దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికా డల్లాస్ కోర్టు టీసీఎస్ 210 మిలియన్లను స్థానిక సంస్థ డీఎక్స్‌సీ టెక్నాలజీకి వెంటనే చెల్లించాలని ఆదేశించింది. అయితే, అమెరికా సుప్రీం కోర్టు అదే టీసీఎస్..‘ఎపిక్ సిస్టమ్’కు 140 మిలియన్ల జరిమానా కట్టాలంటూ ఆదేశాలు జారీ చేసిన వారం వ్యవధిలో డల్లాస్ కోర్టు సైతం టీసీఎస్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది.
టీసీఎస్ అమెరికా చట్టాలను అతిక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందా? మేధో సంపత్తిని తస్కరించడం, ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల తాలుకూ రహస్యాల్ని బహిర్ఘతం చేయడం, సొంత లాభం కోసం ఆయా సంస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఉపయోగించి వ్యాపారం చేస్తుందా? అంటే అవుననే అంటున్నాయి అమెరికా న్యాయ స్థానాలు.
టీసీఎస్ వర్సెస్ కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ (సీఎస్‌సీ)
2018లో టీసీఎస్..కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ (సీఎస్‌సీ) సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఇన్సూరెన్స్ కంపెనీ ట్రాన్స్‌అమెరికాలోని 2,200 మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. దీంతో పాటు సీఎస్‌సీ (ఇప్పుడు సీఎస్‌సీ డీఎక్స్‌సీ టెక్నాలజీలో కలిసింది) సొంతంగా తయారు చేసుకున్న సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ సోర్స్ కోడ్‌తో పాటు ఇతర సమాచారాన్ని సేకరించింది. దాని సాయంతో ఇన్సూరెన్స్ మార్కెట్‌లోని ఇతర కంపెనీలకు గట్టిపోటీ ఇచ్చేలా సొంత ఫ్లాట్‌ఫామ్‌ను తయారు చేసుకుంది.
అనంతరం 2018లోనే ట్రాన్స్‌అమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి 10 ఏళ్ల పాటు టెక్నాలజీ సేవలందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఎంఓయూ ఖరీదు 2 బిలియన్ డాలర్లు. ఆ తర్వాత కోవిడ్-19, ఆర్ధిక అనిశ్చితి కారణంగా ట్రాన్స్ అమెరికా .. టీసీఎస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
సమాచారాన్ని తస్కరించి
ఈ నేపథ్యంలో సీఎస్‌సీ యాజమాన్యం టీసీఎస్ తీరును తప్పుబడుతూ డల్లాస్‌లోని టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. తమ సంస్థకు చెందిన సమాచారాన్ని ఉపయోగించి లైఫ్ ఇన్సూరెన్స్, యాన్యుటీ పాలసీ సేవల్ని కష్టమర్లకు అందించేలా సైబర్‌లైఫ్ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసిందని ఆరోపించింది. తగిన ఆధారాల్ని కోర్టు ముందు ఉంచింది. ఇరువురి వాదనల విన్న కోర్టు టీసీఎస్‌కు మొట్టికాయలు వేసింది. ‘ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీ మీది. మీరే ఇలా చేస్తే ఎలా? మీరు చేసింది ముమ్మాటికి తప్పే’ అంటూ తీర్పిచ్చింది. 210 మిలియన్లు సీఎస్‌సీ చెల్లించాలని తీర్పు వెలువరించింది.
న్యాయ పోరాటం చేస్తాం
కోర్టు తీర్పును సవాలు చేసేందుకు టీసీఎస్ సిద్ధమైంది. న్యాయస్థానం విధించిన జరిమానా కట్టేందుకు తాము సిద్ధంగా లేమని, ఈ అంశంపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని టీసీఎస్ అధికార ప్రతినిధి కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.
టీసీఎస్ వర్సెస్ ఎపిక్ సిస్టం
ఈ తీర్పు వెలువరించక వారం రోజుల ముందు అదే అమెరికా సుప్రీం కోర్టులో టీసీఎస్ (టాటా అమెరికా) కు వ్యతిరేకంగా మరో కేసు విచారణ జరిగింది. 2014లో ఎపిక్ సిస్టం, టాటా లు కలిపి ఓ సంస్థకు (మ్యూచువల్ క్లయింట్)కు సేవలందిస్తున్నాయి.
‘ఆ సమయంలో టీసీఎస్ మా అనుమతి తీసుకోకుండా ఫేక్ ఐడీలతో తమ వెబ్ పోర్టల్‌ను యాక్సెస్ చేసుకుని 6,000 వేల సమాచారాన్ని తస్కరించింది. ఆ సమాచారంతో మా కాంపిటీటర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాప్ట్‌వేర్‌ను డెవలప్ చేయడానికి ఉపయోగించుకుందని ఎపిక్ సిస్టం ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయాలని గతంలో కోర్టు మెట్లెక్కింది.
తప్పదు.. చెల్లించాల్సిందే
న్యాయ స్థానాలు భారీ ఎత్తున జరిమానా విధించగా.. ఆ ఫైన్‌ను తగ్గించాలని టీసీఎస్ వాదిస్తుంది. తాజాగా ఈ కేసులో టీసీఎస్‌కు పై కోర్టు యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ద సెవెన్త్ సర్క్యూట్ (యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్) ఇచ్చిన తీర్పు సమంజసంగా ఉందని, 140 మిలియన్లు పే చేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment