న్యూఢిల్లీ: దేశంలో సగటు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తం రూ.42,000గా ఉంది. మొత్తం మీద 15 శాతం క్లెయిమ్‌లు మాత్రమే రూ.లక్ష మించి ఉంటున్నాయి. సెక్యూర్ నౌ ఈ వివరాలను ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. హాస్పిటల్‌లో 5 రోజులకు పైగా ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చినప్పుడు, క్లెయిమ్ రూ.5 లక్షలు మించుతుందనే విషయాన్ని పాలసీదారులు పరిగణనలోకి తీసుకోవాలని.. అలాగే, బీమా సంస్థలు సైతం పాలసీల రూపకల్పనలో ఈ విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని నివేదిక ప్రస్తావించింది.
రీయింబర్స్‌మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను పరిశీలించినప్పుడు.. హాస్పిటల్‌లో ఎన్ని రోజులు ఉంటున్నారు, క్లెయిమ్ మొత్తం? పరిష్కార శాతం, భారత్‌లో క్లెయిమ్ పరిష్కార ప్రక్రియలో సమర్థత అంశాలు తెలుస్తాయని సూచించింది. 3,846 రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల పత్రాలను సెక్యూర్‌నౌ విశ్లేషించింది. భౌగోళికంగా భిన్న ప్రాంతాలు, వివిధ బీమా సంస్థల క్లెయిమ్‌లను పరిశీలించినప్పుడు ఈ అంశాలు తెలిశాయి.
క్లెయిమ్‌లలో 3 శాతం ప్రమాదం కారణంగా ఉంటున్నాయి. వీటి సగటు క్లెయిమ్ రూ.33,000గా ఉంటోంది. హాస్పిటల్‌లో ఎన్ని రోజులు ఉంటున్నారనేది హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో కీలక అంశంగా సెక్యూర్ నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా తెలిపారు. సాధారణంగా హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకోవడం అన్నది రెండు రోజులుగా ఉంటుంటే, 21 శాతం కేసుల్లో మూడు రోజులకంటే ఎక్కువగా ఉంటున్నట్టు ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. దీంతో ఎక్కువ రోజుల పాటు హాస్పిటల్‌లో చేరాల్సి వస్తే రక్షణ ఇచ్చే కాంప్రహెన్సివ్ కవర్ అవసరమని తెలిపింది.
మేటర్నిటీ క్లెయిమ్‌లు ఎక్కువ
50 శాతానికి పైగా క్లెయిమ్‌ల్లో పరిష్కార రేటు 80 శాతానికి పైన ఉంటోంది. మేటర్నిటీ క్లెయిమ్‌లు మొత్తం క్లెయిమ్‌ల్లో 20 శాతంగా ఉంటున్నాయి. జ్వరానికి సంబంధించి 5, కంటి సర్జరీలకు సంబంధించి 5 శాతం, ప్రమాదాలకు సంబంధించి 3 శాతం క్లెయిమ్‌లు వస్తున్నాయి. మొత్తం క్లెయిమ్‌లలో కేన్సర్ కేసులకు సంబంధించినవి కేవలం ఒక్క శాతంగానే ఉన్నాయి. కాకపోతే సగటు క్లెయిమ్ మొత్తం అధికంగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment