Insurance claim
-
మెడికల్ భారం.. బీమాతో కొంత దూరం
సాక్షి, అమరావతి: పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి చుట్టుముట్టేస్తున్నాయి. మరోవైపు వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వచ్చే డెంగీ, మలేరియా, విషజ్వరాలు విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. వెరసి ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల నుంచి గట్టెక్కడానికి బీమాను నమ్ముకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీని ఫలితంగా గత మూడేళ్లలో ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు 30 శాతం పెరిగాయి. దేశంలో సగటు క్లెయిమ్ పరిమాణం 2023లో రూ.62,014 ఉండగా, ప్రస్తుత ఏడాది రూ.70,152కు చేరుకుంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.81,025కు చేరుకుంటుందని అంచనా. ఈ విషయాలు ఇటీవల పాలసీ బజార్ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడయ్యాయి. డెంగీ, మలేరియా, విష జ్వరాలు తదితర సీజనల్ వ్యాధులతోపాటు గుండె, క్యాన్సర్ వంటి జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. యువత అధికం... ముఖ్యంగా యువత బీమా క్లెయిమ్‌లలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. 2024లో మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్‌లలో 18–35 మధ్య వయసు గల యువత వాటా 38.20 శాతం ఉంది. 36 నుంచి 45 మధ్య వయసు గల వారి వాటా 29.50 శాతం. దేశంలోని మొత్తం క్లెయిమ్‌లలో 14.5 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం 10.2 శాతంతో ఢిల్లీ, 5.90 శాతంతో హరియాణ వరుస స్థానాల్లో ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో గుండె చికిత్స క్లెయిమ్‌లు రెట్టింపు కావడంతోపాటు చికిత్సల ఖర్చులు 53 శాతం పెరిగాయి. ఇక గుండె జబ్బు, సహజ మరణాలు టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు కూడా అధికంగా ఉన్నాయి. గుండె జబ్బులకు సంబంధించి 25–30 శాతం, సహజ మరణాలు– 30–35 శాతం, ప్రమాదాలు–15.20 శాతం చొప్పున క్లెయిమ్‌లు నమోదయ్యాయి. -
పాలసీదారుల కోసం ‘బీమా సుగం’
న్యూఢిల్లీ: బీమా ఉత్పత్తులకు సంబంధించి అన్ని రకాల సేవలు అందించే ‘బీమా సుగం’ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఏర్పాటును బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ముసాయిదాను విడుదల చేస్తూ, మార్చి 4 నాటికి దీనిపై అభిప్రాయాలు తెలిజేయాలని కోరింది. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ, వారి సాధికారత కోసం ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ (ఆన్లైన్ వేదిక)ను ప్రతిపాదిస్తున్నట్టు ఐఆర్డీఏఐ ప్రకటించింది. దేశంలో బీమా వ్యాప్తికి (మరింత మందికి చేరువ), లభ్యత, అందుబాటు ధరల కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. కస్టమర్లు, బీమా సంస్థలు, మధ్యవర్తులు లేదా బీమా ఇంటర్మీడియరీలు, ఏజెంట్లకు ఇది ఏకీకృత పరిష్కారంగా ఉంటుందని పేర్కొంది. పారదర్శకతను, సమర్థతను, బీమా వ్యాల్యూ చైన్ వ్యాప్తంగా సహకారానికి, టెక్నాలజీ ఆవిష్కరణలకు, బీమా సార్వత్రీకరణకు, 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యం సాకారానికి తోడ్పడుతుందని వివరించింది. ఇది లాభాపేక్ష రహిత సంస్థగా పనిచేయనుంది. బీమా సుగంపై ఎవరికీ నియంత్రిత వాటా ఉండదని, జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు వాటాదారులుగా ఉంటాయని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. -
హెల్త్ ఇన్సూరెన్స్ సగటు క్లెయిమ్ రూ.42,000
న్యూఢిల్లీ: దేశంలో సగటు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తం రూ.42,000గా ఉంది. మొత్తం మీద 15 శాతం క్లెయిమ్‌లు మాత్రమే రూ.లక్ష మించి ఉంటున్నాయి. సెక్యూర్ నౌ ఈ వివరాలను ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. హాస్పిటల్లో 5 రోజులకు పైగా ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చినప్పుడు, క్లెయిమ్ రూ.5 లక్షలు మించుతుందనే విషయాన్ని పాలసీదారులు పరిగణనలోకి తీసుకోవాలని.. అలాగే, బీమా సంస్థలు సైతం పాలసీల రూపకల్పనలో ఈ విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని నివేదిక ప్రస్తావించింది. రీయింబర్స్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను పరిశీలించినప్పుడు.. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటున్నారు, క్లెయిమ్ మొత్తం? పరిష్కార శాతం, భారత్‌లో క్లెయిమ్ పరిష్కార ప్రక్రియలో సమర్థత అంశాలు తెలుస్తాయని సూచించింది. 3,846 రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌ల పత్రాలను సెక్యూర్‌నౌ విశ్లేషించింది. భౌగోళికంగా భిన్న ప్రాంతాలు, వివిధ బీమా సంస్థల క్లెయిమ్‌లను పరిశీలించినప్పుడు ఈ అంశాలు తెలిశాయి. క్లెయిమ్‌లలో 3 శాతం ప్రమాదం కారణంగా ఉంటున్నాయి. వీటి సగటు క్లెయిమ్ రూ.33,000గా ఉంటోంది. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటున్నారనేది హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో కీలక అంశంగా సెక్యూర్ నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా తెలిపారు. సాధారణంగా హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకోవడం అన్నది రెండు రోజులుగా ఉంటుంటే, 21 శాతం కేసుల్లో మూడు రోజులకంటే ఎక్కువగా ఉంటున్నట్టు ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. దీంతో ఎక్కువ రోజుల పాటు హాస్పిటల్లో చేరాల్సి వస్తే రక్షణ ఇచ్చే కాంప్రహెన్సివ్ కవర్ అవసరమని తెలిపింది. మేటర్నిటీ క్లెయిమ్‌లు ఎక్కువ 50 శాతానికి పైగా క్లెయిమ్‌ల్లో పరిష్కార రేటు 80 శాతానికి పైన ఉంటోంది. మేటర్నిటీ క్లెయిమ్‌లు మొత్తం క్లెయిమ్‌ల్లో 20 శాతంగా ఉంటున్నాయి. జ్వరానికి సంబంధించి 5, కంటి సర్జరీలకు సంబంధించి 5 శాతం, ప్రమాదాలకు సంబంధించి 3 శాతం క్లెయిమ్‌లు వస్తున్నాయి. మొత్తం క్లెయిమ్‌లలో కేన్సర్ కేసులకు సంబంధించినవి కేవలం ఒక్క శాతంగానే ఉన్నాయి. కాకపోతే సగటు క్లెయిమ్ మొత్తం అధికంగా ఉంటోంది. -
మెటర్నిటీ బీమా క్లెయిమ్ .. ఇలా సులభతరం
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) ఇటీవలి గణాంకాల ప్రకారం 2017లో ప్రసూతి సంబంధ కారణాలతో 2,95,000 మంది మహిళలు మరణించారు. వీటిలో చాలా మటుకు మరణాలు నివారించతగినవే. సాధారణంగా మెట ర్నిటీ, తత్సంబంధ వ్యయాలనేవి జీవితంలో భాగ మే అయినా ముందుగా ఊహించని వైద్య ఖర్చులేవైనా ఎదురైతే ఆర్థికంగా సన్నద్ధంగా ఉండాలి. ఇందుకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. దీనితో నార్మల్, సిజేరియన్ డెలివరీలకు కవరేజీ లభిస్తుంది. అయితే, పాలసీ, కవరేజీ రకాన్ని బట్టి ప్రయోజనాలు మారుతుంటాయి. సాధారణంగా మెటర్నిటీ ప్లాన్లలో కవర్ అయ్యేవి చూస్తే.. ఏవైనా సమస్యల వల్ల గర్భాన్ని తొలగించాల్సి రావడం, నిర్దిష్ట పరిమితి వరకూ నవజాత శిశువుకు కూడా కవరేజీ మొదలైన ప్రయోజనాలు ఉంటాయి. ప్రసవానికి ముందు, తర్వాత అయ్యే ఖర్చులు (డాక్టర్ కన్సల్టేషన్, రూమ్ చార్జీలు మొదలైనవి) కూడా కవర్ అవుతాయి. ఇక, ప్రీ–హాస్పిటలైజేషన్ ఖర్చులకూ (అడ్మిషన్ తేదికి ముందు 30 రోజుల వరకు అయ్యే వ్యయాలు) కవరేజీ ఉంటుంది. క్లెయిమ్ ప్రక్రియ .. ఇన్సూరెన్స్ సంస్థ, సౌకర్యాన్ని బట్టి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ మార్గాల్లో మెటర్నిటీ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయొచ్చు. ఆస్పత్రిని బట్టి క్యాష్‌లెస్ లేదా రీయింబర్స్మెంట్ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ ప్రక్రియను ఎంచుకునే పక్షంలో... - డెలివరీకి ఆస్పత్రిలో చేరుతున్న విషయాన్ని బీమా సంస్థకు ముందుగా తెలియజేసి, అవసరమైన వివరాలు ఇవ్వాలి. - ఆ తర్వాత క్లెయిమ్ ఫారంను డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలతో కలిపి సమర్పించాలి. - వివరాలను బీమా సంస్థ ప్రతినిధితో వె రిఫై చేయించుకోవాలి. - మరోవైపు, ఆఫ్‌లైన్ విషయానికొస్తే ఆయా పత్రాలను సమీపంలోని బీమా సంస్థ బ్రాంచ్‌లో సమర్పించి, క్లెయిమ్‌ను ఫైల్ చేయాలి. - క్లెయిమ్ ప్రక్రియ సులభతరంగా ఉండాలంటే పాలసీ పత్రాలు, క్లెయిమ్ ఫారం తప్పనిసరి గా దగ్గర ఉంచుకోవాలి. - అలాగే కన్సల్టేషన్ బిల్లు, అడ్మిషన్ సిఫార్సు, డిశ్చార్జి రసీదు, ఆస్పత్రి .. ఫార్మసీ ఒరిజినల్ బిల్లులు ఉండటం శ్రేయస్కరం. చదవండి: ఎక్సైడ్ లైఫ్ స్మార్ట్ ఇన్‌కం ప్లాన్ -
హెల్త్ క్లెయిమ్ ఇలా కూడా కాదంటారు!
బీమా పాలసీ తీసుకునేదే కష్ట కాలంలో ఆదుకుంటుందన్న భరోసాతో. తీరా బీమా క్లెయిమ్ అవసరం ఏర్పడిన సందర్భంలో.. పరిహారానికి అర్హత లేదంటూ బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను తిరస్కరిస్తే పరిస్థితి ఏంటి..? అందుకే బీమా పాలసీ పత్రంలో అడిగిన ప్రతీ సమాచారం పట్ల పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. పాలసీ పత్రాలపై సంతకం పెట్టేయడం కాకుండా.. అందులోని షరతులు, మినహాయింపులు, నిబంధనలు, పరిమితుల జాబితాను సమగ్రంగా తెలుసుకోవాలి. ఒక్క చిన్న కారణం కనిపించినా.. బీమా సంస్థలు పరిహారానికి నో చెప్పొచ్చు. అందుకే సదా నిక్కచ్చిగా వ్యవహరించాలి ఒక పాలసీదారు బైక్‌ను నడుపుతూ ప్రమాదానికి గురై మరణించడంతో.. అతని కుటుంబం క్లెయిమ్ కోసం దాఖలు చేసుకుంది. సదరు ప్రైవేటు సాధారణ బీమా సంస్థ పరిహారం చెల్లించేందుకు తిరస్కరించింది. దీనికి చూపించిన కారణం.. 346సీసీ బైక్‌ను నడుపుతూ ప్రమాదానికి గురై మరణించడమే. 150సీసీ సామర్థ్యానికి మించి ఇంజన్‌తో కూడిన బైక్‌ను నడుపుతూ ప్రమాదానికి గురైతే పరిహారం బాధ్యత తమపై ఉండదన్న షరతును కూడా సదరు కంపెనీ తమ పాలసీ పత్రాల్లో పేర్కొంది. అయినప్పటికీ పాలసీదారు కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించి బీమా పరిహారం లభించిందనుకోండి. అందుకే వివిధ బీమా సంస్థలు కొన్ని అరుదైన కారణాలతోనూ పరిహారం చెల్లింపులకు తిరస్కరిస్తున్నాయి. కొత్తగా పాలసీ తీసుకునే వారు, ఇప్పటికే పాలసీ తీసుకున్న వారు వీటిపై అవగాహన కలిగి ఉండడం ఎంతైనా అవసరం. వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్‌ను కలిగిన ఒక పాలసీదారు మామిడి చెట్టెక్కి కాయలు కోస్తూ జారి కిందపడి వైకల్యం పాలయ్యాడు. చాలా ప్రమాదకరమైన విన్యాసంగా దీన్ని పేర్కొంటూ సదరు బీమా కంపెనీ తొలుత క్లెయిమ్‌ను తిరస్కరించింది. ప్రమాదకరమైన చర్య కనుక.. పాలసీదారుకు అందులో నైపుణ్యం ఉందా? లేదా అన్నది పరిగణనలోకి రాదని బీమా కంపెనీ పేర్కొంది. ఎందుకంటే శాశ్వత మినహాయింపుల జాబితాలో ఇది కూడా ఉన్నట్టు వివరణ ఇచ్చింది. హజార్డస్ స్పోర్ట్/యాక్టివిటీగా దీన్ని చూపించింది. కాకపోతే తదనంతర పరిణామాలతో బీమా కంపెనీ దిగొచ్చి, క్లెయిమ్‌ను చెల్లించింది. కనుక పాలసీ డాక్యుమెంట్లో పేర్కొన్న ప్రమాదకర విన్యాసాలు, క్రీడల క్లాజ్ గురించి తప్పకుండా పాలసీదారులు ఒకసారి తెలుసుకొని, వాటికి దూరంగా ఉండడం మంచిది. 150సీసీ కంటే అధిక సామర్థ్యంతో కూడిన బైక్‌ను నడపడం ప్రమాదానికి దారితీస్తుందని, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన వాహనంతో ప్రమాదం ఉండదని చెప్పగలమా? కానీ కొన్ని బీమా కంపెనీలు ఈ వైఖరినే అనుసరిస్తున్నాయి. 150సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల వాహనం నడుపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది కనుక పరిహారం చెల్లించబోమంటూ ఒక కేసులో ప్రముఖ సాధారణ బీమా సంస్థ బదులివ్వడం గమనార్హం. ఈ విషయంలో పాలసీదారులు అవగాహన కలిగి ఉండాలి. ‘‘వాస్తవానికి ఏడాది క్రితం వరకు ఎక్కువ ప్లాన్లలో ఈ నిబంధన ఉండేది. కానీ, ఇందులో మార్పు వచ్చింది. అయినప్పటికీ ప్రమాద బీమా ప్లాన్‌ను తీసుకున్న వారు, తీసుకోవాలని అనుకునే వారు పాలసీ డాక్యుమెంట్‌ను ఆసాంతం ఒక్కసారి చదివి ఈ తరహా కొర్రీలేవైనా ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. లేదంటే ఆర్థిక సలహాదారు సాయం తీసుకోవాలి’’ అని భేషక్ డాట్ ఓఆర్జీ వ్యవస్థాపకుడు మహావీర్ చోప్రా తెలిపారు. తిరస్కరిస్తే మార్గం ఏంటి? పరిహారం తిరస్కరణకు గురైందని ఆందోళన పడక్కర్లేదు. మీ క్లెయిమ్ నిజాయితీతో కూడినదేనని బీమా కంపెనీని ఒప్పించడం ద్వారా పరిహారం అందుకోవచ్చు. దీనికంటే ముందే బీమా సంస్థ క్లెయిమ్ ఎందుకు తిరస్కరించిందన్నది సరిగ్గా అర్థం చేసుకోవాలి. కారణాలను విశ్లేషించుకోవాలి. మీరు తీసుకున్న పాలసీకి సంబంధించి నియమ, నిబంధనలను, మినహాయింపుల గురించి మరోసారి సమీక్షించుకోవాలి. ఒక్కోసారి దరఖాస్తు, దానికి అనుబంధంగా అందజేసిన చికిత్సా సమాచారం అసంపూర్ణంగా ఉంటే.. అప్పుడు అదనపు పత్రాలను, సమాచారాన్ని ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. క్లెయిమ్ తిరస్కరణ ముందే బీమా సంస్థ పూర్తి విచారణ చేస్తుంది. అన్ని పత్రాలను పరిశీలించి నిబంధనల మేరకు వ్యవహరిస్తుంది. కానీ, బీమా కంపెనీ పరిహారం చెల్లించకపోవడం వెనుక సహేతుక కారణం లేదని మీరు గుర్తిస్తే బీమా కంపెనీలోని ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని సంప్రదించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ డెనియల్ అప్పీల్లెటర్ ద్వారా తిరిగి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. కంపెనీ నిర్ణయం సరైంది కాదంటూ అందుకు మద్దతుగా పత్రాలను సమర్పించాలి. ఒకవేళ టీపీఏ నుంచి తీసుకుంటే వారిని సంప్రదించి, పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. పరిష్కారం లభించకపోతే ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మెన్ కార్యాలయాన్ని ఆశ్రయించొచ్చు. అక్కడ కూడా న్యాయం లభించకపోతే అప్పుడు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరమ్ సాయం కోరొచ్చు. చికిత్స కోసం కాకుండా.. ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ డాక్టర్ సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన అనంతరం.. ఎన్నో రక్తపరీక్షలు, డెంగ్యూ, మలేరియా, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి కూడా జ్వరానికి కారణాన్ని వైద్యుడు గుర్తించలేకపోయాడని అనుకుందాం. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకుని పరిహారం కోసం బీమా సంస్థకు క్లెయిమ్ దాఖలు చేసుకుంటే తిరస్కరణకు అవకాశం లేకపోలేదు. ‘యాక్టివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్’ కొనసాగలేదని బీమా సంస్థ ఎత్తిచూపొచ్చు. ఎటువంటి వ్యాధి నిర్ధారణ లేకుండా, వైద్య పరీక్షలు, చికిత్స చేస్తే అందుకు పరిహారాన్ని బీమా సంస్థలు చెల్లించకపోవచ్చు. అంతేకాదు సరైన విధంగా చికిత్స చేయకపోయినా (యాక్టివ్లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) పరిహారం ఇవ్వబోవు. ‘‘జ్వరానికి ఔట్ పేషెంట్ కింద చికిత్స చేయవచ్చంటూ కొన్ని క్లెయిమ్‌లను బీమా కంపెనీలు ఆమోదించకపోవచ్చు. ఇది సహేతుకమే. కానీ, ఒక పేషెంట్‌గా వైద్యులు యాక్టివ్లైన్ ట్రీట్మెంట్ను అనుసరిస్తున్నారా? లేదా అన్నది తనకు ఎలా తెలుస్తుంది. ఈ లోపాన్ని పరిహరించాల్సి ఉంది’’ అని ష్యూర్క్లెయిమ్ సీఈవో అనుజ్ జిందాల్ పేర్కొన్నారు. పాక్షిక చెల్లింపులు కరోనా కారణంగా ఎదురైన క్లెయిమ్‌లలో బీమా కంపెనీలు పాక్షిక చెల్లింపులు చేసినవి చాలానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్ణయించిన ధరలకే తాము చెల్లింపులు చేస్తామన్నది బీమా కంపెనీల వాదన. ‘‘ఈ నిబంధన నిజంగా అడ్డంకే. ముఖ్యంగా నాన్ నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని రీయింబర్స్మెంట్ చేసుకునే వారికి ఇబ్బందికరం. సహేతుక చార్జీల గురించి పాలసీదారునకు ఎలా తెలుస్తుంది? బీమా సంస్థలే చికిత్సల సాధారణ చార్జీల గురించి పారదర్శకంగా వెల్లడించడం మంచిది’’ అన్నది జిందాల్ అభిప్రాయం. ముంబైకి చెందిన కార్యకర్త గౌరంగ్ దమానీ ఇదే విషయమై లోగడ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా.. ఈ నిబంధన ఎత్తివేయాలంటూ ఐఆర్డీఏఐకూ లేఖ రాశారు. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు ఎక్కువగా ఫిక్స్డ్ బెనిఫిట్ ప్రయోజనంతో ఉంటాయి. సంబంధిత వ్యాధి నిర్ధారణ అయి నిర్ణీత రోజుల పాటు జీవించి ఉంటే పరిహారం మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయి. ముఖ్యంగా కేన్సర్ వంటి చికిత్సల్లో బీమా సంస్థలు పాక్షిక చెల్లింపులే చేస్తున్నాయి. కేన్సర్లను ముందస్తు దశలో గుర్తిస్తే.. 25 శాతం బీమానే అందిస్తున్నాయి. కేన్సర్‌కు సంబంధించి ముఖ్యమైన చికిత్సలకు మాత్రం పూర్తి పరిహారం లభిస్తుంది. మినహాయింపులు పాలసీ పత్రంలో మినహాయింపులను స్పష్టంగా పేర్కొంటారు. ఆ జాబితాలోని వాటికి చికిత్స తీసుకుంటే పరిహారం రాదు. ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్‌లో పరిహారం రాదు. పాలసీ తీసుకునే నాటికి ఉన్న ఆరోగ్య సమస్యలను వెల్లడిస్తే.. 3–4 ఏళ్ల వెయిటింగ్ తర్వాతే వాటికి కవరేజీ లభిస్తుంది. సకాలంలో ప్రీమియం చెల్లించకపోవడం వల్ల ల్యాప్స్ అయిన పాలసీలకు సంబంధించి కూడా క్లెయిమ్ కోరలేరు. నాన్ నెట్వర్క్ ఆస్పత్రిలో చేరి క్యాష్‌లెస్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నా, రీయింబర్స్ మెంట్ రూపంలో రావాలని అడగొచ్చు. వాస్తవాలను చెప్పకపోవడం, దాచిపెట్టడం.. బీమా కంపెనీలు పరిహారం చెల్లింపులను తిరస్కరించడానికి చూపించే కారణాల్లో.. పాలసీదారు పూర్తి సమాచారం వెల్లడించకపోవడమే ఎక్కువగా ఉంటోంది. పాలసీ డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివేవారు చాలా తక్కువ. ఇదే సమస్యకు కారణం అవుతోంది. ముఖ్యంగా తమ వృత్తి లేదా చేస్తున్న ఉద్యోగం గురించి చెప్పకపోవడం, ఆదాయం, అప్పటికే కలిగి ఉన్న బీమా పాలసీలు, ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలను తెలియజేయకపోవడం వంటివి భవిష్యత్తులో క్లెయిమ్‌లు తిరస్కరణకు దారితీయవచ్చు. ఎందుకంటే పాలసీదారు వెల్లడించే సమాచారం ఆధారంగానే బీమా సంస్థలు రిస్క్‌ను అర్థం చేసుకుంటాయి. ఆ సమాచారం ఆధారంగా భవిష్యత్తులో క్లెయిమ్‌లు ఏ మేరకు రావచ్చన్నది అంచనా వేస్తాయి. తదనుగుణంగా ప్రీమియంను నిర్ణయిస్తాయి. మరి పాలసీ దరఖాస్తులో చెప్పిన సమాచారానికి, పాలసీదారు వాస్తవ ఆరోగ్య పరిస్థితులకు పొంతన లేకపోతే అప్పుడు బీమా సంస్థ ఆ భారాన్ని మోయడానికి అంగీకరించదు. కనుక తప్పనిసరిగా పూర్తి వాస్తవిక సమాచారాన్ని వెల్లడించాలి. కావాలని కాకుండా, అవగాహన లేక వెల్లడించకపోయినా ఆ బాధ్యత బీమా కంపెనీపై ఉండదు. గతంలో ఏవైనా పాలసీల కోసం దరఖాస్తు చేసుకుని, బీమా కంపెనీ నుంచి తిరస్కరణకు గురైనా ఆ సమాచారం కూడా తెలియజేయాల్సి ఉంటుంది. సకాలంలో క్లెయిమ్ దరఖాస్తు అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చేరిన 24 గంటల్లోగా క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న పాలసీ నిబంధనలు, ఎటువంటి చికిత్స కోసం చేరారన్న అంశాల ఆధారంగా ఈ సమయం పరిమితుల్లో మార్పులు ఉండొచ్చు. కానీ, సాధ్యమైనంతగా 24 గంటల్లోపే క్లెయిమ్ దాఖలు చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆలస్యంగా ఈ పనిచేస్తే క్యాష్‌లెస్ క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. దీంతో ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఇందుకోసం ఆస్పత్రిలో చేరకముందు, చేరిన తర్వాత చికిత్సకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు, బిల్లులు జాగ్రత్త చేసుకోవాలి. డిశ్చార్జ్సమ్మరీ తీసుకోవాలి. వైద్య పరీక్షల పత్రాలను కూడా జత చేసి క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకంగా వ్యవహరించాల్సిందే.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిష్కారంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాలంటూ అన్ని బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఇప్పటికే కోరింది. అన్ని దశల్లోనూ పాలసీదారులతో పారద్శకమైన సంప్రదింపులు నిర్వహించాలని ఆదేశించింది. క్యాష్‌లెస్ క్లెయిమ్‌ల పరిష్కారం, పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంగా కోరింది. ఒకవేళ థర్డ్ పార్టీ ద్వారా ఈ సేవలు అందిస్తున్నా కానీ, అన్ని రకాల సంప్రదింపులు పద్ధతి ప్రకారం ఉండాల్సిందేనని ఆదేశించింది. అంతేకాదు, బీమా కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరించిన సందర్భాల్లో కారణాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. -
అసలే వర్షాకాలం, కారు ఇంజిన్ పాడైతే బీమా వర్తిస్తుందా? ఏం చేయాలి?
వర్షాకాలం వచ్చింది అంటే చాలు వాహదారులకు పట్టపగలు చుక్కలు కనిపిస్తాయి. చిన్న పాటి వర్షానికి మన మెట్రో నగరాలు సముద్రాలను తలపిస్తాయి. వర్షం కాలంలో వాహనాలకు ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. అందుకే వర్షాకాలంలో ప్రతి సంవత్సరం ఇంజిన్ సమస్యలతో బీమా కంపెనీలకు భారీగా క్లెయిమ్స్ వస్తాయి. వర్షాకాలంలో వచ్చే చాలా క్లెయిమ్స్ ప్రకృతి కారణంగా నష్ట పోయినవే. నీరు లేదా హైడ్రోస్టాటిక్ లాక్ కారణంగా కారు ఇంజిన్ డ్యామేజీ అవుతాయి. కారు యజమానుల నిర్లక్ష్యం చేత బీమా కంపెనీలు ఎక్కువగా ఈ క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నాయి. నీటి వల్ల ఇంజిన్ దెబ్బతినడం సాధారణంగా రెండు సందర్భాల్లో జరుగుతుంది. ఒకటి కారు నీటిలో మునిగిపోయినప్పుడు, రెండవది కారు యజమాని వరద నీటిలో నుంచి ప్రయాణించినప్పుడు. మొదటి సందర్భంలో కారు మునిగిపోయి తేలిన తర్వాత వాహన యజమాని ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, మీరు ఇటువంటి సందర్భంలో బీమా కంపెనీకి కాల్ చేయడం మంచిది. కాల్ చేశాక మీ పరిస్థితి వివరించి ఏమి చేయాలో అడగండి. తనిఖీ కొరకు వారు వాహనాన్ని దగ్గరల్లో ఉన్న అధీకృత గ్యారేజీకి తీసుకెళ్లాలని బీమా కంపెనీ సూచించవచ్చు. ఒకవేళ ఇంజిన్ పూర్తిగా పాడైపోయినట్లయితే అది ప్రమాదంగా పరిగణిస్తారు, అది నిర్లక్ష్యం కాదు. ఇక రెండవ సందర్భంలో నీటితో నిండిన ప్రాంతం గుండా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంజిన్ డ్యామేజీని వివాద అంశంగా పరిగణిస్తారు. అయితే, డ్రైవ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి వారికి ఎలాంటి మార్గం లేనందున బీమా కంపెనీ ఇటువంటి క్లెయిమ్స్ తిరస్కరిస్తాయి. ఇలాంటప్పుడు ఏమి చేయాలంటే, వరద ప్రాంతంలో కారు మునిగిపోతే దానిని స్టార్ట్ చేయకుండా ఉండటం మంచిది. నీటి మట్టం తగ్గిన తర్వాత, బీమా కంపెనీకి కాల్ చేసి, ఏమి చేయాలో అడగండి. ఇటువంటి సమయంలో క్లెయిమ్స్ తిరస్కరించే అవకాశం తక్కువ. లోతట్టు ప్రాంతాలలో, ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న వారు ఇటువంటి వివాదాలను పరిష్కరించడం కొరకు, మీరు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ కవర్ ని తీసుకుంటే మంచిది. యాడ్ ఆన్ ఇంజిన్ కు అన్ని రకాల డ్యామేజీలను కవర్ చేస్తుంది. ఒకవేళ నీరు క్యాబిన్ లోనికి ప్రవేశించి, స్పీకర్ లు, సెన్సార్ లు, ఎలక్ట్రిక్ ఎక్విప్ మెంట్ వంటి భాగాలు డ్యామేజీ అయితే, బీమా కంపెనీ వీటికి నగదు చెల్లించదు. ఫ్యాక్టరీలో ఫిట్ చేయబడ్డ భాగాలకు మాత్రమే చెల్లిస్తుందని గమనించాలి. చదవండి: రెండో రోజు భారీగా పడిపోయిన బంగారం ధరలు -
ఎస్బీఐ జనరల్: వరద సహాయక క్లెయిములకు రెడీ
హైదరాబాద్, సాక్షి: రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇటీవల వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతవాసులకు చేయూత నందించేందుకు బీమా రంగ కంపెనీ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వరదల వల్ల నష్టపోయిన రైతులు, వ్యాపారస్తులు తదితర వ్యక్తులకు త్వరితగతిన బీమా క్లెయిములను పరిష్కరించనున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆస్తులు, వ్యాపారాలు, పంటలు తదితరాలలో ఏర్పడిన నష్టాలకుగాను బీమా ప్రయోజనాలను వేగంగా అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేసింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్ధపేట, కరీమ్నగర్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో వరదవల్ల నష్టాలు సంభవించినట్లు పేర్కొంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్టణం జిల్లాలు వరదవల్ల ప్రభావితమైనట్లు అభిప్రాయపడింది. ఈ ప్రాంతాలలోని కస్టమర్లకు వరద నష్టంకింద పరిహారం అందించేందుకు అక్టోబర్ నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేసింది. వరదల కారణంగా చిన్నతరహా పరిశ్రమల(ఎస్ఎంఈలు) యూనిట్లు, ఫ్యాక్టరీలు, గోదాములు, దుకాణాలు తదితర కార్యకలాపాలకు విఘాతం ఏర్పడినట్లు పేర్కొంది. ఇప్పటికే 120 క్లెయిములను పరిష్కరించినట్లు ఈ సందర్భంగా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో పీసీ కంద్పాల్ వెల్లడించారు. వీటిలో అత్యధికం ఎస్‌ఎంఈలుకాగా.. వివిధ మార్గాల ద్వారా తమ పాలసీదారులకు క్లెయిముల సెటిల్మెంట్పై అవగాహన కల్పించినట్లు తెలియజేశారు. ఆస్తులు, బిజినెస్‌లు నష్టపోయినట్లు 120కుపైగా క్లెయిమ్‌లు అందగా.. 100 మోటార్ క్లెయిములు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిలో అత్యధికం హైదరాబాద్, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలియజేశారు. కస్టమర్లకు వాటిల్లిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని క్లెయిములను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. -
కోవిడ్–19 చికిత్స: సెప్టెంబర్‌లో పెరిగిన బీమా క్లెయిమ్స్
న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సకు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంఖ్య సెప్టెంబర్‌లో పెరిగింది. సమీక్షా నెలలో మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను పరిశీలిస్తే, వీటిలో కోవిడ్–19 చికిత్స సంబంధిత క్లెయిమ్స్ 40 శాతానికి ఎగశాయని తమ గణాంకాల విశ్లేషణలో వెల్లడైనట్లు ఈ రంగంలో దిగ్గజ అగ్రిగేటర్ పాలసీబజార్ డాట్ కామ్ పేర్కొంది. నెలల వారీగా ఈ శాతాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు వెల్లడించింది. దీనిప్రకారం, మేలో ఈ రేటు కేవలం 8 శాతం ఉంటే, జూలై, ఆగస్టుల్లో వరుసగా 23, 34 శాతాలకు చేరింది. పాలసీబజార్ డాట్ కామ్‌లో ఆరోగ్య బీమా విభాగం చీఫ్ అమిత్ ఛబ్రా వివరించిన అంశాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే... ► కోవిడ్–19 చికిత్స క్లెయిమ్స్ దాఖలు చేసిన వారిలో అత్యధికులు 60 సంవత్సరాలవారు ఉన్నారు. తరువాతి శ్రేణిలో 41 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు్కలు ఉన్నారు. చదవండి: ఆ నష్టం రూ.1.25 లక్షల కోట్లు ►కరోనా కేసుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లోనే భారీగా పెరిగింది. రికవరీ కూడా అధికంగా ఉంది. ►ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ మధ్య చూస్తే, మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో కోవిడ్–19 చికిత్స క్లెయిమ్స్ వాటా 26 శాతంగా ఉంది. నాన్–కోవిడ్–19 విషయంలో ఈ రేటు 74 శాతంగా ఉంది. ఈ విభాగంలోకి గుండె, ఊపిరితిత్తులు, నాడీ సంబంధ సమస్యలు వచ్చాయి. ►క్లెయిమ్‌లకు సంబంధించి విలువ సగటున రూ.1,18,000గా ఉంది. అయితే ఒక్క 46–50 మధ్య వయస్సువారి విషయంలో క్లెయిమ్ విలువ గరిష్టంగా రూ.2.19 లక్షలుగా ఉంది. ►బీమా రెగ్యులేటరీ సంస్థ– ఐఆర్డీఏఐ కోవిడ్–19 ప్రత్యేక పాలసీలకు అనుమతినిచ్చిన తొలి నెలల్లో వీటి కొనుగోలుకు డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు సమగ్ర హెల్త్ కవర్ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్–10 బీమాల వైపు నుంచి మరింత సమగ్ర ప్రణాళికలవైపు మారడానికి ప్రజలకు అనుమతినిస్తూ, ఐఆర్డీఏఐ ఇచి్చన అనుమతులు హర్షణీయం. ►నెలవారీ ప్రీమియం పేమెంట్ విధానానికి అనుమతించడం హర్షించదగిన మరో కీలకాంశం. ఇప్పుడు 35 సంవత్సరాల ఒక వ్యక్తి రూ.1,000 నుంచి రూ.1,500 నెలకు చెల్లించి కోటి రూపాయల వరకూ బీమా కవర్ పొందగలుగుతున్నాడు. ►నాన్–కోవిడ్–19 క్లెయిమ్స్ విషయానికి వస్తే, ఆసుపత్రుల్లో బెడ్ల వినియోగం ఇప్పుడు గణనీయంగా పెరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన రోగులు ఇప్పుడు చికిత్స, ఆపరేషన్లకోసం పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతుండడమే దీనికి కారణం. ►పెద్దల్లో కంటి సంబంధ ఇబ్బందులు ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. 61 సంవత్సరాలు పైబడి ఆరోగ్య బీమా ఉన్న సీనియర్ సిటిజన్లలో దాదాపు 20 శాతం కంటి సంబంధ చికిత్సలకు బీమా సౌలభ్యతను వినియోగించుకుంటున్నారు. తగ్గనున్న ఆసుపత్రుల లాభం :క్రిసిల్ కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ లాభం సుమారు 35–40% తగ్గనుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. వైరస్ భయంతో ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళకపోవడం,చికిత్సలను వాయిదా వేసుకోవడం దీనికి ప్రధాన కారణంగా తెలిపింది. ఏజెన్సీ.. రేటింగ్ ఇచి్చన 36 ఆసుపత్రులతో కలిపి మొత్తం 40 హాస్పిటల్స్‌ను విశ్లేషించి రూపొందిన ఈ నివేదిక ప్రకారం.. కోవిడ్ కేసులు ఎక్కువగా వచి్చనప్పటికీ వీటి ద్వారా పొందిన మార్జిన్ తక్కువగా ఉంది. అయితే ఈ కేసుల నుంచి అదనంగా 15–20 శాతం ఆదాయం సమకూరింది. లాక్డౌన్, ప్రయాణ సడలింపులతో జులై నుంచి రోగుల రాక క్రమంగా మెరుగు పడుతూ వచి్చంది. -
‘నన్ను చంపేయండి.. ఇన్సూరెన్స్ వస్తుంది’
న్యూఢిల్లీ: అప్పులు పాలైన ఓ వ్యాపారవేత్త తాను చనిపోతే.. కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి.. వారి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో తన హత్యకు తానే సుపారి ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారవేత్తను హత్య చేసిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నాడు. వివరాలు.. చనిపోయిన వ్యాపారవేత్త ఆనంద్ విహారి ఈ నెల 9 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో జూన్ 10న రన్హోలా పోలీస్ స్టేషన్‌కు ఒక పీసీఆర్ కాల్ వచ్చింది. బాప్రోలా విహార్‌లోని ఖేడి వాలా పుల్ సమీపంలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఉన్నాడని కాల్ చేసిన వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఫోన్ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ 35 సంవత్సరాల వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని పరిశీలించిన తరువాత, ఆ వ్యక్తి చేతులు కట్టివేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేయగా మృతుడిని తప్పిపోయిన వ్యాపారవేత్త ఆనంద్ విహారిగా గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతుడి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. ఆనంద్ విహారి తప్పిపోయినట్లుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈలోపు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా పోలీసులు ఒక నిందితుడిని పట్టుకున్నారు. అతడిని విచారించగా నేరంలో తన పాత్రను అంగీకరించాడు. అంతేకాక తనతో పాటు మరో ఇద్దరికి కూడా ఈ నేరంలో పాత్ర ఉన్నట్లు సదరు నిందితుడు తెలిపాడు. ఓ మైనర్ కుర్రాడు చెప్పడంతో సదరు వ్యాపారవేత్తను హత్య చేసినట్లు అతడు వెల్లడించాడు. ఈ క్రమంలో మైనర్ కుర్రాడిని పట్టుకుని ఆరా తీయగా అతడు ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడించాడు. సదరు వ్యాపారవేత్త అప్పుల పాలయ్యాడని.. తాను చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని.. దాంతో కుటుంబ సభ్యులైన బాగుంటారని భావించాడు. ఈ క్రమంలో తనను చంపాల్సిందిగా మైనర్ కుర్రాడికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలో మరో ఇద్దరితో కలిసి అతడు వ్యాపారవేత్తను హత్య చేశాడు. -
కరోనా క్లెయిమ్‌లు సత్వరం సెటిల్ చేయండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాధి సంబంధిత క్లెయిమ్‌లను తక్షణం పరిష్కరించాలని బీమా సంస్థలను ఐఆర్డీఏఐ(ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశించింది. కరోనా వైరస్ చికిత్సకు సంబంధించిన వ్యయాలు కవరయ్యేలా పాలసీలు రూపొందించాలని బీమా సంస్థలకు సూచించింది. కాగా కరోనా వైరస్ సోకిన వ్యక్తి కనీసం 24 గంటల పాటు హాస్పిటల్లో ఉండి చికిత్స తీసుకుంటే క్లయిమ్‌లు పరిష్కరిస్తామని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ హెడ్ సుబ్రహ్మణ్యం బ్రహ్మజోస్యుల చెప్పారు. భారత్‌లో చాలా ఆరోగ్య బీమా పాలసీలు అవుట్‌పేషెంట్ ట్రీట్మెంట్ కవర్ చేయవని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి జబ్బు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ, భారత ప్రభుత్వం కానీ ప్రకటిస్తే, కరోనా వైరస్ సోకిన వ్యక్తుల క్లెయిమ్‌లు చెల్లవని వివరించారు. కాగా కరోనా సోకిన వ్యక్తి హాస్పిటల్లో ఉంటే హాస్పిటలైజేషన్ పాలసీల కింద వీరి క్లెయిమ్‌లను సత్వరం సెటిల్ చేస్తామని మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎమ్డీ, సీఈఓ ఆశీష్ మోహరోత్ర చెప్పారు. అయితే కరోనా వైరస్ సోకిన వ్యక్తి క్వారంటైన్లో ఉంటే క్లెయిమ్‌ల విషయంలో ఏ బీమా కంపెనీ కూడా స్పష్టతనివ్వలేదు. -
సిలిండర్ పేలుళ్లకు పరిహారమేదీ?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా ప్రమాదవశాత్తూ వంటగ్యాస్ సిలిండర్ పేలుళ్లకు వందలాది మంది బలవుతున్నా, భారీగా ఆస్తినష్టం సంభవిస్తున్నా బాధిత కుటుంబాలు చట్ట ప్రకారం పొందాల్సిన బీమా పరిహారానికి నోచుకోవడంలేదు. ప్రమాదాలకు గురయ్యే ఎల్పీజీ వినియోగదారులకు తప్పనిసరిగా చెల్లించాల్సిన బీమా పరిహారాన్ని అందించడంలో ప్రభుత్వరంగ చమురు సంస్థలు విఫలమవుతున్నాయి. దీనిపై వినియోగదారులకు కనీస అవగాహన లేకపోవడం, చమురు సంస్థలు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు సైతం పెద్దగా ప్రచారం చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదాలకు బీమా సదుపాయం ఉందని తెలిసిన అతికొద్ది మందికే తూతూమంత్రంగా పరిహారం దక్కుతోంది. గత పదేళ్లలో గ్యాస్ సిలిండర్ పేలుళ్ల కారణంగా తెలంగాణలో 657 మంది మృతిచెందగా కేవలం 25 మందికే బీమా పరిహారం అందగా దాదాపు 2,300 మంది క్షతగాత్రుల్లో ఏ ఒక్కరికీ పరిహారం లభించలేదు. అలాగే ఈ ప్రమాదాల్లో 1,100కుపైగా ఇళ్లు ధ్వంసమైతే ఆస్తి నష్టం కింద బాధితులకు పైసా పరిహారం కూడా దక్కలేదు. చమురు సంస్థలు ప్రీమియం చెల్లిస్తున్నా... ఏదైనా కారణం చేత వంటగ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించి ఎవరైనా మరణించినా, ఆస్తులకు నష్టం వాటిల్లినా బీమా పరిహారం తప్పనిసరి. ప్రభుత్వరంగ చమురు సంస్థలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు తమ పబ్లిక్ లయబిలిటీ పాలసీని అనుసరించి (పాలసీ నంబర్ 021700/ 46/14/37/0000041) ఒక్కో వ్యక్తి మరణానికి రూ. 5 లక్షల చొప్పున, ఒక్కో క్షతగాత్రుడికి గరిష్టంగా రూ. లక్ష చొప్పున, ప్రమాదం మొత్తంమీద గరిష్టంగా రూ. 15 లక్షలను వైద్య ఖర్చుల కింద బీమా పరిహారంగా చెల్లించాల్సి ఉంది. అలాగే ఆస్తి నష్టానికి గరిష్టంగా రూ. లక్ష పరిహారం అందించాల్సి ఉంది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు బీమా కంపెనీలకు ప్రీమియం (పర్ సిలిండర్) చెల్లిస్తున్నాయి. ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లతో పోలిస్తే అనూహ్యంగా పెరిగింది. 2010 దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ల వాడకం 28 శాతం ఉండగా ఇప్పుడది 83 శాతానికి పెరిగింది. పట్టణ, నగర ప్రాంతాల్లో ఏటేటా 11 శాతం నుంచి 13 శాతం మేర కనెక్షన్లు పెరుగుతున్నాయి. దాంతోపాటే సిలిండర్ పేలుడు ప్రమాదాలూ ఎక్కువవుతున్నాయి. వినియోగదారులు, డీలర్లలో అవగాహనలేమి... ఎల్పీజీ వినియోగదారుల్లో అత్యధిక శాతం మందికి బీమా సదుపాయం ఉందన్న సంగతే తెలియదు. పట్టణ ప్రాంతాల్లో 85 శాతం మంది వినియోగదారులు, 60 శాతం మంది డీలర్లకు బీమా సదుపాయం గురించి అవగాహన లేదని విస్తరణ మాస్ కమ్యూనికేషన్ సొసైటీ పరిశీలనలో బయటపడింది. ఈ విషయంలో వినియోగదారులు, డీలర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాలేవీ ఆయిల్ కంపెనీలు చేపట్టడం లేదు. ఆయిల్ కంపెనీలు తమ నుంచి సరఫరా అయ్యే ప్రతి సిలిండర్‌కు ప్రీమియం చెల్లిస్తున్నా ప్రచారం చేయకపోవడంతో వినియోగదారులు, డీలర్లకు దీని గురించి తెలియడంలేదు. తమిళనాడు, కేరళ మినహా దేశంలో అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో సిలిండర్ పేలుళ్లు ఎక్కువగా జరుగుతున్న విషయం గమనించిన పరివర్తన్ మరఠ్వాడా అనే స్వచ్ఛంద సంస్థ బాధిత కుటుంబాల చేత స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయించి మరీ బీమా కంపెనీల నుంచి పరిహారం ఇప్పిస్తోంది. వీరెవరికీ పరిహారం రాలేదు గతేడాది నవంబర్ 19న హైదరాబాద్‌లోని తుకారాంగేట్ పీఎస్ పరిధిలో ఉన్న అడ్డగుట్టలో ఓ ఇంట్లో సిలిండర్ పేలి దినేష్ అనే టీనేజర్ మరణించడంతోపాటు ఇల్లు ధ్వంసమైంది. నిబంధన ల ప్రకారం అతని తల్లిదండ్రులకు రూ. 5 లక్షల మేర బీమా పరిహారం, ఇల్లు ధ్వంసమైనందుకు మరో రూ. లక్ష అందాల్సి ఉన్నా అందలేదు. 2017 మార్చి 27న హిమాయత్‌నగర్‌లోని శ్యామల బుచ్చమ్మ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఇల్లు సగభాగం ధ్వంసమైంది. దాదాపు రూ. 25 లక్షల మేర నష్టం వాటిల్లినా నిబంధనల మేరకు రావాల్సిన లక్ష పరిహారం కూడా రాలేదు. గతేడాది జూలై 26న కుల్సుంపురాలో సిలిండర్ పేలుడు ప్రమాదంలో రామకృష్ణ (55) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎవరికీ పైసా బీమా పరిహారం అందలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో గతేడాది సెప్టెంబర్ 4న సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబానికి రూ. 10 లక్షల మేర బీమా రావాల్సి ఉన్నా ఆయిల్ కంపెనీగానీ, ఎల్పీజీ డీలర్గానీ పట్టించుకోలేదు. డీలర్ల నిర్లక్ష్యమే... వినియోగదారులు లేదా గోడౌన్లలో పని చేసే సిబ్బంది ప్రమాదవశాత్తూ మరణించినా లేదా గాయపడినా బీమా సదుపాయం ఉంటుందని మేము కచ్చితంగా డీలర్లకు వివరిస్తాం. ఈ విషయాన్ని వినియోగదారులకు చెప్పాలని సూచిస్తున్నా వారు పట్టించుకోవడంలేదు. వినియోగదారులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేయాలన్న నిబంధననూ గాలికి వదిలేస్తున్నారు. అయితే ఎవరైనా వచ్చి ప్రమాద ఘటన వివరాలు మా దృష్టికి తెస్తే పరిహారం ఇప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సీనియర్ మేనేజర్, బీపీసీఎల్ -
బీమా క్లెయిమ్ కష్టమేమీ కాదు!
ఇన్సూరెన్స్ సంస్థలు ఒక విషయంలో ఎప్పుడూ పోటీపడుతూనే ఉంటాయి. అది క్లయింట్స్ నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలుచుకోవడం!!. ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న సంస్థలకే మనుగడ ఉంటుంది. వృద్ధి బాటలో పయనిస్తాయి. ఇది బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ అంశంపై ఆధారపడి ఉంటుంది. క్లెయిమ్ చెల్లింపుల్లో ఏ బీమా కంపెనీ అయితే అధిక రేషియోను కలిగి ఉంటుందో... ఆ సంస్థ నుంచి బీమాను తీసుకోవడానికే కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపుతారనేది బహిరంగ రహస్యం. చాలా మందిలో బీమా క్లెయిమ్‌కు సంబంధించి కొన్ని అపోహలుంటాయి. ఇన్సూరెన్స్ సంస్థలు క్లెయిమ్ చెల్లింపునకు ఇష్టపడవని, సరిగా చేయవని, చాలా కష్టమని, ఎక్కువ సమయం పడుతుందనే వ్యాఖ్యలను తరచూ వింటూనే ఉంటాం. వీటిల్లో ఏమాత్రం నిజం లేదు. క్లెయిమ్ చెల్లింపు అంశం.. ఇన్సూరెన్స్ కంపెనీపై కన్నా పాలసీదారుడిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. క్లెయిమ్ వద్దే సమస్య బీమా కంపెనీలకు, పాలసీదారులకు మధ్య సమస్యలు క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలోనే తలెత్తుతాయి. పాలసీదారుడు బీమా పాలసీని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం.. పాలసీ తీసుకునే సమయంలో ఆరోగ్యం, ఆదాయం వంటి తదితర అంశాలకు సంబంధించిన వివరాలను తప్పుగా అందించడం వంటి వాటివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్లో సమస్య ఉత్పన్నమౌతుంది. ఉదాహరణకు ప్రమాదం జరిగి మరణం సంభవించినప్పుడు... పోస్ట్‌మార్టమ్ సహా పాలసీ నివేదికలను సదరు బీమా కంపెనీకి సమర్పించాలి. అదే అనారోగ్యం కారణంగా చనిపోతే.. అప్పుడు ఇన్సూరెన్స్ సంస్థలు హాస్పిటల్ రికార్డులను, వివిధ టెస్టుల నివేదికలను కోరతాయి. అందుకే క్లెయిమ్ చేసే వ్యక్తి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అంటే క్లెయిమ్ కోసం బీమా సంస్థలు ఏ ఏ లీగల్ డాక్యుమెంట్లను, పత్రాలను కోరతాయో వాటినే సమర్పించాలి. క్లెయిమ్‌కు సంబంధించిన సమస్త సమాచారం ఆయా బీమా సంస్థల వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి కూడా అవసరమైన సమాచారాన్ని పొందొచ్చు. తగిన సమాచారం సమర్పించడం ద్వారా ఎటువంటి సమస్యలూ, ఆలస్యానికి తావు లేకుండా క్లెయిమ్ సెంటిల్మెంట్ను వేగవంతం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో జరిగే లోటుపాట్లే ఇబ్బందులకు కొంత కారణం. సరైన పత్రాలతో నిర్ణీత సమయంలోనే సెటిల్మెంట్ బీమా సంస్థలకు అన్ని అవసరమైన పత్రాలను సమర్పిస్తే.. నిర్ణీత సమయంలోనే క్లెయిమ్ చెల్లింపు జరిగిపోతుంది. అదెలాగో చూద్దాం.. శర్మకు వయసు 32 ఏళ్లు. ఈయన భార్య ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె రెండేళ్ల కిందటే ఇన్సూరెన్స్ తీసుకుంది. ఆమె అన్ని అవసరమైన పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీకి అందించారు. అయినా కూడా ఆమె క్లెయిమ్‌ను కంపెనీ తిరస్కరించింది. దీనికి కారణం ఏంటి? అంటే.. శర్మ తన భార్య గుండెకు సంబంధించిన ఆరోగ్య వివరాలను కంపెనీకి తెలియజేయలేదు. వైద్య పరీక్షల నివేదికల ప్రకారం ఆమె గుండె అనారోగ్యంతో మరణించింది. అందుకే పాలసీ తీసుకునే సమయంలో ఆరోగ్యం, ఆదాయానికి సంబంధించి ఎలాంటి విషయాలను దాచకూడదు. అదే శర్మ అప్పుడు అన్ని వివరాలను కంపెనీకి తెలియజేసి ఉంటే ఇప్పుడు క్లెయిమ్ సులువుగా వచ్చేది. - సమీర్ బన్సాల్ డెరైక్టర్, బ్యాంక్ అస్యూరెన్స్ పీఎన్బీ మెట్‌లైఫ్ -
'బీమా క్లెయిమ్ చెల్లింపుల్లో జాప్యం తగదు'
న్యూఢిల్లీ: క్లెయిమ్‌ల చెల్లింపుల్లో ప్రైవేటు బీమా కంపెనీలు తీవ్ర జాప్యం చేస్తున్నాయని, నిరాకరణకు గురవుతున్న క్లెయిమ్‌ల సంఖ్య పెరుగుతోందని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన లోక్‌సభలో ఇన్సూరెన్స్ లా(సవరణ) బిల్లు, 2015పై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘స్థాయీ సంఘం చేసిన సిఫారసులను పరిశీలించాను. ఎఫ్‌డీఐ పరిమితి పెంచుతూ తీసుకున్న నిర్ణయం సంతోషకరం. దేశానికి ఈ పరిణామం మేలు చేస్తుంది. బీమా కంపెనీల క్యాపిటల్ అవసరాల కోసం ఎఫ్‌డీఐల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. విదేశీ బీమా కంపెనీలు పాలసీదారుకు చెందిన పెట్టుబడులను ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ విదేశాల్లో పెట్టకుండా నిరోధించడం మేలు చేస్తుంది. ఆరోగ్య బీమా కంపెనీల క్యాపిటల్‌ను రూ. 100 కోట్లకు బదులుగా రూ. 50 కోట్లకు తగ్గించడం కూడా కంపెనీల రాకను ప్రోత్సహిస్తుంది. అయితే ప్రైవేటు కంపెనీలు బీమా క్లెయిమ్‌ల చెల్లింపులో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. క్లెయిమ్‌ల చెల్లింపులో జాప్యం చేయడం, నిరాకరించడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టిపెట్టాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రైవేటు కంపెనీల రాకతో తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో బీమా డిమాండ్ ఏటా 18 శాతం పెరుగుతోంది. ఇక్కడ ఎల్ఐసీ పాత్రను పెంచాలి. ప్రైవేటు బీమా కంపెనీలు వృద్ధి కనబరుస్తుండగా ఎల్ఐసీ తిరోగమనంలో పయనిస్తోంది. అందువల్ల దాని పునర్నిర్మాణంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. బీమారంగంలోకి 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకతో దేశంలో బీమా పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.