
సీఎం అవుతానని రేవంత్ కలలో కూడా ఊహించుకోలేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిద్రలో కూడా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుకొస్తున్నారని, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతానని ఆయన కలలో కూడా ఊహించుకోలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎద్దేవా చేశారు. 36 పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్.. కనీసం మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నాడని, కీలక శాఖలకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయాడని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకుడు మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘48 గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో 8 మంది కారి్మకులు చిక్కుకున్నా ఢిల్లీ పర్యటనకు వెళ్లాడు. వ్యవసాయరంగంలో మోగుతున్న చావుడప్పునకు చేతకాని రేవంత్ రెడ్డి పాలనే ప్రధాన కారణం. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి’అని అన్నారు.
కాళేశ్వరంపై విష బీజాలు
‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల మనసుల్లో విష బీజాలు నాటారు. సుంకిశాల రిటైనింగ్ వాల్, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలినా, ఖమ్మం పెద్దవాగు బ్రిడ్జి కొట్టుకుపోయినా బీజేపీ నాయకులు మాట్లాడటం లేదు. రేవంత్ ప్రభుత్వానికి ప్రధాని మోదీ రక్షణ కవచంలా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదాలపై జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) ఎందుకు మౌనంగా ఉంది. తెలంగాణలో రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధాని ఆరోపించినా ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కేసీఆర్‌ను నిత్యం విమర్శించే రేవంత్‌రెడ్డి బీజేపీపై చిన్న విమర్శ కూడా చేయడం లేదు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలి. 14 నెలల కాలంలో రూ.1.50లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ ఢిల్లీకి పంపుతున్న మూటలతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. త్వరలో సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్‌ఎస్‌లో చేరతారు’అని కేటీఆర్ అన్నారు.
ప్రమాదంపై జ్యుడీషియల్ కమిషన్
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో జ్యుడీషియల్ కమిషన్ వేయాలని కేటీఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ జరపాలి. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదంతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది. ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వం న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఆర్మీ, ఇతర సంస్థల సహాయంతో సొరంగంలో చిక్కుకున్న వారిని వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి’అని కేటీఆర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment