కాంగ్రెస్‌లోకి ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు | Six BRS MLCs joined the Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు

Jul 5 2024 2:48 AM | Updated on Jul 5 2024 2:48 AM

సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు. చిత్రంలో మంత్రి పొంగులేటి

సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు. చిత్రంలో మంత్రి పొంగులేటి

ఆషాఢం అమావాస్యకు ముందురోజు రాత్రి చేరిక 

సారయ్య, యెగ్గె మల్లేశం, ప్రభాకర్, దయానంద్, భానుప్రసాద్, విఠల్‌లను పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్‌లో చేరగా, రాజ్యసభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ప్రభాకర్‌రావు, దండె విఠల్, బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు. 

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,  సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిల సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. 

ఒకవైపు ఈ నెలలోనే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండడం, మరోవైపు ఆషాఢమాసం రానుండడంతో ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్‌ బలం 12కు చేరనుంది. కాగా, సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్‌పల్లా హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement