హైదరాబాద్, సాక్షి: రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇటీవల వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతవాసులకు చేయూత నందించేందుకు బీమా రంగ కంపెనీ ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వరదల వల్ల నష్టపోయిన రైతులు, వ్యాపారస్తులు తదితర వ్యక్తులకు త్వరితగతిన బీమా క్లెయిములను పరిష్కరించనున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆస్తులు, వ్యాపారాలు, పంటలు తదితరాలలో ఏర్పడిన నష్టాలకుగాను బీమా ప్రయోజనాలను వేగంగా అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేసింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్ధపేట, కరీమ్‌నగర్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో వరదవల్ల నష్టాలు సంభవించినట్లు పేర్కొంది.
ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్టణం జిల్లాలు వరదవల్ల ప్రభావితమైనట్లు అభిప్రాయపడింది. ఈ ప్రాంతాలలోని కస్టమర్లకు వరద నష్టంకింద పరిహారం అందించేందుకు అక్టోబర్ నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేసింది. వరదల కారణంగా చిన్నతరహా పరిశ్రమల(ఎస్‌ఎంఈలు) యూనిట్లు, ఫ్యాక్టరీలు, గోదాములు, దుకాణాలు తదితర కార్యకలాపాలకు విఘాతం ఏర్పడినట్లు పేర్కొంది. ఇప్పటికే 120 క్లెయిములను పరిష్కరించినట్లు ఈ సందర్భంగా ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో పీసీ కంద్‌పాల్ వెల్లడించారు. వీటిలో అత్యధికం ఎస్‌ఎంఈలుకాగా.. వివిధ మార్గాల ద్వారా తమ పాలసీదారులకు క్లెయిముల సెటిల్‌మెంట్‌పై అవగాహన కల్పించినట్లు తెలియజేశారు. ఆస్తులు, బిజినెస్‌లు నష్టపోయినట్లు 120కుపైగా క్లెయిమ్‌లు అందగా.. 100 మోటార్ క్లెయిములు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిలో అత్యధికం హైదరాబాద్, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలియజేశారు. కస్టమర్లకు వాటిల్లిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని క్లెయిములను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment