హెల్త్‌ బాగుంటే ప్రీమియం వెనక్కి! | aditya birla group health insurance ceo mayank bathwal interview | Sakshi
Sakshi News home page

హెల్త్‌ బాగుంటే ప్రీమియం వెనక్కి!

Published Mon, Mar 6 2017 12:21 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

హెల్త్‌ బాగుంటే ప్రీమియం వెనక్కి!

హెల్త్‌ బాగుంటే ప్రీమియం వెనక్కి!

2 శాతం నుంచి 30 శాతం దాకా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌లు
ఆరోగ్య విధానాల్ని పాటించటానికే ఈ ప్రోత్సాహం
నాలుగేళ్లలో పది శాతం మార్కెట్‌ వాటాపై దృష్టి
►  ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో మయాంక్‌ బత్వాల్‌


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆరోగ్య బీమా పాలసీలంటే ఎంతసేపూ అనారోగ్యం గురించి భయపెట్టేలానే ఉంటాయి. ఇలా కాదంటూ... ఆరోగ్య బీమాను పాజిటివ్‌ కోణంలో చూపించాలనుకుంటోంది కొత్తగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (ఏబీహెచ్‌ఐ). ఆరోగ్యకరమైన జీవన విధానాల్ని పాటించే పాలసీదారులకు కొంత ప్రీమియం తిరిగిచ్చేలా పాలసీలు రూపొందించింది. వాటి ప్రత్యేకతలు, కంపెనీ ప్రణాళికలను సాక్షి బిజినెస్‌ బ్యూరోకు వివరించారు సంస్థ సీఈవో మయాంక్‌ బత్వాల్‌. ఆ వివరాలు సంక్షిప్తంగా ..

ఇప్పటికే పలు స్టాండెలోన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలున్నాయి. కొత్తగా మీరు ఏం సాధించగలమనుకుంటున్నారు?
హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో ముందు హెల్త్‌ (ఆరోగ్యం).. తర్వాతే ఇన్సూరెన్స్‌ (బీమా). ఇదే కాన్సెప్ట్‌పై మేం దృష్టి పెడుతున్నాం. ప్రస్తుతం పాలసీలు విక్రయించే కంపెనీలు... మీకేమైనా అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు తల్లకిందులైపోతాయి.. ఇబ్బందుల పాలైపోతారు కాబట్టి మా పాలసీ తీసుకోండి అంటున్నాయి. సాధారణంగా కస్టమర్లు ఇలాంటి నెగటివ్‌ ప్రతిపాదనలు వినటానికి ఇష్టపడరు. అందుకే మేం దానికి పూర్తి భిన్నంగా కస్టమర్లలో సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహించేలా మా యాక్టివ్‌ హెల్త్‌ పాలసీని రూపొందించాం. ఆరోగ్యకరమైన జీవన విధానాలను పాటిస్తే.. దానికి ప్రతిఫలంగా ప్రీమియంలో కొంత మొత్తం వాపస్‌ చేస్తామనే ప్రతిపాదన తెచ్చాం. అటుపైన ఏదైనా జరిగితే బీమా కవరేజీ ఎలాగూ ఉంటుంది. ఈ ప్రతిపాదన ఇటు కంపెనీకి, అటు పాలసీదారుకు కూడా మంచిదే. పాలసీదారు ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. దీంతో కట్టిన ప్రీమియంలో కొంత తిరిగి వస్తుంది. అది పాలసీదారుకు రెండు రకాలుగా లాభం. పాలసీదారు అనారోగ్యం బారిన పడే అవకాశాలు తక్కువ కావడం వల్ల.. క్లెయిమ్‌లు కూడా తక్కువుంటాయి. మాకు లాభం.

ప్రీమియంల క్యాష్‌బ్యాక్‌కి సంబంధించి పాలసీదారు జీవన విధానాన్ని ఎలా ట్రాక్‌ చేస్తారు?
ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ యాప్స్‌ చాలానే అందుబాటులో ఉన్నాయి. పాలసీదారు తన ఫోన్లో సదరు యాప్‌ను, మా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఈ రెండింటినీ అనుసంధానించాలి. అక్కణ్నుంచి నడక, వ్యాయామం మొదలైన వాటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ఏరోజుకారోజు మా యాప్‌ ట్రాక్‌ చేస్తుంది. ఉదాహరణకు ఇవాళ ఎన్ని అడుగులు వేశారు (వాకింగ్‌), ఎంత సేపు జిమ్‌ చేశారు, కరిగిన కేలరీలు మొదలైన వివరాలన్నీ రికార్డవుతాయి. తదనుగుణంగా స్కోరింగ్, హెల్త్‌రిటర్న్స్‌ పేరిట రివార్డులుంటాయి. యాప్‌ ద్వారా లెక్కించేందుకు వీలు కాని యోగా వంటివి చేస్తున్న పక్షంలో మా వైద్య నిపుణులు ఫిట్‌నెస్‌ పరీక్ష సేవలు, తగు సూచనలు అందించేందుకు అందుబాటులో ఉంటారు. ఇలా మెరుగైన ఆరోగ్య విధానాలను పాటించేవారికి ... కట్టిన ప్రీమియంలో రెండున్నర శాతం నుంచి గరిష్టంగా 30 % దాకా రిటర్న్‌ ఇస్తాం. ఈ మొత్తాన్ని తదుపరి  ప్రీమియం కట్టేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇతర సంస్థల నుంచి పోటీ ఎలా ఉంది?
సుమారు ఇరవై కోట్ల మందికి ఆరోగ్య బీమా ఉంది. కానీ అది ప్రభుత్వ పథకాలు లేదా కార్పొరేట్‌ గ్రూప్‌ పాలసీల రూపంలోనే ఉంటోంది. వ్యక్తిగత హెల్త్‌ పాలసీల సంఖ్య 3 కోట్ల స్థాయిలోనే ఉంది. మరోవైపు వైద్య చికిత్స వ్యయాలు 12–14 శాతం మేర పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్త్‌ పాలసీలపై అవగాహన క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం దాదాపు రూ. 27,000 కోట్లుగా ఉన్న దేశీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందనుంది. మేం కార్పొరేట్‌ పాలసీలతో పాటు యాక్టివ్‌ హెల్త్‌ పేరిట రిటైల్‌ పాలసీ అందిస్తున్నాం. ఇందులోనే ప్రాథమికమైన, తీవ్రమైన అనారోగ్యాలు మొదలైన వాటికి వేర్వేరు ఆప్షన్స్‌ ఎంచుకోవచ్చు. డయాబెటిస్, బీపీ, ఆస్తమా వంటి నాలుగు క్రానిక్‌ డిసీజెస్‌ చికిత్సకు ఉచిత అప్‌గ్రెడేషన్‌ ఫీచర్‌ అందిస్తున్నాం. ఇప్పటికే ఇవి ఉన్నవారు గానీ పాలసీ తీసుకున్నా కూడా తొలి రోజు నుంచే కవరేజీ అందిస్తున్నాం. రిటైల్‌కి సంబంధించి ప్రోడక్టు ప్రస్తుతం ఒకటే అయినప్పటికీ .. సమగ్రంగా అన్నీ అందిస్తున్నాం. పోటీ అంటారా!! ఎన్ని సంస్థలు వచ్చినా ఆరోగ్యకరమైన పోటీనే ఉంటుంది. అంతిమంగా వినియోగదారులకు మంచిదే.

వ్యాపార ప్రణాళికలేంటి?
ప్రస్తుతం మా నెట్‌వర్క్‌లో సుమారు 150 నగరాల్లో 1600 పైచిలుకు ఆస్పత్రులున్నాయి. రెండువేలకు పైగా ఏజెంట్లున్నారు. ఏజేంట్లు, బ్యాంకులు, ఆన్‌లైన్‌ మొదలైన అన్ని మాధ్యమాల ద్వారా మా పాలసీల్ని విక్రయిస్తున్నాం. ప్రస్తుతం బ్యాంకెష్యూరెన్స్‌కి సంబంధించి కొన్ని బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ సహా ఏడు ప్రధాన నగరాల్లో శాఖలున్నాయి. రాబోయే ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో 100 నగరాల్లో ఏజెన్సీలను విస్తరిస్తాం. రాబోయే నాలుగేళ్లలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌లో కనీసం 8–10 శాతం వాటాను దక్కించుకోవాలని లకిష్యస్తున్నాం. ఒకే బ్యాంకు దాదాపు మూడు బీమా సంస్థల పాలసీలు విక్రయించేందుకు అనుమతులుండటం కలిసొచ్చే అంశం. దీనివల్ల పోటీ ఎలా ఉన్నా.. మరింత మందికి చేరువ అయ్యే వీలు దక్కుతుంది.

పర్సనల్‌ ఫైనాన్స్‌ బ్రీఫ్స్‌.. ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ ‘ఫిన్లే’లో ఇట్జ్‌క్యాష్‌ పెట్టుబడులు
ముంబై: దేశీ ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ రంగ సంస్థ ‘ఇట్జ్‌క్యాష్‌’ తాజాగా బెంగళూరుకు చెందిన ఎక్స్‌పెన్స్‌ మేనేజ్‌మెంట్‌ ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ ‘ఫిన్లే’లో ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లను చేసింది. దీంతో తమ ఎక్స్‌పెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కార్యకలాపాలు మరింత పటిష్టంగా తయారవుతాయని ఇట్జ్‌క్యాష్‌ పేర్కొంది. కంపెనీలకు సంబంధించిన ఎక్స్‌పెన్స్‌ మేనేజ్‌మెంట్‌ మార్కెట్‌లో 25 బిలియన్‌ డాలర్లమేర వృద్ధి అవకాశాలున్నాయని ఇట్జ్‌క్యాష్‌ చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌ భవికా వాసా తెలిపారు. ఫిన్లే స్టార్టప్‌ కంపెనీల కోసం ఒక ఎక్స్‌పెన్స్‌ మేనేజ్‌మెంట్‌ టూల్‌ను తయారు చేసిందన్నారు.

రూ.24 లక్షల కోట్లకు ఆస్తుల విలువ: ఎల్‌ఐసీ
ముంబై: బీమా రంగ దిగ్గజం– లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌  ప్రీమియం తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి తొమ్మిది నెలల ఆడిట్‌ గణాంకాలను ప్రకటించింది. వీటి ప్రకారం సంస్థ మొత్తం ప్రీమియం ఆదాయం 12.43 శాతం వృద్ధితో రూ.1.29 లక్షల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఎల్‌ఐసీ మొత్తం ఆస్తుల విలువ కూడా 12.81 శాతం వృద్ధితో రూ.21.6 లక్షల కోట్ల నుంచి రూ.24.4 లక్షల కోట్లకు ఎగసింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44,000 మంది ఏజెంట్లను నియమించుకుంది.

ఆర్థిక అక్షరాస్యతకు ఉజ్జీవన్‌ బ్యాంక్‌ షార్ట్‌ఫిల్మ్‌
ముంబై: ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్షియల్‌ బ్యాంక్‌ (ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ) తాజాగా వినియోగదారుల్లో ఆర్థిక అక్షరాస్యత తీసుకురావడం కోసం ఒక ఎడ్యుకేషనల్‌ షార్ట్‌ఫిల్మ్‌ ‘పైసన్‌ కి ఏబీసీడీ’ని నిర్మించింది. ఇది పరిణామ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ఈ సినిమాను తీసింది. ప్రదీప్‌ సర్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దాదాపు 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ద్వారా వినియోగదారుల్లో బ్యాంకింగ్‌పై ఉన్న అపోహలను తొలగించి, బ్యాంక్‌ ఖాతాల వల్ల కలిగే ప్రయోజనాలను వారికి తెలియజేస్తామని ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement