ఇంకా 5% మందికే ఆరోగ్య బీమా | Cigna TTK bets big on AP and T | Sakshi
Sakshi News home page

ఇంకా 5% మందికే ఆరోగ్య బీమా

Published Thu, Mar 16 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM

ఇంకా 5% మందికే ఆరోగ్య బీమా

ఇంకా 5% మందికే ఆరోగ్య బీమా

అవసరం తెలియకపోవడమే కారణం
సిగ్నా టీటీకే డిప్యూటీ సీఈవో జ్యోతి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో ప్రజలు పొదుపుకు ఇచ్చినంత  ప్రాధాన్యత ఆరోగ్య బీమాకు ఇవ్వడం లేదని సిగ్నా టీటీకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అంటోంది. ప్రభుత్వం కల్పించినది మినహాయిస్తే 5 శాతం మందికి మాత్రమే భారత్‌లో ఆరోగ్య బీమా పాలసీ ఉందని కంపెనీ డిప్యూటీ సీఈవో జ్యోతి పుంజా బుధవారమిక్కడ మీడియాతో అన్నారు. అదికూడా తక్కువ కవరేజ్‌ ఉంటోందని చెప్పారు. ‘బీమా అవసరం అత్యధికులకు తెలియదు.

పొదుపు చేసేందుకే ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. మేము ఆరోగ్యంగానే ఉన్నాం.. మాకేం కాదు అన్న ధీమా చాలా మందిలో ఉంది. పాలసీ కింద చెల్లించిన మొత్తం వెనక్కి రాదనేది వారి అభిప్రాయం. బీమాపట్ల అవగాహన లేకపోవడమూ ఇందుకు కారణం’ అని చెప్పారు. పాలసీ తీసుకోవడానికి ప్రీమియం వ్యయం ఏమాత్రం అడ్డంకి కాదని ఆమె స్పష్టం చేశారు. చిన్న వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుందని, రెన్యువల్‌ భారం పెద్దగా ఉండదని సూచించారు.

పాలసీలు అమ్మడమేనా..
సిగ్నా టీటీకే విషయంలో బీమా కంపెనీ అంటే పాలసీలు అమ్మడానికే పరిమితం కాదని జ్యోతి అన్నారు. ఆన్‌లైన్‌లో కస్టమర్లకు ఆర్యోగ సలహాలు ఇవ్వడం, సదస్సుల నిర్వహణ వంటివి చేపడుతున్నట్టు చెప్పారు. హెల్తీ రివార్డ్స్‌ ఇచ్చి కస్టమర్లను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా హెల్త్‌ కోచ్‌లను దేశంలో తొలిసారిగా నియమించినట్టు వివరించారు. ఇక పాలసీల విషయంలో క్యాష్‌లెస్‌ 90 నిముషాల్లో, రీ–యింబర్స్‌మెంట్‌ 5 రోజుల్లో సెటిల్‌ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఆంధ్రాబ్యాంకు 800 శాఖల ద్వారా కంపెనీ తన పాలసీలను విక్రయిస్తోంది. మరో 2,000 శాఖలకు ఈ సేవలను విస్తరించనుంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరిలో కంపెనీ 55 శాతం వృద్ధి నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 1,000 మంది ఏజెంట్లను నియమించుకోనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement