
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
రూ.30 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కారు పన్నాగం
నిధుల సమీకరణ పేరుతో చవకగా భూముల అమ్మకం
సాక్షి, హైదరాబాద్: భూములు అమ్మితే కాని ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి తెలంగాణ వచ్చిందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైడ్రా, మూసీ వెంట ఇళ్ల కూల్చివేతలు.. వంటి తలాతోకలేని విధానాలతో రాష్ట్ర ఆదాయం తగ్గి ప్రభుత్వ భూములను అమ్ముకుంటే కాని ఆదాయం సమకూర్చుకోలేని స్థాయికి రేవంత్ సర్కార్ దిగజారిందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
రూ.30 వేల కోట్ల నిధుల సమీకరణ కోసం తాజాగా హైదరాబాద్‌లోని విలువైన భూములను చవకగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి మండలం కంచ గచ్చిబౌలి పరిధిలో ఉన్న 400 ఎకరాల భూములను అమ్మడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు మాట మార్చారన్నారు. అసెంబ్లీని మోసం చేసిన రేవంత్, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులు చేసినప్పటికీ, ఎన్నో సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతులు, పేదలను ఆదుకున్నామన్నారు. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు, రూ.28 వేల కోట్ల రుణమాఫీ, రూ.6 వేల కోట్లతో రైతు బీమా, లక్ష 11 వేల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని తమ ప్రభుత్వం అందించిందన్నారు.
అలాగే, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామసాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులు, 45 వేల చెరువుల పునరుద్ధరణ, 45 లక్షల మందికి ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి పథకాల అమలు, వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, 30 మెడికల్ కాలేజీలను ప్రారంభించినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం 15 నెలల పాలనలోనే రూ. 1.65 లక్షల కోట్ల పైచిలుకు అప్పు చేశారని ఆరోపించారు. అవగాహన రాహిత్యంతో శ్రీశైలం సొరంగాన్ని కుప్పకూల్చి 8 మంది ప్రాణాలు బలితీసుకున్న బాధ్యతలేని ప్రభుత్వం రేవంత్‌ది అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment