వైద్య బీమా పాలసీ... ప్చ్!
వైద్య బీమా ప్రాధాన్యాన్ని నేడు ఎంతో మంది అర్థం చేసుకుంటున్నారు. వైద్య సేవల వ్యయాలు బడ్జెట్‌ను చిన్నాభిన్నం చేస్తున్న రోజులు కావడంతో ఆర్జించే వారిలో ఎక్కువ మంది వైద్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. దీని పట్ల ఇటీవలి కాలంలో అవగాహన కూడా విస్తృతం అవుతోంది. ఇది నాణేనికి ఒక వైపు. కానీ, వైద్య బీమా పాలసీలు తీసుకున్న వారిలో అందరూ సంతోషంగానే ఉంటున్నారా...? దాదాపు సగానికి సగం అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. ఇది నాణేనికి మరో వైపు కోణం. తాము తీసుకున్న పాలసీల్లోని ఫీచర్ల పట్ల సంతోషంగా లేమని 48 శాతం మంది తెలిపారు. పెద్ద వయసు వారిలో ఇది మరీ ఎక్కువగానే ప్రస్ఫుటమైంది. 65 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు వారిలో 67 శాతం మంది (ప్రతీ ముగ్గురిలో ఇద్దరు) తాము తీసుకున్న వైద్య బీమా పాలసీల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇటువంటి ఎన్నో విషయాలు వెలుగు చూశాయి.
అసంతృప్తి ఎక్కువే
48% అంటే సగం మంది హెల్త్ పాలసీల పట్ల అసంతృప్తితో ఉన్నారంటే దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా విస్మరించకూడని అంశమే. మరీ ముఖ్యంగా పెద్ద వయసు వారిలో మూడింట రెండొంతుల సంతృప్తిగా లేరంటే వారు ఆశించిన ప్రయోజనాలు బీమా సంస్థలు అందించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద వయసులోనే వైద్య బీమా అవసరం ఎక్కువగా ఉంటుంది. వారు తరచుగా పాలసీ కవరేజీని వినియోగించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. అందుకే వైద్య బీమా పాలసీ తీసుకునే ముందే పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఏజెంట్లకో, మధ్యవర్తులకో దరఖాస్తు పత్రాన్ని నింపే బాధ్యతను వదిలేయకుండా, డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివి, అందులోని ఫీచర్లను అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయానికి రావడం అవసరమని ఈ సర్వే ఫలితాలు గుర్తు చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల పాలసీ తీసుకున్న తర్వాత ఎక్కువ శాతం విధానపరమైన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ‘‘పాలసీ షెడ్యూల్, నియమ, నిబంధనలు, కస్టమర్ సమాచార షీట్ వంటివన్నీ పాలసీ కిట్‌లో ఉంటాయి. పాలసీలో కీలకమైన సెక్షన్లు అన్నీ ఉంటాయి. అలాగే, కొత్త పాలసీదారులను ఆహ్వానిస్తూ వారిలో కొందరికి కాల్ చేసి, ముఖ్యమైన ఫీచర్లు, షరతులు, నియమాలు వివరించడం జరుగుతుంది’’ అని సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దార్ తెలిపారు.
రెన్యువల్ ప్రీమియం భారం
పాలసీదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలు ఎక్కువగా కంపెనీలు రెన్యువల్ ప్రీమియంను భారీగా పెంచేయడంపైనే ఉన్నాయి. ‘‘రెన్యువల్ ప్రీమియం పెరగడం అన్నది వాస్తవికం. ఇతర ఉత్పత్తులకు భిన్నంగా ఇది ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది’’ అని మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆశిష్ మెహ్రోత్రా తెలిపారు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) 2013లో క్లెయిమ్ ఆధారిత ప్రీమియం పెంపు విధానాన్ని నిషేధించింది. పాలసీదారులు క్రితం సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుని ఉంటే, మరుసటి ఏడాది రెన్యువల్‌కు ప్రీమియం పెంచే విధానాన్ని కంపెనీలు అనుసరించేవి. అలాగే, వయసు పెరుగుతున్న కొద్దీ రెన్యువల్ ప్రీమియం పెంపు సైతం బీమా సంస్థలు అనుసరిస్తున్న మరో విధానం. ఉదాహరణకు 30–35 ఏళ్ల గ్రూపు నుంచి 36వ సంవత్సరంలోకి ప్రవేశించిన పాలసీదారునికి ప్రీమియం రెన్యువల్ భారం కొంచెం ఎక్కువే. వీరు 36–40 వయసు గ్రూపులోకి ప్రవేశించినట్టు. ఇలా బీమా సంస్థలు ఐదేళ్లకొక వయసును గ్రూపుగా పరిగణించి రిస్క్ పారామీటర్ల ఆధారంగా ప్రీమియం పెంచేస్తున్నాయి. వైద్య బీమా పాలసీని జీవిత కాలం పాటు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉన్నా.. అది ఏడాది కాల కాంట్రాక్టేనని గుర్తించాలి. కనుక పాలసీ తీసుకున్నప్పుడే ప్రీమియం రేట్లను పోల్చి చూడడం కూడా అవసరం.
క్లెయిమ్ సెటిల్మెంట్
60% పాలసీదారులు క్లెయిమ్స్ విషయంలోనూ అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నో మినహాయింపులు చూపించి పాక్షికంగానే కంపెనీలు పరిహారం చెల్లించాయన్నది 65 శాతం మంది చెప్పిన మాట. ఎక్కువ మంది తమ బీమా సంస్థల క్లెయిమ్ పరిష్కార రికార్డు పట్ల సంతోషంగా లేకపోవడం ఆందోళనకరమేనని, దీన్ని సత్వరమే మార్చాల్సిన అవసరం ఉందన్నారు ఐసీఐసీఐ లాంబార్డ్ అండర్‌రైటింగ్, క్లెయిమ్స్ విభాగం చీఫ్ సంజయ్ దత్తా. పాలసీదారులు సైతం బాధ్యతగా పాలసీ తీసుకునే సమయంలోనే తమ వైద్య చరిత్ర గురించి ఏ మాత్రం దాచిపెట్టకుండా పూర్తి వివరాలను తెలియజేయడం కూడా అవసరమేనని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దాదాపు అన్ని బీమా కంపెనీలు పాలసీదారులకు ముందు నుంచి ఉన్న వ్యాధులకు... ఏడాది నుంచి నాలుగేళ్ల తర్వాత కవరేజీ కల్పిస్తున్నాయి. ఆయా వ్యాధుల ఆధారంగా వెయిటేజీ పీరియడ్ ఆధారపడి ఉంటుంది. ‘‘పాలసీ ప్రయోజనాల విషయంలో కంపెనీలు పారదర్శక పాటించడం అవసరం. అలాగే, కస్టమర్లు పాలసీ తీసుకునే ముందు అన్ని వివరాలు వెల్లడించడం, సేవల సమయాన్ని నిర్దేశించడం వంటివి కస్టమర్ల సంతృప్త స్థాయిలను మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయి’’ అని సంజయ్ దత్తా పేర్కొన్నారు.
ముఖ్యంగా పాలసీదారులు పాలసీలో ఉన్న మినహాయింపుల విషయమై అవగాహన కలిగి ఉండడం కూడా వివాదాలకు దారితీయకుండా ఉంటుంది. బీమా సంస్థలు అనుసరించాల్సిన మినహయింపుల ప్రామాణిక జాబితాను ఐఆర్డీఏ లోగడే గుర్తించింది. బీమా సంస్థలు తప్పనిసరిగా దీనికి బద్ధులై ఉండాలి. దీన్ని ఉల్లంఘిస్తే వివాదాల పరిష్కార వేదికలను ఆశ్రయించొచ్చు. అయితే, పాలసీదారులు గమనించాల్సిన అంశం ఒకటుంది. రెన్యువల్ సమయంలోనూ బీమా సంస్థలు కొత్తగా మినహాయింపులను చేరుస్తున్నాయి. ‘‘రెన్యువల్ చేసుకుంటున్నందున పాలసీ ఒప్పందం అంతకుముందు మాదిరే ఉంటుందని పాలసీదారులు అనుకుంటుంటారు. కానీ, రెన్యువల్ సమయంలోనూ ఏకపక్షంగా బీమా సంస్థలు మినహాయింపులు చేర్చడాన్ని పాలసీదారులు ఎదుర్కొంటున్నారు’’ అని ప్రసూన్ సిక్దార్ తెలిపారు. అందుకే వైద్య బీమాకు సంబంధించి, ఇండివిడ్యువల్ విభాగంలో ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో (ఐసీఆర్) చూడాలంటున్నారు నిపుణులు. ఓ కంపెనీ వసూలు చేసిన ప్రీమియం, పరిహారం రూపంలో చెల్లించిన మొత్తాలను ఈ ఐసీఆర్ రేషియో తెలియజేస్తుంది. 75–85 శాతం మధ్య ఐసీఆర్ ఉంటే ఆరోగ్యకరమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు.
పరిష్కారాలకు మార్గాలు
పాలసీ తీసుకున్నాక కొంచెం అసంతృప్తి ఉంటే ఫర్వాలేదు కానీ, ఎక్కువ అసంతృప్తి ఉంటే అందులోనే కొనసాగాల్సిన అగత్యమేమీ లేదు. హెల్త్ పాలసీ పోర్టబులిటీ సదుపాయం ఉంది. మంచి ఫీచర్లతో, తక్కువ మినహాయింపులతో ఆఫర్ చేసే, చక్కని క్లెయిమ్ పరిష్కార రేషియో ఉన్న కంపెనీకి పాలసీని మార్చుకోవచ్చు. పోర్ట్ పెట్టుకున్నప్పటికీ, అంతకుముందు వరకు ఉన్న నో క్లెయిమ్ బోనస్ వంటి సదుపాయాలను కోల్పోవాల్సిన అవసరం కూడా రాదు. ఆశ్చర్యకరం ఏమిటంటే బీమా పోర్టబులిటీ సదుపాయాన్ని 2011లోనే ఐఆర్డీఏ కల్పించినప్పటికీ... తమకు ఆ విషయం ఇప్పటికీ తెలియదని ఈ సర్వేలో 27.12% చెప్పడం గమనార్హం.
ఇక పాలసీదారులు క్లెయిమ్ విషయంలో వివాదాలు, అభ్యంతరాలు ఉంటే అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించొచ్చు. తమ బీమా పాలసీ విషయంలో అసంతృప్తితో ఉన్నామని చెప్పిన వారిలో 70%కి పైగా అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించలేదు. ఎందుకని అంటే... అంబుడ్స్‌మన్ కు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకోవడం అన్నది ఎంతో సమయం తీసుకునే, క్లిష్టమైన ప్రక్రియగా 77% మంది భావిస్తున్నారు. ఇక 42% మంది అంబుడ్స్‌మన్ గురించి తెలియదని చెప్పారు. ఒకవేళ అంబుడ్స్‌మన్ వద్ద జరిగిన నిర్ణయం పట్ల సంతోషంగా లేకపోతే దానిపై వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌లను ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది.