: రూ. 640 టార్గెట్: రూ. 740 ఎందుకంటే: ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభా పడాల్కర్తో పాటు.. సీఎఫ్‌వో నీరజ్ షాతో ఇటీవలే సమావేశమయ్యాం. తద్వారా కంపెనీలో వృద్ధికి సంబంధించి చోటు చేసుకుంటున్న కీలక అంశాలు, మొత్తంగా జీవిత బీమా రంగంలో పరిస్థితులు తదితరాలపై అభిప్రాయాలకు తెరతీశారు. వీటి ప్రకారం కంపెనీ మార్కెట్లో తనకున్న వాటాను మరింత సుస్థిరం చేసుకోనుంది. ఇందుకు వ్యూహాత్మకంగా టెక్నాలజీ వినియోగం, కస్టమర్‌కు సేవల అందుబాటు (ఎక్స్పీరియన్స్), బ్రాండ్‌ను పటిష్టపరచుకోవడం, సిబ్బంది అందించే ప్రత్యేక సర్వీసులు వంటివి సహకరించనున్నాయి. వీటికితోడు కొత్త ప్రొడక్టుల విడుదల జత కలవనుంది. బీమా రంగ బిల్లులో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సవరణలు ఆరోగ్య బీమా విభాగానికి ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. వీరి అభిప్రాయం ప్రకారం కస్టమర్ల ఆరోగ్య బీమా అవసరాలకు తాజా బిల్లు తగిన మార్గాలను చూపనుంది. వెరసి కొత్త ప్రొడక్టులను రూపొందించడం, కస్టమర్లకు అనుగుణమైన సర్వీసులందించడం తదితర అంశాలలో బీమా రంగ కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఇది దేశీయంగా బీమా సేవల వ్యవస్థ మరింత వేళ్లూనుకునేందుకు తోడ్పాటునివ్వనుంది. రూ. 5 లక్షలలోపు పాలసీలలో 15–17 శాతం చొప్పున వృద్ధి నమోదవుతోంది. అయితే అధిక టికెట్ పరిమాణంగల పొదుపు పాలసీలు తగ్గడంతో సర్దుబాటు ప్రాతిపదికన ఈ ఏడాది (2023–24) మొత్తం వార్షిక ప్రీమియం (ఏపీఈ) 12–13 శాతం చొప్పున పుంజుకునే వీలుంది. మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చానల్ ద్వారా 60 శాతం అమ్మకాలను సాధిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం! -
స్టార్ హెల్త్ ఫౌండర్ జగన్నాథన్ రాజీనామా
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటసామి జగన్నాథన్ కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు రాజీనామా చేశారు. జగన్నాథన్ కంపెనీ బోర్డు నుంచి తక్షణమే వైదొలుగుతూ తన రాజీనామాను సమర్పించారని స్టార్ హెల్త్ జూన్ 10న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 79 ఏళ్ల జగన్నాథన్ నెల రోజుల కిందటే కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆనంద్ రాయ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కాగా జూన్ 10న కంపెనీ బోర్డుకు రాజీనామా చేసే వరకు జగన్నాథన్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్సూరెన్స్ పరిశ్రమలో విశేష అనుభవం ఇన్సూరెన్స్ పరిశ్రమలో జగన్నాథన్‌కు విశేష అనుభవముంది. ఆయన నాయకత్వంలో స్టార్ హెల్త్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 619 కోట్ల లాభాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 1,041 కోట్ల నష్టాన్ని చవిచూసిన కంపెనీకి ఆయన తర్వాత సంవత్సరంలో ఏకంగా రూ. 619 కోట్ల లాభాన్ని ఆర్జించిపెట్టారు. స్టార్ హెల్త్‌ని ప్రారంభించే ముందు జగన్నాథన్ ప్రభుత్వ రంగ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో పని చేశారు. 2001లో నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థకు ఆయన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2004 నాటికి ఆటుపోట్లను తిప్పికొట్టి రూ. 450 కోట్ల లాభాన్ని సాధించగలిగారు. 2006లో జగన్నాథన్ స్థాపించిన స్టార్ హెల్త్ దేశంలోని ప్రముఖ స్టాండ్-అలోన్ మెడికల్ ఇన్సూరెన్స్‌లో ఒకటిగా అవతరించింది. -
ఐపీవోలకు ‘బీమా’ సంస్థల క్యూ
ముంబై: ఇప్పటికే కిక్కిరిసిపోయిన పబ్లిక్ ఇష్యూల మార్కెట్లో కొత్తగా బీమా రంగానికి సంబంధించిన మరో మూడు సంస్థలు ఐపీవోకి సిద్ధమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి రూ. 10,000 కోట్లు పైగా సమీకరించనున్నాయి. ఇన్సూరెన్స్ బ్రోకరేజి సంస్థ పాలసీబజార్ని నిర్వహించే పీబీ ఫిన్‌టెక్, ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీస్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేశాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 40 పైగా కంపెనీలు ఐపీవోకి రాగా .. సుమారు రూ. 70,000 కోట్ల పైగా నిధులు సమీకరించాయి. ఆగస్టులో ఇప్పటిదాకా 24 పైగా సంస్థలు ఐపీవోకి సంబంధించి పత్రాలు దాఖలు చేశాయి. ఈ ఏడాదిలో ఏకంగా 100 పైగా పబ్లిక్ ఇష్యూలు రాగలవని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. రెండో భారీ ఇష్యూగా పీబీ ఫిన్‌టెక్.. పీబీ ఫిన్‌టెక్ సుమారు రూ. 6,017 కోట్లు సమీకరించనుంది. టైగర్ గ్లోబల్, టెన్సెంట్ హోల్డింగ్స్ వంటి దిగ్గజాలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఏడాదిలో జొమాటో తర్వాత పీబీ ఫిన్టెక్ది రెండో అతి భారీ ఇష్యూ కానుంది. జొమాటో రూ. 9,375 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు స్టాండెలోన్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన స్టార్ హెల్త్ దాదాపు రూ. 3,000 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉంది. అటు దేశీయంగా అతి పెద్ద థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న మెడి అసిస్ట్ సుమారు రూ. 840–1,000 కోట్ల నిధులను ఐపీవో ద్వారా సమీకరించనున్నట్లు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ల (డీఆర్‌హెచ్‌పీ) ద్వారా తెలుస్తోంది. పీబీ ఫిన్‌టెక్ ఆగస్టు 4న, స్టార్ హెల్త్ జులై 28న, మెడి అసిస్ట్ మే 11న సెబీకి డీఆర్‌హెచ్‌పీలు సమర్పించాయి. ఒక్కో ఇష్యూ ఇలా.. దేశీయంగా ప్రైవేట్ రంగంలో స్టార్ హెల్త్ అతి పెద్ద స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థగా ఉంది. దీనికి సుమారు 15.8 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలాతో పాటు వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ వంటి దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 2,000 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, వాటాదారులు 6 కోట్ల పైచిలుకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. సేఫ్‌క్రాప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3.06 కోట్ల షేర్లు, ఎపిస్ గ్రోత్ 76 లక్షల షేర్లు విక్రయించనున్నాయి. మరోవైపు, పాలసీబజార్, ఆన్లైన్ రుణాల ప్లాట్‌ఫాం పైసాబజార్‌లను పీబీ ఫిన్‌టెక్ నిర్వహిస్తోంది. పరిమాణంపరంగా ప్రస్తుతం ఆన్లైన్లో పాలసీ విక్రయాలకు సంబంధించి పాలసీబజార్‌కు 93.4 శాతం మార్కెట్ వాటా ఉంది. 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిజిటల్ ఇన్సూరెన్స్ విక్రయాల పరిమాణంలో సుమారు 65.3 శాతం లావాదేవీలు దీని ద్వారానే జరిగాయి. పాలసీబజార్ కొత్తగా రూ. 3,750 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రస్తుత వాటాదారులు సుమా రు రూ. 2,267 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఇక మెడిఅసిస్ట్ విషయం తీసుకుంటే.. ఆదాయాలు, ప్రీమియం వసూళ్ల సేవలు తదితర అంశాలపరంగా దేశంలోనే అతిపెద్ద థర్డ్–పార్టీ ఇన్సూరెన్స్ అడ్మినిస్ట్రేటరుగా కార్యకలాపాలు సాగిస్తోంది. దేశవ్యాప్తంగా 722 నగరాలు, పట్టణాల్లో 11,000 పైచిలుకు ఆస్పత్రులతో భారీ నెట్వర్క్ ఉంది. అపోలో హాస్పిటల్స్ మణిపాల్ హాస్పిటల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, నారాయణ హృదయాలయ, మ్యాక్స్ హెల్త్‌కేర్ వంటి పేరొందిన హాస్పిటల్ చెయిన్లకు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటరుగా (టీపీఏ) వ్యవహరిస్తోంది. పబ్లిక్ ఇష్యూకి సంబంధించి ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రమ్‌జిత్ సింగ్ చత్వాల్, మెడిమ్యాటర్ హెల్త్ మేనేజ్మెంట్, బెస్సీమర్ హెల్త్ క్యాపిటల్, ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 1 మొదలైన ఇన్వెస్టర్లు 25,39,092 షేర్లను విక్రయిస్తున్నాయి. -
దేవుడా.! ఓ మంచి దేవుడా అడగకుండానే వేల కోట్లు ఇచ్చావ్
దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్. వేలకోట్ల ఆస్తి ఇచ్చావ్. వారెన్ బఫ్ఫెట్ ఆఫ్ ఇండియాను చేశావ్. ఇప్పుడు నేను అడగకుండా ఇచ్చే ధనం వద్దు.. నేను దానం చేసే గుణం ఇవ్వు' అని కోరుకుంటున్నారు. రాకేశ్ జున్‌జున్‌వాలా పరిచయం అక్కర్లేని పేరు. దలాల్ స్ట్రీట్ లో ఆయన పట్టిందల్లా బంగారమే. తండ్రి దగ్గర అరువుగా తీసుకున్న రూ. 5000లతో బాంబే స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి 36 ఏళ్లలోనే 34 వేల కోట్లు సంపాదించాడు. అయితే ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తిలో కొద్ది మొత్తాన్ని దానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..నేను ఇప్పుడు దేవుడిని సంపదను ఇవ్వమని కోరుకోవడం లేదు. కానీ సంపాదించిన ఆస్తిని దానం చేసే గుణాన్ని ఇవ్వమని వేడుకుంటున్నా. అన్ని సహకరిస్తే త్వరలో రూ.400 నుంచి రూ.500కోట్ల క్యాపిటల్ ఫండ్ తో ఎన్జీఓని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు కరోనా కారణంగా దేశంలో తలెత్తిన ఆర్ధిక మాద్యంపై స్పందించారు. గతంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కంటే .. కరోనా సృష్టించిన ఆర్ధిక సంక్షోభం పెద్దది కాదని, రాబోయే రోజుల్లో దేశ ఆర్ధిక వ్యవస్థ 10శాతం పుంజుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఓకి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ రాకేశ్ జున్‌జున్‌వాలా స్టార్ హెల్త్‌లో వాటాదారులుగా ఉన్నారు. చెన్నైకి చెందిన వి.జగన్నాథన్ యూనైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే 2006లో వి.జగన్నాథన్ చెన్నైలో స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ను ప్రారంభించి మెడిక్లయిమ్,యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్‌తో అనతికాలంలో ప్రజాదారణ పొందారు. దీంతో బిగ్ బుల్ రాకేశ్ 2018 ఆగస్ట్ నెలలో వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, మాడిసన్ క్యాపిటల్ తో కలిసి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ 90 శాతం వాటాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం దరఖాస్తు దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.2,000 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: హింట్ ఇచ్చేసిందిగా, ఇండియన్ రోడ్లపై టెస్లా చక్కర్లు -
కరోన 'రక్షణ' ఉందా..?
ఆరోగ్య బీమా అవసరాన్ని మనలో అధిక శాతం మంది ఇంతకాలం గుర్తించలేదు. కానీ, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఆరోగ్య బీమా అవసరాన్ని చాలా మంది గుర్తిస్తున్నారు. అందరికీ ఆరోగ్య బీమాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. ముఖ్యంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక విపత్కర పరిస్థితులను దృష్టిలోకి తీసుకుని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కరోనాకు సంబంధించి ప్రత్యేక పాలసీలను ప్రవేశపెట్టాలని నిర్దేశించింది. దీంతో అన్ని ప్రముఖ సంస్థలు కరోనా కవచ్, కరోనా రక్షక్ పేరుతో రెండు రకాల పాలసీలను ప్రవేశపెట్టాయి. కరోనా కోసం బీమా సంస్థలు తీసుకొచ్చిన రెండు ప్రామాణిక పాలసీల్లో ఏది మీకు అనుకూలం..? వీటిల్లో కవరేజీ, మినహాయింపులు తదితర సమగ్ర అంశాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. పాలసీల్లో వైరుధ్యం.. కరోనా కవచ్, కరోనా రక్షక్ రెండు రకాల పాలసీలు కోవిడ్–19 చికిత్సలకు పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించినవి. కరోనా కవచ్ పాలసీ ఇండెమ్నిటీ ప్లాన్. అంటే కరోనా కారణంగా చికిత్సలకు అయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. తీసుకున్న బీమా మొత్తానికి ఇది పరిమితం అవుతుంది. ఇక కరోనా రక్షక్ పాలసీ అనేది బెనిఫిట్ పాలసీ. అంటే కరోనా బారిన పడితే ఎంచుకున్న బీమా మొత్తాన్ని ఒకే విడత చెల్లించేస్తుంది. కరోనా పాజిటివ్ అని తేలి, కనీసం 72 గంటలు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తేనే కరోనా రక్షక్ పాలసీ ప్రయోజనం లభిస్తుంది. ప్రభు త్వం గుర్తింపు కలిగిన ల్యాబ్‌ల్లో పరీక్షల ద్వారా కరోనా నిర్ధారణ అయితేనే ఈ రెండు పాలసీల్లోనూ పరిహారం లభిస్తుంది. కరోనా కవచ్ పాలసీ విడిగా వ్యక్తులకు, లేదా కుటుంబం మొత్తానికి ఫ్లోటర్ పాలసీ రూపంలో అందుబాటులో ఉంటుంది. కరోనా రక్షక్ పాలసీ అనేది కుటుంబానికి కాకుండా ప్రతీ వ్యక్తి విడిగా తీసుకోవాల్సిన పాలసీ. ఈ 2 రకాల పాలసీలు 105 రోజులు (3.5 నెలలు), 195 రోజులు (6.5 నెలలు), 285 రోజుల (9.5 నెలలు) కా లానికి లభిస్తాయి. ఆ తర్వాత అంతే కాలానికి రెన్యువల్ చేసుకోవచ్చు. కనీస బీమా రూ. 50,000 నుంచి మొదలవుతుంది. గరిష్టంగా కరోనా కవచ్ పాలసీలో రూ.5 లక్షల బీమాను ఎంచుకోవచ్చు. కరోనా రక్షక్ ప్లాన్‌లో గరిష్ట బీమా రూ.2.5 లక్షలకు పరిమితం అవుతుంది. కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 65 సంవత్సరాల అర్హత మేరకు పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీల్లో ప్రీమియం వాయిదాల రూపంలో కాకుండా ఒకే విడత చెల్లించాలి. నెట్వర్క్ ఆస్పత్రుల్లో చేరడం ద్వారా కరోనా కవచ్ పాలసీదారులు నగదు రహిత చికిత్సలు పొందొచ్చు. ఈ పాలసీలను ఆయా బీమా సంస్థల పోర్టళ్లు, పంపిణీ చానళ్లు, ఏజెంట్ల ద్వారా తీసుకోవచ్చు. ఈ ప్రత్యేక పాలసీలను తీసుకోవచ్చా..? బీమా కంపెనీ ఏదైనా కానీ ఈ రెండు రకాల పాలసీలకు సంబంధించి అధిక శాతం నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రీమియం, బీమా సంస్థ అందించే సేవల నాణ్యత, క్లెయిమ్‌లను వేగంగా ఆమోదించడం వంటి విషయాలను పరిశీలించాలి. అదే విధంగా బీమా కంపెనీల చెల్లింపుల చరిత్రను చూసిన తర్వాతే మీకు అనుకూలమైన సంస్థ నుంచి పాలసీని ఎంచుకోవాలి. ఈ పాలసీల్లో ప్రాంతాల వారీగా ప్రీమియంలో వ్యత్యాసం ఉండదు. రెగ్యులర్ హెల్త్ ప్లాన్లలో ప్రాంతాల వారీగా ప్రీమియం మారిపోవడాన్ని గమనించొచ్చు. కానీ కోవిడ్ పాలసీల్లో ప్రీమియం అన్ని ప్రాంతాల వారికి ఒకే రీతిలో ఉంటుంది. 40 ఏళ్ల వ్యక్తి మూడున్నర నెలల కాలానికి కరోనా కవచ్ పాలసీని ఎంచుకుంటే ప్రీమియం కనిష్టంగా రూ.636 నుంచి గరిష్టంగా రూ.3,831 వరకు ఉంటుంది. అదే 9.5 నెలల కోసం ఇదే వయసున్న వ్యక్తికి ప్రీమియం రూ.1,286–5,172 మధ్య ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పటికే ఓ సమగ్రమైన ఆరోగ్య బీమా ఉండి, అందులో ఔట్ పేషెంట్ చికిత్సలకు కూడా కవరేజీ ఉండుంటే అప్పుడు ప్రత్యేకంగా కరోనా కవచ్ పాలసీని తీసుకోవాల్సిన అవసరం లేనట్టుగానే భావించాలి. ఎందుకంటే ఇప్పటికే అమల్లో ఉన్న అన్ని హెల్త్ ప్లాన్లలో కరోనాకు కవరేజీ లభిస్తుంది. కాకపోతే కరోనా వల్ల ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవాల్సి వస్తే.. అన్ని ప్లాన్లలోనూ పరిహారం రాకపోవచ్చు. కానీ కరోనా రక్షక్ పాలసీ ఎవరికైనా అనుకూలమే. ఎందుకంటే ఇప్పటికే హెల్త్ ప్లాన్ ఉన్నా కానీ.. కరోనా రక్షక్‌లో ఏకమొత్తంలో పరిహారం అందుకోవచ్చు. ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండి, బీమా మొత్తాన్ని మించిపోయినా అప్పుడు కరోనా రక్షక్ ఆదుకుంటుంది. కానీ, కరోనా రక్షక్‌లో పాజిటివ్‌గా తేలిన వ్యక్తి కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటేనే పరిహారం లభిస్తుంది. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి హెల్త్ ప్లాన్ లేని వారు ప్రస్తుత కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్ను తీసుకోవడాన్ని తప్పకుండా పరిశీలించాల్సిందే. కవరేజీ వేటికి..? కరోనా కవచ్ పాలసీలో.. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నా.. ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా గరిష్ట బీమా మేరకు పరిహారం పొందొచ్చు. ఆస్పత్రిలో కనీసం 24 గంటల పాటు చికిత్స పొందినప్పుడే ఖర్చులను చెల్లిస్తుంది. రూమ్ అద్దె, బోర్డింగ్, నర్సింగ్ చార్జీలు, ఐసీయూ, అంబులెన్స్ (రూ.2,000వరకు) చార్జీలను కూడా పొందొచ్చు. వైద్య, కన్సల్టెంట్, ఆపరేషన్ థియేటర్, పీపీఈ కిట్లు, గ్లోవ్స్‌కు అయ్యే వ్యయాలకూ బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఇంట్లోనే ఉండి చికిత్స పొందితే.. గరిష్టంగా 14 రోజుల చికిత్స వ్యయా లను భరిస్తుంది. అది కూడా వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉండి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటేనే పరిహారం కోసం క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది. ఆయుర్వేద ఆస్పత్రిలో ఇన్ పేషెంట్‌గా చేరి చికిత్స తీసుకున్నా కరోనా కవచ్ పాలసీ కవరేజీనిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి ముందు అయిన ఖర్చులు (15 రోజులు), ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం 30 రోజుల వరకు ఔషధాలు, ఇతర వ్యాధి నిర్ధారణ, వైద్యుల కన్సల్టేషన్ కోసం అయ్యే ఖర్చులనూ పొందొచ్చు. కరోనా కవచ్ పాలసీలు ‘హాస్పిటల్ డైలీ క్యాష్’ రైడర్‌నూ ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఆస్పత్రిలో చేరినప్పుడు వ్యక్తిగతంగా కొన్ని ఖర్చులు అవుతుంటాయి. అటువంటప్పుడు ఈ కవరేజీ అక్కరకు వస్తుంది. దీన్ని ఎంచుకుంటే బీమా మొత్తంలో 0.5 శాతాన్ని ప్రతీ రోజుకు బీమా సంస్థలు అందిస్తాయి. కాకపోతే 24 గంటలకు మించి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలి. అదే కరోనా రక్షక్పాలసీ విషయంలో పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఎంచుకున్న బీమా పరిహారాన్ని ఏక మొత్తంలో పొందవచ్చు. ఉదాహరణకు రూ.2.5 లక్షల సమ్ ఇన్సూర్డ్ ఎంచుకున్నారనుకుంటే.. కరోనా పాజిటివ్ అయి 72 గంటలు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఖర్చు ఎంతయిందన్న దానితో సంబంధం లేకుండా బీమా సంస్థ రూ.2.5 లక్షలను చెల్లించేస్తుంది. 72 గంటల్లోపు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయితే ఈ పాలసీలో పరిహారం రాదు. వీటిని దృష్టిలో ఉంచుకోవాలి ఇతర హెల్త్ ప్లాన్లలో మాదిరే కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల్లోనూ 15 రోజులు వేచి ఉండే కాలం (వెయిటింగ్ పీరియడ్) అమల్లో ఉంటుంది. అంటే పాలసీ ఇష్యూ చేసిన మొదటి 15 రోజుల్లో కరోనా బారిన పడినా క్లెయిమ్‌కు అర్హత ఉండదు. పరిహారానికి సంబంధించి తగ్గింపు నిబంధనల్లేవు. పోర్టబులిటీ ఆప్షన్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవడం అన్నది బీమా సంస్థలను బట్టి నిబంధనలు వేర్వేరుగా అమల్లో ఉండొచ్చు. వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి కరోనా కవచ్ పాలసీ ప్రీమియంలో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు రకాల పాలసీల్లో మినహాయింపులు కొన్ని ఉన్నాయి. ఆమోదం లేని చికిత్సా విధానాలకు ఇందులో కవరేజీ లభించదు. కరోనా చికిత్సలో భాగంగా కొన్ని మందులను ప్రయోగాత్మకంగా ఇస్తున్న వార్తలను వింటూనే ఉన్నాం. నియంత్రణ సంస్థల ఆమోదంతో ఇస్తున్న ఔషధాలు, చికిత్సలకు సంబంధించే కవరేజీ లభిస్తుందని గుర్తుంచుకోవాలి. ప్రయాణ పరంగా ఆంక్షలు అమల్లో ఉన్న ఏ ఇతర దేశంలో పర్యటించినా పాలసీ రద్దయిపోతుంది. డే కేర్ చికిత్సలు (ఆస్పత్రిలో చేరకుండా తీసుకునే చికిత్సలు), ఔట్ పేషెంట్ చికిత్సలకు కరోనా కవచ్ పాలసీలో కవరేజీ ఉండదు. కరోనా ప్రత్యేక పాలసీలకు వస్తున్న స్పందన అనూహ్యం. పాలసీబజార్ వెబ్సైట్ నిత్యం 300–500 పాలసీలను విక్రయిస్తోంది. తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది యువతే. – అముత్ చాబ్రా, హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్, పాలసీబజార్ ఎక్కువ మంది తొమ్మిదిన్నర నెలల కాలానికి పాలసీ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ 40 శాతం మంది హాస్పిటల్ డైలీ క్యాష్‌ను ఎంచుకుంటున్నారు. – సుబ్రతా మోండల్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (అండర్‌రైటింగ్), ఇఫ్కోటోకియా జనరల్ ఇన్సూరెన్స్ కుటుంబంలోని ఇతర సభ్యులకు కవరేజీతోపాటు, ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా ఖర్చులు చెల్లించే ఫీచర్లు ఉండడం ఎక్కువ ఆసక్తికి కారణం. – సుబ్రమణ్యం బ్రహ్మజోస్యుల, అండర్‌రైటింగ్ హెడ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ -
ఆరోగ్య, జీవిత బీమా ఒకే పాలసీలో..
ముంబై: ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను విడివిడిగా తీసుకునే ఇబ్బందిని తప్పిస్తూ రెండు రకాల ప్రయోజనాలతో కూడిన కాంబినేషన్ పాలసీలను తీసుకొచ్చేందుకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు చేతులు కలిపాయి. స్టార్ ఫస్ట్ కాంబి ప్లాన్ కింద స్టార్ ఫస్ట్ కాంప్రహెన్సివ్, స్టార్ ఫస్ట్ క్లాసిక్, స్టార్ ఫస్ట్ కేర్, స్టార్ ఫస్ట్ డిలైట్, స్టార్ ఫస్ట్ ఆప్టిమా పేరుతో మొత్తం ఐదు రకాల పాలసీలను తీసుకురానున్నాయి. ఈ పాలసీల్లో జీవిత బీమా కవరేజీ రూ.3 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు లభిస్తుంది.అలాగే, ఆరోగ్య బీమా కవరేజీ రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకు ఎంచుకోవచ్చు. ఆరోగ్య బీమా కవరేజీ వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా తీసుకునే సౌలభ్యం ఉంది. 400కుపైగా రోజువారీ చికిత్సలకు కవరేజీ వర్తిస్తుంది. ఏడాదిలో క్లెయిమ్‌లు లేకుంటే 100 శాతం వరకు బోనస్, ఔట్ పేషెంట్ విభాగంలో తీసుకునే దంత, కంటి వైద్య చికిత్సలకు, ప్రసవం, శిశువులకు కూడా కవరేజీ లభిస్తుంది. ఇందులో ఉన్న మరో సౌలభ్యం ఏమిటంటే ఆరోగ్య బీమా కవరేజీ మొత్తం ఖర్చయిపోతే... తిరిగి దానంతట అదే కవరేజీ 100 శాతం వరకు పునరుద్ధరించబడుతుంది.