తినే తిండి.. పీల్చేగాలి.. తాగే నీరు అన్నీ కలుషితం అవుతున్న రోజులివి. దాంతోపాటు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రోగాలు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వైద్య ఖర్చులకోసం ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు సాధారణంగా ఆరోగ్య బీమా తీసుకుంటారు. అయితే పాలసీ తీసుకోవడం ముఖ్యం కాదు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే క్లెయిమ్ అయ్యేలా ఉండే బీమాను ఎంచుకోవడం అవసరం. పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆర్థిక భారం తప్పుతుందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.
ఎంత మొత్తం అవసరం..?
ఏటా మెడికల్ బిల్లులు పెరుగుతున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం ప్రతి ఏడాది దాదాపు 30-40 శాతం మేర మెడికల్ బిల్లులు అధికమవుతున్నాయి. అందుకు తగినట్లుగా మీ వయసు, మీపై ఆధారపడిన వారి పరిస్థితులకు అనుగుణంగా ఎంత మొత్తం పాలసీ కవర్ ఉండాలో నిర్ణయించుకోవాలి.
క్లెయిమ్ సెటిల్‌మెంట్
మార్కెట్‌లో ఆరోగ్య బీమా కంపెనీలు చాలానే ఉన్నాయి. తీవ్ర వ్యాధుల వైద్యానికి అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు రూ.లక్షల్లో ఉన్న క్లెయిమ్‌లు సెటిల్ చేయకుండా కొర్రీలు పెడుతున్నాయి. తక్కువ కవర్ ఉన్న పాలసీను క్లెయిమ్‌లు చేస్తూ సెటిల్‌మెంట్ రేషియోను పెంచుకుంటున్నాయి. అయితే ఈ వివరాలు ఐఆర్‌డీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయి. వాటిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. 90 శాతం కంటే క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఎక్కువగా ఉండే కంపెనీలను ఎంచుకుంటే ఉత్తమం.
రూమ్ లిమిట్
మెడికల్ బిల్లులు, డాక్టర్ ఛార్జీలు, ఇతర సదుపాయాలకు అయ్యే ఖర్చులు మొత్తంగా ఆసుపత్రి రూమ్ రెంట్‌పై ఆధారపడుతాయి. ఉదాహరణకు పాలసీలో సింగల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అని సెలక్ట్ చేసుకుంటే దాని రెంట్‌కు అనుగుణంగానే ఇతర బిల్లులు చెల్లిస్తారు. అంతకుమించి ఖర్చు అయితే మాత్రం పాలసీదారులు భరించాల్సి రావొచ్చు. కాబట్టి రూమ్ రెంట్‌కు సంబంధించిన పరిమితులు ఉండకుండా చూసుకోవాలి.
క్యాష్‌లెస్ ఆసుపత్రులు
ఉద్యోగ రీత్యా చాలామంది హైదరాబాద్, బెంగళూరు, ముంబయి.. వంటి నగరాల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగం శాశ్వతం కాదు కదా. భవిష్యత్తులో సొంత ఊళ్లకు వెళ్లాల్సి వచ్చినపుడు కూడా ఆసుపత్రులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. దాంతోపాటు ప్రస్తుతం మీరు ఉంటున్న ప్రాంతాల్లో దగ్గర్లో ఎలాంటి నెట్‌వర్క్ ఆసుపత్రులున్నాయో తెలుసుకోండి. పాలసీ నెట్‌వర్క్ హాస్పటల్స్‌లో వైద్యం చేయించుకుంటే కవరేజీ పరిమితి వరకు బీమా కంపెనీలే భరిస్తాయి. ఒకవేళ ప్రమాదం జరిగిన చోట నెట్‌వర్క్ ఆసుపత్రి లేకపోయినా కంగారు పడకూడదు. వైద్యం తర్వాత సదరు ధ్రువపత్రాలతో ఆ డబ్బును తిరిగి పొందవచ్చు.
కో-పే మంచిదేనా..?
కో-పే అందిస్తున్న బీమా పాలసీల ప్రీమియం కొంత తక్కువగా ఉంటుంది. అయితే వైద్యం తీసుకున్నాక కో-పే ప్రకారం బీమా కంపెనీ కొంత, పాలసీదారులు ఇంకొంత చెల్లించాలి. ఎలాంటి కో-పే లేకుండా కొంత ప్రీమియం ఎక్కువైనా మొత్తం డబ్బు బీమా కంపెనీలే చెల్లించే సదుపాయాన్ని ఎంచుకోవాలి.
రిస్టోరేషన్ సౌకర్యం
పాలసీదారులు తమతోపాటు కుటుంబం సభ్యులకు కలిపి ఫ్యామిలీ ఫ్లోటింగ్ పాలసీ తీసుకుంటారు. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగి పాలసీ లిమిట్ మొత్తాన్ని వాడుకున్నారనుకోండి. మళ్లీ ఇంట్లో ఇంకొకరికి ఆరోగ్య సమస్యలు వస్తే పరిస్థితి ఏంటీ? అందుకే ఏడాదిలో ఎన్నిసార్లైనా బీమా మొత్తం తిరిగి రిస్టోర్ అయ్యే పాలసీని తీసుకుంటే మేలు.
ఇదీ చదవండి: పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!
ఇవీ గమనించండి..
డేకేర్ ట్రీట్‌మెంట్ అందించే పాలసీలు ఎంచుకోవాలి.
ఏదైనా అత్యవసర సమయాల్లో ఇంటివద్దే వైద్యం అందిచేలా ఉండాలి.
అంబులెన్స్ ఛార్జీలు కవర్ అవ్వాలి.
ఫ్రిహెల్త్ చెకప్ సౌలభ్యం ఉండాలి.
డాక్టర్‌కు సంబంధించిన ఆన్‌లైన్ కన్సల్టేషన్ ఛార్జీలు అందించాలి.
ఇప్పటికే ఉన్న జబ్బులకు తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండే పాలసీ బెటర్.
పిల్లలు కావాలనుకునే వారు మెటర్నిటీ వైద్య ఖర్చులు కవర్ అయ్యే పాలసీ ఎంచుకుంటే మేలు.
Comments
Please login to add a commentAdd a comment