దేశంలో మూడేళ్లలో 30 శాతం పెరిగిన బీమా క్లెయిమ్‌లు
మొత్తం క్లెయిమ్‌లలో 18–35 ఏళ్ల వారిదే 38 శాతం వాటా
‘పాలసీ బజార్’ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి చుట్టుముట్టేస్తున్నాయి. మరోవైపు వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వచ్చే డెంగీ, మలేరియా, విషజ్వరాలు విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. వెరసి ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి.
దీంతో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల నుంచి గట్టెక్కడానికి బీమాను నమ్ముకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీని ఫలితంగా గత మూడేళ్లలో ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు 30 శాతం పెరిగాయి. దేశంలో సగటు క్లెయిమ్ పరిమాణం 2023లో రూ.62,014 ఉండగా, ప్రస్తుత ఏడాది రూ.70,152కు చేరుకుంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.81,025కు చేరుకుంటుందని అంచనా.
ఈ విషయాలు ఇటీవల పాలసీ బజార్ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడయ్యాయి. డెంగీ, మలేరియా, విష జ్వరాలు తదితర సీజనల్ వ్యాధులతోపాటు గుండె, క్యాన్సర్ వంటి జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.
యువత అధికం...
ముఖ్యంగా యువత బీమా క్లెయిమ్‌లలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. 2024లో మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్‌లలో 18–35 మధ్య వయసు గల యువత వాటా 38.20 శాతం ఉంది. 36 నుంచి 45 మధ్య వయసు గల వారి వాటా 29.50 శాతం. దేశంలోని మొత్తం క్లెయిమ్‌లలో 14.5 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం 10.2 శాతంతో ఢిల్లీ, 5.90 శాతంతో హరియాణ వరుస స్థానాల్లో ఉన్నాయి.
గడిచిన ఐదేళ్లలో గుండె చికిత్స క్లెయిమ్‌లు రెట్టింపు కావడంతోపాటు చికిత్సల ఖర్చులు 53 శాతం పెరిగాయి. ఇక గుండె జబ్బు, సహజ మరణాలు టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు కూడా అధికంగా ఉన్నాయి. గుండె జబ్బులకు సంబంధించి 25–30 శాతం, సహజ మరణాలు– 30–35 శాతం, ప్రమాదాలు–15.20 శాతం చొప్పున క్లెయిమ్‌లు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment