స్టార్ హెల్త్
ప్రస్తుత ధర: రూ. 524 టార్గెట్: రూ. 653
ఎందుకంటే: 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్.. దేశీయంగా తొలి స్టాండెలోన్ ఆరోగ్య బీమా రంగ కంపెనీ. ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద బీమా సేవలకు తోడు.. దేశ, విదేశీ ప్రయాణ బీమా ప్రొడక్టుల (సర్వీసుల)ను సమకూరుస్తోంది.
14,200 ఆసుపత్రులతో ఒప్పందం ద్వారా భారత్‌లో అతిపెద్ద ఆరోగ్య బీమా సర్వీసులు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(క్యూ2)లో నికర ఆర్జనా ప్రీమియం (ఎన్‌ఈపీ)వార్షికంగా దాదాపు 15% జంప్‌చేసి రూ. 3,206 కోట్లకు చేరింది. ఇందుకు రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం సాధించిన రెండంకెల వృద్ధి దోహదపడింది. దీంతో కంబైన్‌డ్ రేషియో వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం మెరుగుపడి 99.2 శాతాన్ని తాకింది.
రిటైల్ హెల్త్ ప్రీమియంలో పటిష్ట పురోగతి, కొత్త ప్రొడక్టుల విడుదల, డిజిటలైజేషన్‌పై నిలకడైన దృష్టి, విస్తారిత పంపిణీ నెట్‌వర్క్, కొత్త బ్యాంకస్యూరెన్స్ భాగస్వామ్యాలు (పాలసీల విక్రయంలో బ్యాంకులతో ఒప్పందాలు), మెరుగైన సాల్వెన్సీ రేషియో వంటి అంశాలు భవిష్యత్‌లో కంపెనీ పటిష్ట పనితీరు చూపేందుకు సహకరించను న్నాయి. డిజిటలైజేషన్ బాటలో ఇటీవల డైనమిక్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా కొత్తగా హెల్త్ ఇన్సూ రెన్స్ కొనుగోలు లేదా హెల్త్ పాలసీ కొనసాగింపు (రెన్యువల్)ను సులభంగా చేపట్టేందుకు వీలును కల్పించింది. రిటైల్ హెల్త్ విభాగంలో 33% వాటాతో మార్కెట్ లీడర్‌గా కంపెనీ నిలుస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్
ప్రస్తుత ధర: రూ. 640 టార్గెట్: రూ. 740
ఎందుకంటే: ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభా పడాల్కర్‌తో పాటు.. సీఎఫ్‌వో నీరజ్ షాతో ఇటీవలే సమావేశమయ్యాం. తద్వారా కంపెనీలో వృద్ధికి సంబంధించి చోటు చేసుకుంటున్న కీలక అంశాలు, మొత్తంగా జీవిత బీమా రంగంలో పరిస్థితులు తదితరాలపై అభిప్రాయాలకు తెరతీశారు. వీటి ప్రకారం కంపెనీ మార్కెట్‌లో తనకున్న వాటాను మరింత సుస్థిరం చేసుకోనుంది.
ఇందుకు వ్యూహాత్మకంగా టెక్నాలజీ వినియోగం, కస్టమర్‌కు సేవల అందుబాటు (ఎక్స్‌పీరియన్స్), బ్రాండ్‌ను పటిష్టపరచుకోవడం, సిబ్బంది అందించే ప్రత్యేక సర్వీసులు వంటివి సహకరించనున్నాయి. వీటికితోడు కొత్త ప్రొడక్టుల విడుదల జత కలవనుంది. బీమా రంగ బిల్లులో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సవరణలు ఆరోగ్య బీమా విభాగానికి ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. వీరి అభిప్రాయం ప్రకారం కస్టమర్ల ఆరోగ్య బీమా అవసరాలకు తాజా బిల్లు తగిన మార్గాలను చూపనుంది. వెరసి కొత్త ప్రొడక్టులను రూపొందించడం, కస్టమర్లకు అనుగుణమైన సర్వీసులందించడం తదితర అంశాలలో బీమా రంగ కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుంది.
ఇది దేశీయంగా బీమా సేవల వ్యవస్థ మరింత వేళ్లూనుకునేందుకు తోడ్పాటునివ్వనుంది. రూ. 5 లక్షలలోపు పాలసీలలో 15–17 శాతం చొప్పున వృద్ధి నమోదవుతోంది. అయితే అధిక టికెట్ పరిమాణంగల పొదుపు పాలసీలు తగ్గడంతో సర్దుబాటు ప్రాతిపదికన ఈ ఏడాది (2023–24) మొత్తం వార్షిక ప్రీమియం (ఏపీఈ) 12–13 శాతం చొప్పున పుంజుకునే వీలుంది. మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చానల్ ద్వారా 60 శాతం అమ్మకాలను సాధిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం!
Comments
Please login to add a commentAdd a comment