SBI General Insurance
-
ఎస్బీఐ జనరల్: వరద సహాయక క్లెయిములకు రెడీ
హైదరాబాద్, సాక్షి: రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇటీవల వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతవాసులకు చేయూత నందించేందుకు బీమా రంగ కంపెనీ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వరదల వల్ల నష్టపోయిన రైతులు, వ్యాపారస్తులు తదితర వ్యక్తులకు త్వరితగతిన బీమా క్లెయిములను పరిష్కరించనున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆస్తులు, వ్యాపారాలు, పంటలు తదితరాలలో ఏర్పడిన నష్టాలకుగాను బీమా ప్రయోజనాలను వేగంగా అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేసింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్ధపేట, కరీమ్నగర్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో వరదవల్ల నష్టాలు సంభవించినట్లు పేర్కొంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్టణం జిల్లాలు వరదవల్ల ప్రభావితమైనట్లు అభిప్రాయపడింది. ఈ ప్రాంతాలలోని కస్టమర్లకు వరద నష్టంకింద పరిహారం అందించేందుకు అక్టోబర్ నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేసింది. వరదల కారణంగా చిన్నతరహా పరిశ్రమల(ఎస్ఎంఈలు) యూనిట్లు, ఫ్యాక్టరీలు, గోదాములు, దుకాణాలు తదితర కార్యకలాపాలకు విఘాతం ఏర్పడినట్లు పేర్కొంది. ఇప్పటికే 120 క్లెయిములను పరిష్కరించినట్లు ఈ సందర్భంగా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో పీసీ కంద్పాల్ వెల్లడించారు. వీటిలో అత్యధికం ఎస్‌ఎంఈలుకాగా.. వివిధ మార్గాల ద్వారా తమ పాలసీదారులకు క్లెయిముల సెటిల్మెంట్పై అవగాహన కల్పించినట్లు తెలియజేశారు. ఆస్తులు, బిజినెస్‌లు నష్టపోయినట్లు 120కుపైగా క్లెయిమ్‌లు అందగా.. 100 మోటార్ క్లెయిములు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిలో అత్యధికం హైదరాబాద్, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలియజేశారు. కస్టమర్లకు వాటిల్లిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని క్లెయిములను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. -
ఎస్బీఐ జనరల్ లాభం రూ.251 కోట్లు
ముంబై: ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ లాభం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.251 కోట్లకు దూసుకుపోయింది. రీఇన్సూరెన్స్ పోర్ట్‌ఫోలియో నుంచి వచ్చిన ఒక్కసారి ఆదాయం రూ.170 కోట్ల వల్ల ఈ స్థాయిలో పెరిగింది. వాస్తవానికి అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం కేవలం రూ.5.5 కోట్లుగానే ఉండడం గమనార్హం. ప్రీమియం ఆదాయం రూ.690 కోట్ల నుంచి రూ.926 కోట్లకు వృద్ధి చెందింది. ఇందులో పంటల బీమా నుంచి వచ్చిన ప్రీమియం వాటా రూ.306 కోట్లుగా ఉంది. ‘‘రూ.170 కోట్లు ఏకీకృత ఆదాయం రీఇన్సూరెన్స్ నుంచి రావడంతో రూ.156 కోట్ల అండర్‌రైటింగ్ లాభాన్ని నమోదు చేశాం. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో అండర్‌రైటింగ్ నష్టాలు రూ.78 కోట్ల మేర ఉన్నాయి’’ అని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ పుషన్ మహపాత్ర తెలిపారు. మోటారు, అగ్నిప్రమాద, వైద్య, పంటల బీమా నుంచి వచ్చిన ప్రీమియం ఆదాయం మెరుగ్గా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం ఆదాయంలో 40 శాతం వృద్ధి లక్ష్యాన్ని (రూ.3,600 కోట్లకు) విధించుకున్నట్టు మçహాపాత్ర తెలిపారు. ప్రస్తుతం తమ వార్షిక ప్రీమియం ఆదాయంలో 55 శాతం మేర ఎస్బీఐ గ్రూపు, ఇతర ప్రాంతీయ బ్యాంకుల నుంచే వస్తుండగా, భవిష్యత్తులో ఈ వాటాను 50%కి తగ్గించుకోవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. మధ్య కాలానికి ఐపీవోకు రానున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,600గా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 20% మేర పెంచుకోనున్నట్టు తెలిపారు. -
వారు వాడుతుంటే మీరేం చేస్తున్నారు?
పేరు, లోగో వ్యవహారంలో ఎస్బీఐని ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరు, లోగోను ప్రైవేటు కంపెనీలైన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లు వాడుకుంటుండటంపై దాఖలైన వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎస్బీఐ చైర్పర్సన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ యాజమాన్యాలను ఆదేశిస్తూ... నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏజేఐ) జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు... ఎస్బీఐకి సంబంధం లేదని, అయినప్పటికీ ఆ కంపెనీలు ఎస్బీఐ పేరు, లోగో వాడుతున్నా ఎస్బీఐ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన వి.బి.కృష్ణమూర్తి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి... ఈ సందర్భంగా కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ... ప్రైవేటు కంపెనీలైన ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు ప్రభుత్వ రంగ సంస్థయిన ఎస్బీఐ లోగోను వాడుకునే అధికారం లేదన్నారు. ఈ విషయాన్ని ఎస్బీఐని అడిగితే... వారు తమ లోగోను వాడుకోవడానికి ఎవరికీ అనుమతినివ్వలేదని తెలిపారన్నారు. అశోక చక్రం, అశోక స్తూపం తదితరాలను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు వినియోగించకుండా చట్టంలో నిషేధం ఉందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... ఎస్బీఐ లోగో కూడా ఆ చట్ట నిషేధిత జాబితాలో ఉందా.. లేదా.. పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటామంటూ ఆ మేర నోటీసులిచ్చింది. -
ఎస్బీఐ జనరల్‌లో 49 శాతానికి ఐఏజీ వాటా
న్యూఢిల్లీ: బీమా రంగ సంస్కరణల నేపథ్యంలో దేశీ ఇన్సూరెన్స్ కంపెనీల్లో వాటాలు పెంచుకునే విదేశీ సంస్థల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా దేశీ బీమా సంస్థ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఇన్సూరెన్స్ ఆస్ట్రేలియా గ్రూప్ (ఐఏజీ) తన వాటాను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకోనుంది. జేవీలో ఈ మేరకు తమ వాటాను ఐఏజీకి బదలాయించేందుకు ఈ నెల 25న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీసీబీ) సమావేశంలో ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వాటా ధరను మదింపు చేసేందుకు వేల్యుయర్‌ను నియమించే ప్రతిపాదనకు కూడా ఆమోదముద్ర వేసినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ జనరల్‌లో ఎస్బీఐకి 74 శాతం, ఐఏజీకి 26 శాతం వాటాలు ఉన్నాయి. ఇది 2010లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటికే మ్యాక్స్ ఇండియాతో ఏర్పాటు చేసిన మాక్స్‌బూపా బీమా కంపెనీలో బ్రిటన్‌కి చెందిన బూపా ఇన్సూరెన్స్ తమ వాటాను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.