కొడంగల్‌: ఈసారి రేవంత్‌రెడ్డికి కలిసొచ్చే అంశం అదే! | Mahabubnagar: Who Next Incumbent in Kodangal Constituency | Sakshi
Sakshi News home page

కొడంగల్‌: ఈసారి రేవంత్‌రెడ్డికి కలిసొచ్చే అంశం అదే!

Published Wed, Aug 9 2023 4:04 PM | Last Updated on Tue, Aug 29 2023 10:23 AM

Mahabubnagar: Who Next Incumbent in Kodangal Constituency - Sakshi

కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు క్రమంగా వేడెక్కుతున్నాయి. అభివృద్దిపై ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు జోరందుకున్నాయి. ఇద్దరి మధ్య  మాటల యుద్దం నడుస్తోంది. ఈసారి ఇక్కడ పోటీ రసవత్తరంగా జరుగనుంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం రెండు జిల్లాలో పరిధిలోకి వెళ్లింది. కొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలో ఉండగా మరికొన్ని మండలాలు వికారాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో అందరి దృష్టి ఈ సెగ్మెంట్‌పై పడింది. రేవంత్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో  టీడీపీ నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఆయన కాంగ్రెస్‌ పార్టీలో పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. తర్వాత మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గ అభివృద్దికి తన వంతు కృషి చేశారు. అధికార బీఆర్ఎస్‌తో నిత్యం కొట్లాడి పనుల విషయంలో రాజీలేకుండా పోరాడారు. అందుకే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనను టార్గెట్ చేసి ఓడించారు. కేటీఆర్, హరీష్‌రావు ఇద్దరు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసి ఆ పార్టీ అభ్యర్ది పట్నం నరేందర్రెడ్డిని గెలిపించారు. ఓడిపోయినా రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను తన సోదురుడు, అవసరమైనప్పుడు ఆయనే వచ్చి నిర్వహిస్తున్నారు. కాం‍గ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అవుతాడనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన గెలుపు ఈసారి ఖాయమనే ధీమాను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల్లో కూడా ఆయనపై ప్రస్తుతం మంచి అభిప్రాయంతోనే ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ వర్గపోరు.. రేవంత్‌కు ప్లస్‌ కానుందా?
ఇంకోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీలోని వర్గ విభేదాలు సైతం ఈసారి రేవంత్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. తనకు రాజకీయంగా మొదటి నుంచి వైరం ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గుర్నాథ్‌రెడ్డిని కలిసేందుకు నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. కొడంగల్‌లో కాంగ్రేస్ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథ్‌రెడ్డికి 2014లో కాంగ్రేస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే టీఆర్ఎస్‌లో చేరి చేరి పోటీ చేశారు. కానీ ఓటమి చెందారు. 2018లో టీఆర్ఎస్ ఆయనకు మొండిచెయ్యి చూపింది అయినా పార్టీ అభ్యర్ది విజయం కోసం పనిచేశారు. నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. డీసీసీబీ చైర్మన్ పదవి కూడా దక్కకపోవటంతో సింగల్‌ విండో చైర్మన్ పదవికి రాజీనామా చేసి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే తనకు ఎలాగో వయసు మీదపడింది కాబట్టి తన వారసుల రాజకీయ భవితవ్యంపై  భరోసా కావాలని అడిగిన ఆయన ఇటీవలే ఢిల్లీలో పార్టీ నేతలను కలిసి వచ్చారు. గుర్నాథ్‌రెడ్డి పార్టీలో కలవటం కూడ కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ది తప్పా తర్వాత ఏం జరగలేదని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, తాను గతంలో చేసిన అభివృద్ది గెలిపిస్తాయని రేవంత్‌రెడ్డి ధీమాగా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గం కావటంతో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ నియోజకవర్గంపై ఉండనుంది. అధికార టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి చాలా మంది ముఖ్యనేతలను పట్టించుకోవటం లేదని, వారంతా ఆయనకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో మంజూరైన పనులు కొంతమేర పూర్తి చేయించారు తప్పా కొత్తగా తెచ్చిన పథకాలు ఏమీ లేవు.

దారుణంగా బీజేపీ పరిస్థితి.. ఈసారి కూడా కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్సే?
ఇప్పటికీ బొంరాస్ పేట, దౌల్తాబాద్ మండలాల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు లేక విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కూడ నిరుపేదలకు అందివ్వలేదు. కోస్గి 50 పడకల ఆస్పత్రి ఇంకా పూర్తి కాలేదు. ఇసుక అక్రమ రవాణ, మైనింగ్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం సాగుతుంది. ఇక్కడి రైతులకు సాగునీరందించే విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని మండిపడుతున్నారు. కేవలం ప్రభుత్వ పథకాలను నమ్ముకుని ఎమ్మెల్యే ముందుకెళ్తున్నారు. పార్టీలో గ్రూపురాజకీయలు, అంతర్గత కుమ్ములాటలు సైతం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయనే ప్రచారం కొనసాగుతుంది.

మొత్తంగా ఈసారి బీఆర్ఎస్‌కు ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్ధితులే కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ పరిస్ధితి అయితే మరి దారుణంగా ఉందనే చెప్పాలి. గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన నాగూరావు నామాజీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రస్తుతం ఇక్కడ పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టేవారు కరువయ్యారు. ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపే పరిస్ధితి లేదు. దీంతో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గానే సాగనుంది.

నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: 
జిల్లా పునర్విభజనలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం కొన్ని మండలాలు నారాయణపేట,మరికొన్ని మండలాలు వికారాబాద్ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. బీసీ సామాజిక ఓటర్లు అధికంగా ఉండటంతో  ఎన్నికలపై ప్రభావం చూపిస్తారు. ప్రదానంగా ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతానికి సాగునీటి వసతులు లేవు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతాని సాగునీరు అందిస్తామన్న బీఆర్ఎస్ హామీ నెరవేరలేదు. దీంతో ఈ ప్రాంత రైతులు తమ ప్రభావం చూపనున్నారు.

ఆలయాలు: రెండవ తిరుపతిగా  ప్రసిది చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి  ఆలయం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement