ముంబై: ఆరోగ్యకరమైన, చురుకైన జీవనవిధానాన్ని అనుసరించే పాలసీదారులను ఆరోగ్య బీమా కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల రెన్యువల్‌పై 80 నుంచి 100 శాతం వరకు తగ్గింపుతోపాటు ఇతర ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక పాలసీ ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే మరుసటి సంవత్సరానికి రెన్యువల్‌పై 25 శాతం నుంచి 50 శాతం వరకు సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)ను పెంచే ఆప్షన్‌ను ఇస్తుంటాయి. కానీ, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘యాక్టివ్ హెల్త్’ ప్లాన్‌లో వరుసగా రెండేళ్ల పాటు ఎటువంటి క్లెయిమ్ లేకపోతే మూడో ఏడాది రెన్యువల్ సమయంలో నూరు శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది.
మూడో ఏడాది ప్రీమియం చెల్లింపుల్లో దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. తగినన్ని యాక్టివ్ డేజ్‌ను సమకూర్చుకున్న కస్టమర్లకే ఆదిత్య బిర్లా ఈ ఆఫర్ ఇస్తోంది. ఒక యాక్టివ్‌డే అంటే రోజులో 10,000 అడుగులు వేయడం (300 క్యాలరీలను కరిగించుకోవడం). అంటే క్రమం తప్పకుండా నడు స్తూ, ఆరోగ్య రక్షణ చర్యలను తీసుకున్న వారికి రివార్డులతో ప్రతిఫలాన్ని అందిస్తోంది. యాక్టివ్ హెల్త్ యాప్ ద్వారా కస్టమర్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని కంపెనీ నమోదు చేస్తుంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో క్లెయిమ్‌లు తగ్గుతాయి. కనుక బీమా సంస్థలపై ఆ మేరకు భారం తగ్గుతుంది.
మొదటి అడుగు మాదే..
పాలసీదారులు చురుగ్గా, ఆరోగ్యకరంగా ఉండేందుకు ప్రోత్సహిస్తున్నట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూ రెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. నూరు శాతం డిస్కౌంట్ ఇవ్వడం పరిశ్రమలో మొదటిసారిగా పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే రివార్డులను ప్రీమియం చెల్లింపు ల్లో సర్దుబాటు చేసుకోవడం లేదా మందుల కొనుగోలు లేదా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు చెల్లింపుల కోసం వినియోగించుకోవచ్చు. లేదా వరుసగా రెండేళ్లపాటు క్లెయిమ్‌లు లేకపోతే మూడో ఏడాది నూరు శాతం బీమా కవరేజీని పెంచుకునే ఆప్షన్‌ను కూడా కంపెనీ ఇస్తోంది.
ఫ్యూచర్ జనరాలి సైతం..
ఫ్యూచర్ జనరాలి సంస్థ ఈ నెలలోనే ఈ తరహా ఫీచర్‌తో ‘హెల్త్ సూపర్ సేవర్’ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇందులో 1ఎక్స్, 2ఎక్స్ పేరుతో రెండు ఆప్షన్లు ఉన్నాయి. 1ఎక్స్‌లో క్రితం ఏడాది పాలసీదారు నుంచి ఎటువంటి క్లెయిమ్ లేకపోతే, మరుసటి ఏడాది రెన్యువల్ ప్రీమియంపై 80 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. 2ఎక్స్‌లో క్రితం రెండు సంవత్సరాల్లోనూ క్లెయిమ్‌లే లేనట్టయితే.. తదుపరి రెండు సంవత్సరాల ప్రీమియంలో 80 శాతం తగ్గింపు ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment