Ranga Reddy Common Districts
-
కొడంగల్: ఈసారి రేవంత్‌రెడ్డికి కలిసొచ్చే అంశం అదే!
కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు క్రమంగా వేడెక్కుతున్నాయి. అభివృద్దిపై ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు జోరందుకున్నాయి. ఇద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈసారి ఇక్కడ పోటీ రసవత్తరంగా జరుగనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం రెండు జిల్లాలో పరిధిలోకి వెళ్లింది. కొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలో ఉండగా మరికొన్ని మండలాలు వికారాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో అందరి దృష్టి ఈ సెగ్మెంట్‌పై పడింది. రేవంత్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గ అభివృద్దికి తన వంతు కృషి చేశారు. అధికార బీఆర్ఎస్తో నిత్యం కొట్లాడి పనుల విషయంలో రాజీలేకుండా పోరాడారు. అందుకే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయనను టార్గెట్ చేసి ఓడించారు. కేటీఆర్, హరీష్‌రావు ఇద్దరు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసి ఆ పార్టీ అభ్యర్ది పట్నం నరేందర్‌రెడ్డిని గెలిపించారు. ఓడిపోయినా రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను తన సోదురుడు, అవసరమైనప్పుడు ఆయనే వచ్చి నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అవుతాడనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన గెలుపు ఈసారి ఖాయమనే ధీమాను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల్లో కూడా ఆయనపై ప్రస్తుతం మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. బీఆర్ఎస్ వర్గపోరు.. రేవంత్‌కు ప్లస్ కానుందా? ఇంకోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీలోని వర్గ విభేదాలు సైతం ఈసారి రేవంత్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. తనకు రాజకీయంగా మొదటి నుంచి వైరం ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గుర్నాథ్‌రెడ్డిని కలిసేందుకు నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. కొడంగల్‌లో కాంగ్రేస్ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథ్‌రెడ్డికి 2014లో కాంగ్రేస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే టీఆర్ఎస్లో చేరి చేరి పోటీ చేశారు. కానీ ఓటమి చెందారు. 2018లో టీఆర్ఎస్ ఆయనకు మొండిచెయ్యి చూపింది అయినా పార్టీ అభ్యర్ది విజయం కోసం పనిచేశారు. నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. డీసీసీబీ చైర్మన్ పదవి కూడా దక్కకపోవటంతో సింగల్ విండో చైర్మన్ పదవికి రాజీనామా చేసి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తనకు ఎలాగో వయసు మీదపడింది కాబట్టి తన వారసుల రాజకీయ భవితవ్యంపై భరోసా కావాలని అడిగిన ఆయన ఇటీవలే ఢిల్లీలో పార్టీ నేతలను కలిసి వచ్చారు. గుర్నాథ్రెడ్డి పార్టీలో కలవటం కూడ కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ది తప్పా తర్వాత ఏం జరగలేదని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, తాను గతంలో చేసిన అభివృద్ది గెలిపిస్తాయని రేవంత్‌రెడ్డి ధీమాగా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గం కావటంతో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ నియోజకవర్గంపై ఉండనుంది. అధికార టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి చాలా మంది ముఖ్యనేతలను పట్టించుకోవటం లేదని, వారంతా ఆయనకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో మంజూరైన పనులు కొంతమేర పూర్తి చేయించారు తప్పా కొత్తగా తెచ్చిన పథకాలు ఏమీ లేవు. దారుణంగా బీజేపీ పరిస్థితి.. ఈసారి కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్సే? ఇప్పటికీ బొంరాస్ పేట, దౌల్తాబాద్ మండలాల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు లేక విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కూడ నిరుపేదలకు అందివ్వలేదు. కోస్గి 50 పడకల ఆస్పత్రి ఇంకా పూర్తి కాలేదు. ఇసుక అక్రమ రవాణ, మైనింగ్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం సాగుతుంది. ఇక్కడి రైతులకు సాగునీరందించే విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని మండిపడుతున్నారు. కేవలం ప్రభుత్వ పథకాలను నమ్ముకుని ఎమ్మెల్యే ముందుకెళ్తున్నారు. పార్టీలో గ్రూపురాజకీయలు, అంతర్గత కుమ్ములాటలు సైతం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయనే ప్రచారం కొనసాగుతుంది. మొత్తంగా ఈసారి బీఆర్ఎస్కు ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్ధితులే కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ పరిస్ధితి అయితే మరి దారుణంగా ఉందనే చెప్పాలి. గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన నాగూరావు నామాజీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రస్తుతం ఇక్కడ పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టేవారు కరువయ్యారు. ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపే పరిస్ధితి లేదు. దీంతో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గానే సాగనుంది. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: జిల్లా పునర్విభజనలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం కొన్ని మండలాలు నారాయణపేట,మరికొన్ని మండలాలు వికారాబాద్ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. బీసీ సామాజిక ఓటర్లు అధికంగా ఉండటంతో ఎన్నికలపై ప్రభావం చూపిస్తారు. ప్రదానంగా ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతానికి సాగునీటి వసతులు లేవు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతాని సాగునీరు అందిస్తామన్న బీఆర్ఎస్ హామీ నెరవేరలేదు. దీంతో ఈ ప్రాంత రైతులు తమ ప్రభావం చూపనున్నారు. ఆలయాలు: రెండవ తిరుపతిగా ప్రసిది చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. -
ఈసారి షాద్‌నగర్ నియోజకవర్గంలో తొలి హ్యాట్రిక్ సాధ్యమా?
షాద్ నగర్ నియోజకవర్గం షాద్‌నగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్ రెడ్డిపై 20556 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. అంజయ్యకు 72180 ఓట్లు రాగా, ప్రతాపరెడ్డికి 51624 ఓట్లు వచ్చాయి. వరసగా రెండోసారి గెలిచిన అంజయ్య యాదవ్ సామాజికపరంగా యాదవ వర్గానికి చెందినవారు. ఇక్కడ బిఎస్పి తరపున పోటీచేసిన వి.శంకర్‌కు 27750 ఓట్లు రావడం విశేషం. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనరల్ సీటుగా మారిన షాద్‌నగర్ నుంచి 2009 లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధి ప్రతాప్‌రెడ్డి పోటీచేసి గెలుపొందినా, 2014లో ఓడిపోయారు. టిఆర్ఎస్ నేత అంజయ్యయాదవ్ తన ప్రత్యర్ధి ప్రతాపరెడ్డిని 17328 మెజార్టీతో ఓడిరచారు. హైదరాబాద్లోరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేరళ మాజీ గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు 1952లో గెలుపొందారు. 1952 నుంచి 1962 వరకు జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గం 1967 నుంచి 2004 వరకు రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉండేది. తిరిగి 2009లో జనరల్ స్థానంగా మారింది. కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి 11 సార్లు, టిడిపి రెండుసార్లు,టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి, షాద్‌నగర్‌లో అత్యధికంగా డాక్టర్ పి. శంకరరావు నాలుగుసార్లు గెలిచారు.ఈయన 2009లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పోటీచేసి ఐదోసారి గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన కె.నాగన్న ఇతర చోట్ల మరో మూడుసార్లు విజయం సాధించారు. ఇక్కడ నుండి 1957లో గెలుపొందిన షాజహాన్ బేగం అంతకుముందు పరిగిలో ఏకగ్రీవంగా గెలవడం విశేషం. షాద్ నగర్ జనరల్ గా ఉన్నప్పుడు రెండుసార్లు రెడ్డి, రెండుసార్లు బిసి,ఒకసారి ముస్లిం నేతలు ఎన్నికయ్యారు. ఇక్కడ గెలిచిన శంకరరావు గతంలో విజయబాస్కరరెడ్డి క్యాబినెట్ లోను ఆ తర్వాత కిరణ్ క్యాబినెట్‌లోను మంత్రి అయ్యారు. కాని కిరణ్ తో వచ్చిన విబేధాల కారణంగా పదవి పోగొట్టుకున్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ఆస్తులపై శంకరరావు హైకోర్టుకు లేఖ రాయడం, ఆ తర్వాత కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం,జగన్ ను అరెస్టు చేయడం వంటి కీలక ఘట్టాలకు శంకరరావు పాత్రధారి అవడం విశేషం. షాద్‌నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గంలో తదుపరి గెలుపు ఎవరిది..?
కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన పట్నం నరేంద్రరెడ్డి, కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డిపై 9319 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఎమ్మెల్సీగా ఉన్న నరేంద్ర రెడ్డిని టిఆర్ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొడంగల్‌లో పోటీకి దించింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే రేవంత్ రెడ్డినియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన టిడిపి పక్షాన రెండుసార్లు ఎన్నికయ్యారు. తదుపరి ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఇబ్బంది పడ్డారు. టిడిపి వర్కింగ్ అద్యక్షుడుగా ఉంటూ, ఆ పార్టీని వదలి కాంగ్రెస్ ఐలో చేరి వర్కింగ్ అద్యక్షుడు అయ్యారు. నరేంద్ర రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి సోదరుడు అవుతారు. నరేంద్ర రెడ్డికి 80754 ఓట్లు రాగా, రేవంత్ రెడ్డికి 71435 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీచేసిన బాలకిషోర్కు నాలుగువేల ఓట్లు వచ్చాయి. కాగా రేవంత్ రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికలలో మల్కాజిగిరి నుంచి పోటీచేసి గెలుపొందడం విశేషం. తదుపరి రేవంత్ పిసిసి అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2014లో ఐదుసార్లు గెలిచిన సీనియర్ నేత గురునాధరెడ్డిని 14614 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. 2009లో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన గురునాధ రెడ్డి 2014లో టిఆర్ఎస్లో చేరి పోటీచేశారు. అయినా ఫలితం దక్కలేదు. 2014లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్.పి విఠల్‌రావు 36304ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికే పరిమితం అయ్యారు. రేవంత్‌రెడ్డి ఒకసారి శాసనస మండలికి కూడా ఎన్నికయ్యారు. ఈయన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తమ్ముడికి అల్లుడు. కొడంగల్‌లో గురునాధ రెడ్డి ఐదుసార్లు 1978, 1983, 1989, 1999, 2004లలో గెలుపొందారు. కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి ఐదుసార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. కొడంగల్‌లో నందారం వెంకటయ్య ఒకసారి ఇండిపెండెంటుగా, రెండుసార్లు టిడిపి తరుపున గెలవగా ఆయన మరణం తర్వాత 1996లో జరిగిన ఉపఎన్నికలో వెంకటయ్య కుమారుడు సూర్య నారాయణ గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.అచ్యుతరెడ్డి కొడంగల్‌లో రెండుసార్లు గెలిచారు. కొడంగల్‌లో ఇంతవరకు పన్నెండుసార్లు రెడ్లు గెలుపొందితే, నాలుగుసార్లు వైశ్య సామాజికవర్గం గెలవడం విశేషం. అచ్యుత్ రెడ్డి కొంతకాలం పి.వి.నరసింహారావు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1952లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి వీరాస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొడంగల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
తాండూరు నియోజకవర్గంలో విజయం సాధించేది ఎవరు..?
తాండూరు నియోజకవర్గం తెలంగాణ అంతటా టిర్ఎస్ గాలివీస్తే తాండూరులో మాత్రం 2018 ఎన్నికల సమయం వరకు మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి ఓటమి పాలవడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో బలమైన నేతగా తయారైన ఆయన ఈ ఎన్నికలో ఓటమి చెందారు. ఆయనపై కాంగ్రెస్ ఐ అభ్యర్ది పైలట్ రోహిత్ రెడ్డి విజయం సాదించారు. రోహిత్‌కు 2875 ఓట్ల ఆధిక్యత లభించింది. తదుపరి రోహిత్ కూడా టిఆర్ఎస్లో చేరిపోయారు. గతంలో మహేందర్ రెడ్డి మూడుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి టిఆర్ఎస్ తరపున గెలిచారు. రోహిత్ రెడ్డికి 70428 ఓట్లు, మహేందర్ రెడ్డికి 67553 ఓట్లు వచ్చాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన రోహిత్ రెడ్డి మొదటి సారి గెలుపొందారు. కాగా బిజెపి పక్షాన పోటీచేసిన పటేల్ రవిశంకర్‌కు పదివేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ది, మాజీ ఎమ్మెల్యే నారాయణరావుపై 15982 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. అంతకుముందు మూడుసార్లు టిడిపి పక్షాన గెలుపొందగా 2014లో టిఆర్ఎస్లోకి వెళ్లి గెలిచారు. తదుపరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంత్రివర్గంలో మహేంద్రరెడ్డికి స్థానం లభించింది. కాని 2018లో మహేందర్ రెడ్డి ఓటమిపాలయ్యారు. తాండూరులో ఏడుసార్లు రెడ్లు గెలుపొందారు. ఏడుసార్లు బిసి నేతలు విజయం సాధించారు. ఒకసారి బ్రాహ్మణవర్గం నేత విజయం సాధించారు. తాండూరు నియోజకవర్గంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండుసార్లు గెలిచారు. ఈయన వికారాబాద్, మేడ్చల్, సనత్‌నగర్‌లలో మరోనాలుగుసార్లు గెలుపొందారు. చెన్నారెడ్డి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేసారు. కేంద్రంలో కొంతకాలం మంత్రిగా ఉన్నారు. 1967లో గెలిచాక ఈయన ప్రత్యర్ధిగా ఉన్న వందేమాతం రామచంద్రరావు ఎన్నికల పిటీషన్ వేయగా, కోర్టు ఈయనను అనర్హుడిగా ప్రకటించింది. దాంతో కేంద్రంలో పదవికి చెన్నారెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే సమయంలో వచ్చిన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ తరువాత కాలంలో రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని, నాలుగు రాష్ట్రాలకు గవర్నరు పదవినిచేపట్టారు. మధ్యలో కొంతకాలం నేషనల్ డెమొక్రాటిక్ పార్టీని నెలకొల్పి 1984లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి టిడిపి మద్దతుతో పోటీచేసి ఓడిపోవడం విశేషం. తిరిగి 1989 నాటికి కాంగ్రెస్ ఐలో చేరి మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1969లో ఉప ఎన్నికద్వారా శాసనసభకు ఎన్నికైన ఎమ్.మాణిక్యరావు 1972లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత మరో రెండుసార్లు గెలిచిన మాణిక్యరావు కొంతకాలం పి.వి.అంజయ్య భవనం కోట్ల మంత్రివర్గాలలో సభ్యులయ్యారు. మాణిక్యరావు సోదరుడు ఎమ్.చంద్రశేఖర్ రెండుసార్లు ఇక్కడ నుంచి గెలిచి మంత్రి పదవిని కూడా నిర్వహించారు. 2004లో వీరి మరో సోదరుడు నారాయణరావు కూడా ఇక్కడ నుంచి గెలిచారు. 2009లో మాణిక్‌రావు కుమారుడు రమేష్ పోటీచేసి ఓడిపోయారు. తాండూరు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వికారాబాద్ (SC) నియోజకవర్గం నాయకుడు ఎవరు?
వికారాబాద్ (ఎస్సి) నియోజకవర్గం వికారాబాద్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ది డాక్టర్ మెతుకు ఆనంద్ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ నేత, మాజీ మంత్రి ప్రసాదకుమార్‌పై 3122 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సిటింగ్ ఎమ్మెల్యే బి.సంజీవరావుకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన బదులు ఆనంద్‌కు ఇచ్చారు. ఆయనకు 51744 ఓట్లు రాగా, ప్రసాదకుమార్‌కు 48622 ఓట్లు వచ్చాయి. మరో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పార్వర్డ్ బ్లాక్ టిక్కెట్ పై పోటీచేసి 23 వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచారు. 2014లో ప్రసాదకుమార్ కాంగ్రెస్ ఐ తరుపున పోటీచేసి టిఆర్ఎస్ అభ్యర్ధి బి.సంజీవరావు చేతిలో ఓడిపోయారు. 10072 ఓట్ల ఆదిక్యతతో సంజీవరావు విజయం సాధించారు. 2018లో సంజీవరావుకు టిక్కెట్ ఇవ్వలేదు. వికారాబాద్ ఎస్.సి.లకు రిజర్వు అయిన నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ పదహారు సార్లు ఎస్.సి నేతలు గెలుపొందారు.అంతకుముందు రెండుసార్లు రెడ్లు గెలుపొందారు. ఇక్కడ సీనియర్ నేత చంద్రశేఖర్ 1985 నుంచి వరుసగా నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి టిఆర్ఎస్ తరుఫునగెలుపొందారు. 2004లో టిఆర్ఎస్ పక్షాన గెలిచిన ఈయన 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి ప్రసాద్‌కుమార్ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2009లో కూడా ప్రసాద్ ఈయనను ఓడిరచడం విశేషం. చంద్రశేఖర్ కొంతకాలం చంద్రబాబు క్యాబినెట్లో ఉండగా, మరికొంతకాలం డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. వికారాబాద్‌లో రెండుసార్లు గెలిచిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొత్తం ఆరుసార్లు గెలిచి మంత్రి, ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. ప్రముఖ దళితనేత ఆరిగే రామస్వామి వికారాబాద్‌లో నాలుగుసార్లు ఎన్నికయ్యారు. మంత్రి పదవికూడా చేపట్టారు. కాగా కిరణ్‌కుమార్ రెడ్డి క్యాబినెట్లో ప్రసాద్‌కుమార్ మంత్రి అయ్యారు. వికారాబాద్‌కు 16సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు గెలిస్తే, టిడిపి నాలుగుసార్లు, మూడుసార్లు టిఆర్ఎస్ గెలుపొందాయి. మరోసారి ఇండిపెండెంటు గెలిచారు. 1952, 57లలో వికారాబాద్ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1962లో అరిగే రామస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వికారాబాద్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
పరిగి నియోజకవర్గానికి పరిపాలించే పాలకుడు ఎవరు?
పరిగి నియోజకవర్గం పరిగి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన కొప్పుల మహేష్ రెడ్డి విజయం సాదించారు. ఆయన సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్ రెడ్డి కుమారుడు. హరీశ్వర్ రెడ్డి గతంలో ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన వారసుడుగా రంగంలోకి వచ్చిన మహేష్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డిపై 16400 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహేశ్వర్‌రెడ్డికి 82941 ఓట్లు రాగా, రామ్మోహన్ రెడ్డికి 66541 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ నుంచి పోటీచేసిన ఎఫ్ ఎస్ బి అభ్యర్ది కె.మల్లేశంకు దాదాపు తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి. పరిగి నియోజకవర్గంలో ఐదుసార్లు గెలుపొందిన సీనియర్ నేత హరీశ్వర్ రెడ్డి 2014లో టిఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిపోవడం విశేషం. 2009 ఎన్నికల వరకు టిడిపి తరపున గెలుస్తూ వచ్చిన హరీశ్వర్ రెడ్డి తెలంగాణ సాధనలో భాగంగా ఆయన టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరారు. అయినా2014లో పరిగిలో ఓడిపోయారు. కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి టి.రామ్మోహన్ రెడ్డి చేతిలో హరీశ్వర్ రెడ్డి 5163 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉండి, బిజెపిలో చేరి టిడిపి, బిజెపి కూటమి తరపున పోటీచేసిన కమతం రామిరెడ్డి కూడా ఓటమిపాలయ్యారు. రామిరెడ్డికి 13355 ఓట్లు మాత్రమే వచ్చాయి. పరిగిలో పన్నెండు సార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడుసార్లు ముస్లింలు గెలుపొందారు. హరీశ్వరరెడ్డి తొలిసారి 1985లో గెలుపొందారు. ఆ తరువాత 1994 నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఈయన కొంతకాలం డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్ నాయకుడు కమతం రామిరెడ్డి 1967లో ఇండ పిెండెంటుగాను, 72,89లలో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ఈయన కొంతకాలం జలగం క్యాబినెట్‌లోను, నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన ఎ.షరీఫ్ 1978 తరువాత చెన్నారెడ్డి, అంజయ్య క్యాబినెట్లో పనిచేసారు. 1952లో ఇక్కడ నుంచి ఎస్.జె.బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పరిగి నియోజకవర్గానికి 15సార్లు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. 2009లో పరిగి ఇండిపెండెంటుగా పోటీచేసిన టి.రామ్మోహన్‌రెడ్డి 38వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో ఉంటే, కాంగ్రెస్ అభ్యర్ధి కమతం రామిరెడ్డి మూడో స్థానంలో నిలిచారు. 2014లో రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా విజయం సాధించడం విశేషం. పరిగి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
చేవెళ్ల (SC) నియోజకవర్గం తదుపరి అభ్యర్థి..?
చేవెళ్ల (ఎస్సి ) నియోజకవర్గం చేవెళ్ల రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి కాలె యాదయ్య మరోసారి గెలిచారు. ఆయ తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి కె.ఎస్. రత్నంపై 33747 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో యాదయ్య కాంగ్రెస్ ఐ టిక్కెట్ పై గెలిచి, ఆ తర్వాత కాలంలో టిఆర్ఎస్ లో చేరారు.తిరిగి టిఆర్ఎస్ పార్టీ తరపున 2018లో పోటీచేసి విజయం సాదించారు. కాగా ఇక్కడ టిఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రత్నం టిక్కెట్ రానందుకు నిరసనగా పార్టీని వీడి కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. కాలె యాదయ్యకు 98701 ఓట్లు రాగా,కె.ఎస్ రత్నంకు 64954 ఓట్లు వచ్చాయి. బిజెపి పక్షాన పోటీచేసి కంజర్ల ప్రకాశ్ కు 5400 ఓట్లు వచ్చాయి. రత్నం గతంలో టిడిపి ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు టిఆర్ఎస్లోకి వెళ్లి ఆ పార్టీ తరపున పోటీచేసినా విజయం సాదించలేకపోయారు.కాంగ్రెస్ ఐఅభ్యర్దిగా పోటీచేసిన కె.యాదయ్య 781 ఓట్ల ఆదిక్యతతో రత్నంపై విజయం సాధించారు. 2009 నుంచి చేవెళ్ల రిజర్వుడ్ నియోకవర్గంగా ఉంది. ఇక్కడ ఏడుసార్లు రెడ్లు, మూడుసార్లు ఇతరవర్గాలవారు గెలుపొదగా, మూడుసార్లుగా ఎస్.సి నేతలు విజయం సాధిస్తున్నారు. 1962లో ఏర్పడిన చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు కలిసి ఏడుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, జనతాపార్టీ ఒకసారి, ఇండిపెండెంటు ఒకరు నెగ్గారు చేవెళ్లలో నాలుగుసార్లు గెలిచిన పి.ఇంద్రారెడ్డి, రెండుసార్లు చేవెళ్లలోను, రెండుసార్లు మహేశ్వరంలోను గెలిచిన సబిత భార్యభర్తలు. ఇంద్రారెడ్డి గతంలో ఎన్టిఆర్ క్యాబినెట్లో హోం శాఖతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలకు బాధ్యత వహించగా, సబిత డాక్టర్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో 2004లో గనుల శాఖను,2009లో మహేశ్వరం లో గెలిచాక హోంశాఖను పర్యవేక్షించే మంత్రి కావడం విశేషం. సబిత ఉమ్మడి ఏపీలో తొలి మహిళా హోం మంత్రికాగా, దంపతులు ఇద్దరూ ఒకే శాఖను చూసిన అరుదైన గౌరవాన్ని కూడా పొందారు. కాని తర్వాత సబిత జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కుని రాజీనామా చేయవలసి వచ్చింది. 1999లో గెలిచాక ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నిక ద్వారా సబితరాజకీయ ప్రవేశంచేశారు. 2014లో ఆమె పోటీలో లేరు. ఇంద్రారెడ్డి 1983లో లోక్‌దళ్ పక్షాన పోటీచేసి ఓడిపోయి, 1985 నుంచి మూడుసార్లు టిడిపి పక్షాన గెలిచారు. 1995లో టిడిపి చీలిక సమయంలో ఎన్టిఆర్ పక్షాన ఉన్నారు. ఆ తరువాత కొంతకాలం ఎన్టిఆర్ టిడిపి (లక్ష్మీపార్వతి) పార్టీలో కొనసాగి, తరువాత కాంగ్రెస్ ఐలో చేరి మరోసారి గెలిచారు. చేవెళ్ల (ఎస్సి ) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
శేరీలింగంపల్లి నియోజకవర్గం తదుపరి అధికార పార్టీ..!
శేరీలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన అరికపూడి గాందీ రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ది భవ్య ఆనంద్ పై 44194 ఓట్ల మెజార్టీతో గెలిచారు.గాందీ 2014లో టిడిపి,బిజెపి కూటమిలో భాగంగా టిడిపి అభ్యర్దిగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత కాలంలో ఆయన అదికార టిఆర్ఎస్ లో చేరిపోయారు.2018లో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి గెలవగలిగారు. గాంధీకి 143005 ఓట్లు రాగా, ఆనంద్ కు 98811 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.యోగానంద్ కు 22 వేలకు పైగా ఓట్లు వచ్చి,మూడోస్థానంలో నిలిచారు. గాందీ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. శేరిలింగంపల్లిలో 2014లో టిడిపి అభ్యర్ధిగా అరికపూడి గాందీ 75904 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.శేరీలింగంపల్లిలో ఒకసారి బిసి యాదవ్ వర్గానికి చెందిన వ్యక్తి గెలవగా, రెండుసార్లు కమ్మ సామాజికవర్గం నేత గెలుపొందారు. శేరీలింగంపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో అధికారికా పార్టీ ఎవరిధి?
రాజేంద్ర నగర్ నియోజకవర్గం రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన టి.ప్రకాష్ గౌడ్ తన సమీప టిడిపి ప్రత్యర్ది గణేష్ గుప్త పై 57331 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. మహాకూటమిలో భాగంగా ఈ సీటును టిడిపికి కేటాయించారు. ప్రకాష్ గౌడ్ గతంలో రెండుసార్లు వరసగా టిడిపి తరపున గెలిచారు. 2014లో గెలిచిన తర్వాత ఆయన టిఆర్ఎస్ లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ పక్షానే పోటీచేసి మరోసారి విజయం సాదించారు.ప్రకాష్ గౌడ్‌కు 106676 ఓట్లు రాగా, గణేష్ గుప్తాకు 49345 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎమ్.ఐ.ఎమ్. అభ్యర్దిగా పోటీచేసిన మిరాజ్ బేగ్‌కు 46 వేల కుపైగా ఓట్లు వచ్చి మూడోస్థానంలో ఉన్నారు. ప్రకాష్ గౌడ్ సామాజికపరంగా గౌడ వర్గానికి చెందినవారు. 2014లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన జ్ఞానేశ్వర్‌పై 25881 ఓట్ల తేడాతో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధిగా ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. 2009 లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో వరసగా మూడుసార్లు బిసి గౌడ్ వర్గం నేతగా ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మహేశ్వరం నియోజకవర్గం చరిత్రను తిరగరాసేది ఎవరు..?
మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాలుగోసారి విజయం సాదించి తన సత్తా చాటారు. హైదరాబాద్ పరిసరాలలో మొత్తం టిఆర్ఎస్ హవా కొనసాగగా మహేశ్వరంలో మాత్రం కాంగ్రెస్ ఐ పక్ష అభ్యర్ధిగా సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు.ఆమె తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ధి తీగల కృష్ణారెడ్డిపై 9227 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆమె టిఆర్ఎస్ లో చేరిపోవడం విశేషం.తదుపరి కెసిఆర్ మంత్రివర్గంలో సభ్యురాలు కూడా అయ్యారు. తన కుమారుడు కార్తిక్ విషయంలో కాంగ్రెస్ ఐ అన్యాయం చేసిందన్న బాద ఆమెకు ఉంది. మహేశ్వరం నుంచి 2014 లో టిడిపి పక్షాన గెలిచిన తీగల కృష్ణారెడ్డి కూడా ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరిపోతే,ఇప్పుడు సబిత కూడా అదే ప్రకారం అదికార పార్టీలోకి మారిపోయారు. సబితా ఇంద్రారెడ్డికి 95481 ఓట్లు రాగా, తీగల కృష్ణారెడ్డికి 86254 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి తరపున పోటీచేసిన శ్రీరాములు యాదవ్ కు కూడా 38వేలకు పైగా ఓట్లు రావడం విశేషం. హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి 2014లో మహేశ్వరంలో. కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా రంగంలో ఉన్న ఎమ్.రంగారెడ్డిపై 30784 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2009 లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఆనాటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీచేసి గెలుపొందగా 2014లో ఆమె పోటీలో లేరు. ఆమె కుమారుడు చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్,సిపిఐ ల మధ్య పొత్తు కుదిరినా, మాజీ ఎమ్మెల్యే ఎమ్.రంగారెడ్డి కాంగ్రెస్ బిఫారం పై పోటీచేశారు. ఇక్కడ మూడుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలే గెలుపొందారు. చేవెళ్ల చెల్లెమ్మగా ప్రసిద్ధికెక్కిన సబిత ఇంద్రారెడ్డి అంతకుముందు చేవెళ్ల నుంచి రెండుసార్లు గెలిచారు. 2009లో చేవెళ్ల రిజర్వుడ్ నియోజకవర్గంగా మారడంతో సబిత మహేశ్వరం నుంచి 2009, 2018లలో పోటీచేసి గెలిచారు. 2004 నుంచి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబిత 2009లో హోంశాఖ బాధ్యతలను చేపట్టి ఉమ్మడి ఏపీ రాష్ట్ర చరిత్రలో ఈ శాఖను నిర్వహించిన తొలి మహిళగా నమోదయ్యారు. రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోనూ ఉన్నారు. అయితే జగన్ ఆస్తుల కేసులో చిక్కుకున్న సబితా ఇంద్రారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఈమె భర్త ఇంద్రారెడ్డి చేవెళ్ల నుంచి మూడుసార్లు టిడిపి పక్షాన ఒకసారి కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. ఆయన గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో వివిధ శాఖలు నిర్వహించారు. 1994లో ఇంద్రారెడ్డి కూడా హోంశాఖకు మంత్రిగా ఉన్నారు. ఈ రకంగా దంపతులు ఇద్దరూ ఒకే శాఖకు మంత్రులు అవడం కూడా అరుదైన విషయం. ఇంద్రారెడ్డి 1995లో టిడిపి చీలినప్పుడు ఎన్.టిఆర్ పక్షాన నిలిచారు. తరువాత కొంతకాలం ఎన్.టి.ఆర్ టిడిపి (లక్ష్మీపార్వతి)లో కొనసాగి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో సబిత కాంగ్రెస్‌లోనే కొనసాగి నాలుగుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. మహేశ్వరం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఎల్బి నగర్ నియోజకవర్గంను జయించేది ఎవరు..?
ఎల్బి నగర్ నియోజకవర్గం ఎల్బినగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన డి.సుధీర్ రెడ్డి 17251 ఓట్ల మెజార్టీతో టిఆర్ఎస్ ప్రత్యర్ది రామ్మోహన్ గౌడ్‌పై గెలుపొందారు. సుధీర్ రెడ్డి 2009లో మొదటి సారి గెలవగా, 2018లో రెండో సారి గెలిచారు. అయితే ఎన్నికలు జరిగిన కొద్ది కాలానికే ఆయన అదికార టిఆర్ఎస్లో చేరిపోయారు. సుధీర్ రెడ్డికి 113117 ఓట్లు రాగా, రామ్మోహన్ గౌడ్‌కు 95766 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్, పరిసరాలలో అంతా టిఆర్ఎస్ ప్రభంజనం వీస్తే ఇక్కడ మాత్రం మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్ ఐ గెలిచింది. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన పేరాల శేఖర్ రావుకు 21500ఓట్లు వచ్చాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన సుదీర్ రెడ్డి గతంలో కార్పొరేటర్‌గా కూడా గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఎల్బినగర్ నియోజకవర్గంలో అనూహ్య విజయం సాధించారు. కృష్ణయ్య గట్టి పోటీలో ఉంటారా అన్న సందేహాలు వ్యక్తం అయినా, ఆయన టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధిగా ఘన విజయం సాధించడం విశేషం. కృష్ణయ్య తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ధి రామ్మోహన్ గౌడ్‌పై 12525 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. రెండువేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో రెండుసార్లు రెడ్లు, ఒకసారి బిసి నేత గెలిచారు. ఎల్బి నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఇబ్రహింపట్నంని జయించే నాయకుడు ఎవరు?
ఇబ్రహింపట్నం నియోజకవర్గం ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరోసారి గెలిచారు. ఆయన దీనితో వరసగా మూడుసార్లు గెలిచినట్లయింది. రెండుసార్లు టిడిపి తరపున, ఒకసారి టిఆర్ఎస్ పక్షాన గెలుపొందారు. కిషన్ రెడ్డి 2014లో టిడిపి పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. కిషన్ రెడ్డి తన సమీప బిఎస్పి ప్రత్యర్ది మల్ రెడ్డి రంగారెడ్డి పై 411 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. రంగారెడ్డి కాంగ్రెస్ ఐ టిక్కెట్ ఆశించగా, మహాకూటమిలో భాగంగా ఆ సీటును టిడిపికి ఇవ్వడంతో ఆయన పార్టీ మారి బిఎస్పి టిక్కెట్ పై పోటీచేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఐ కూడా రంగారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించినా ఓటమి తప్పలేదు. కిషన్‌రెడ్డికి 71599 ఓట్లు రాగా, రంగారెడ్డికి71088 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిడిపి పక్షాన పోటీచేసి సామా రంగారెడ్డికి 16600 పైచిలుకు ఓట్లు వచ్చాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత కిషన్ రెడ్డి .2014 ఎన్నికలలో టిడిపి-బిజెపి అభ్యర్దిగా పోటీచేసిన కిషన్ రెడ్డి తన సమీప స్వతంత్ర అభ్యర్ధి, కాంగ్రెస్ ఐ తిరుగుబాటు అభ్యర్ధి ఎమ్. రామ్ రెడ్డిపై 11056 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో టిఆర్ఎస్ తరపున ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పోటీచేసిన ఓడిపోయారు. ఇబ్రహింపట్నంలో ఐదుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు గెలుపొందితే, మూడుసార్లు బిసి నేతలు గెలుపొందారు. ఈ నియోజకవర్గం రిజర్వుడ్ గా ఉన్నప్పుడు తొమ్మిది సార్లు ఎస్.సి.నేతలు విజయం సాధించారు. గతంలో మేడ్చల్‌లో పోటీచేసి మూడుసార్లు గెలిచిన సీనియర్ నాయకుడు టి.దేవేందర్‌గౌడ్ 2009లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి రెండు చోట్ల ఓడిపోయారు. ఇబ్రహీంపట్నంలో మూడోస్థానంలో మిగిలారు. మరో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి 1994లో టిడిపితరుఫున 2004లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. 2009లో ఓటమిపాలయ్యారు. 2018లో బిఎస్పి టిక్కెట్ పై పోటీచేసి ఓటమి చెందారు. 1952 నుంచి 1972 వరకు జనరల్‌గాను, 1978 నుంచి 2004వరకు రిజర్వుడుగాను ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం 2009లో తిరిగి జనరల్‌గా మారింది. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, సిపిఎం మూడుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి పిడిఎఫ్ ఒకసారి గెలుపొందాయి. కాంగ్రెస్‌నేత ఎమ్.ఎన్.లక్ష్మీనరసయ్య మూడుసార్లు గెలుపొందగా, సిపిఎమ్ పక్షాన కొండిగారి రాములు రెండుసార్లు గెలిచారు. మరో కాంగ్రెస్ నేత ఎజి కృష్ణ రెండుసార్లు గెలుపొందారు. ఇక్కడ నుంచి 1978లో గెలిచిన సుమిత్రదేవి మొత్తం ఐదుసార్లు వివిధ నియోజకవర్గాలలో విజయం సాధించారు. ఇక్కడ గెలిచినవారిలో సుమిత్రదేవి, పుష్పలీల, ఎమ్.ఎన్.లక్ష్మీనరసయ్యలు మంత్రి పదవులు నిర్వహించారు. ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఉప్పల్ తదుపరి అభ్యర్థి ఎవరు?
ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన బి.సుభాష్ రెడ్డి తన సమీప టిడిపి ప్రత్యర్ది వీరేందర్ గౌడ్ పై48232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ 2014లో గెలిచిన బిజెపి నేత ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ 26700పైచిలుకు ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కాగా వీరేందర్ గౌడ్ మాజీ మంత్రి, మాజీ ఎమ్.పి దేవేందర్‌గౌడ్ కుమారుడు, మహాకూటమిలో భాగంగా టిడిపి ఇక్కడ పోటీచేసినా ఫలితం దక్కలేదు. సుభాష్‌రెడ్డికి 117281 ఓట్లు రాగా, వీరేందర్ గౌడ్‌కు 69049 ఓట్లు వచ్చాయి. సుభాష్‌రెడ్డి సామాజికవర్గ పరంగా రెడ్డి నేత. 2014లో ఉప్పల్ నియోజకవర్గంలో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ 14169 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. అప్పుడు టిఆర్ఎస్ అభ్యర్ది బి.సుభాష్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో రెండుసార్లు రెడ్లు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలిచారు. ఉప్పల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కూకట్పల్లి ప్రజలు ఈసారి ఎన్నుకోబోతున్న అభ్యర్థి ఎవరు?
కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్పల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన మాదవరం కృష్ణారావు దివంగత టిడిపి నేత నందమూరి హరికృష్ణ కుమార్తె, టిడిపి అభ్యర్ధి నందమూరి సుహాసినిపై ఘన విజయం సాదించారు. రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఈ నియోజకవర్గం ఆకర్షించింది. కాంగ్రెస్ఐ, టిడిపి, తెలంగాణ జనసమితి, సిపిఐల మహా కూటమిలో భాగంగా టిడిపి ఈ సీటు తీసుకుంది. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఫలితం దక్కలేదు. చంద్రబాబు, కాంగ్రెస్ అదినేత రాహుల్ గాందీలు కలిసి కూకట్‌పల్లితో సహా హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. అయినా ఓటమి తప్పలేదు. మాదవరం కృష్ణారావు 41049 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. 2014 లో కృష్ణారావు టిడిపి టిక్కెట్‌పై గెలిచి, తదుపరి ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈసారి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి గెలిచారు. కృష్ణారావుకు 111612 ఓట్లు రాగా, సుహాసినికి 70563 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి బిఎస్పి టిక్కెట్ పై పోటీచేసిన హరిశ్చంద్రారెడ్డికి 12 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. 2014లో మాధవరం కృష్ణారావు 43186 ఓట్ల ఆదిక్యతతో టిఆర్ఎస్ అభ్యర్ధి గొట్టుముక్కల పద్మారావుపై విజయం సాదించారు. 2009లో కూకట్‌పల్లికి ప్రాతినిద్యం వహించిన లోక్‌సత్తా అదినేత జయప్రకాష్ నారాయణ 2014లో ఇక్కడ పోటీచేయలేదు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు. రెండువేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఒకసారి కమ్మ సామాజికవర్గం నేత, రెండుసార్లు వెలమ సామాజికవర్గం నేత గెలిచారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కుత్బుల్లాపూర్ ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు?
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన వివేకానందగౌడ్ మరోసారి గెలిచారు. 2014 ఎన్నికలలో ఆయన టిడిపి పక్షాన గెలిచి, ఆ తర్వాత కాలంలో టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈసారి టిఆర్ఎస్ టిక్కెట్‌పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మీద 41500 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. వివేక్ కు 154500 ఓట్లు రాగా, శ్రీశైలంకు 113000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి పోటీచేసిన బిజెపి అభ్యర్ధి కాసాని వీరేష్‌కు 9800 పైచిలుకు ఓట్లు వచ్చాయి. వివేక్ సామాజికవర్గ పరంగా గౌడ వర్గానికి చెందినవారు. 2014లో వివేకానంద గౌడ్ టిఆర్ఎస్ అభ్యర్ధి కె.హనుమంతరెడ్డిపై 39021 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వివేకానందగౌడ్ 2009లో టిఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిపోయి, 2014లో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్దిగా విజయం సాదించడం విశేషం. తదుపరి ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. 2009లో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలుపొందిన శ్రీశైలం గౌడ్ 2014లో కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక్కడ ఇంతవరకు గెలిచినవారంతా బీసి గౌడ్ వర్గం వారే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మల్కాజిగిరి నియోజకవర్గానికి పాలకుడు ఎవరు?
మల్కాజిగిరి నియోజకవర్గం మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మైనంపల్లి హనుమంతరావు ఘన విజయం సాదించారు. గతంలో ఆయన ఒకసారి రామాయంపేట ఉప ఎన్నికలోను, ఆ తర్వాత మెదక్ నుంచి అసెంబ్లీకి టిడిపి పక్షాన గెలిచారు. 2014 లో టిఆర్ఎస్ లో చేరి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు.ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. 2018 ఎన్నికలలో అసెంబ్లీకి మల్కాజిగిరి నుంచి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది, ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావుపై 73698 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇక్కడ నుంచి తెలంగాణ జనసమితి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ కు 34 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. తెలంగాణ జనసమితి మహాకూటమిలో భాగంగా ఉంది.మైనంపల్లి హనుమంతరావుకు 114149 ఓట్లు రాగా, రామచంద్రరావుకు 40451 ఓట్లు వచ్చాయి. హనుమంతరావు వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. రామచంద్రరావు 2014లో కూడా బిజెపి తరపున పోటీచేసి ఓటమి చెందారు. అప్పుడు టిడిపితో పొత్తుతో పోటీచేయగా, ఈసారి ఒంటరిగా నిలబడిరది. 2014 ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ది కనకారెడ్డి విజయం సాధించారు. కనకారెడ్డికి 2768 ఓట్ల ఆదిక్యత వచ్చింది. 2009 నుంచి ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఒక వెలమ, ఒక రెడ్డి, ఒక బిసి నేత(మున్నూరు కాపు) విజయం సాధించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మేడ్చల్ నియోజకవర్గాన్ని ఎవరు శాసించబోతున్నారు..?
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రముఖ విద్యాసంస్థల అదినేత చామకూర మల్లారెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికలలో ఆయన మల్కాజిగిరిలో టిడిపి పక్షాన ఎమ్.పిగా గెలిచి ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఎన్నికలలో మేడ్చల్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 88066 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి 2018లో టిక్కెట్ ఇవ్వలేదు. మల్లారెడ్డి గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. మల్లారెడ్డికి 167009 ఓట్లు రాగా, లక్ష్మారెడ్డికి 78943 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ధి నక్కా ప్రబాకర్ గౌడ్‌కు సుమారు 25800 ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచారు. మల్లారెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడుసార్లు బిసి నేతలు, రెండుసార్లు ఎస్.సి.నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు.మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు గెలిస్తే, టిడిపి నాలుగుసార్లు గెలిచింది. టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇక్కడ నుంచి 1978లో గెలిచాకే ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నారెడ్డి మొత్తం ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వికారాబాద్, తాండూరులలో రెండేసి సార్లు, ఒకసారి సనత్నగర్లోను ఆయన గెలుపొందారు. గతంలో ఈయన నీలం, కాసు మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవి కూడా నిర్వహించిన ఈయన నాలుగు రాష్ట్రాలకు గవర్నరుగా ఉన్నారు. ఒకసారి చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. అదే సమయంలో మొదల్కెన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, తెలంగాణ ప్రజా సమితి పార్టీని విజయపథంలో నడిపించిన ఘనత పొందారు. మేడ్చల్‌లో రెండుసార్లు గెలిచిన సమిత్రాదేవి మరో మూడుసార్లు ఇతర చోట్ల గెలిచారు. టిడిపిలో జడ్పి ఛైర్మన్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేసి, మంత్రి పదవిని అలంకరించిన టి.దేవేందర్‌గౌడ్ ఇక్కడ మూడుసార్లు విజయం సాధించారు. ఎన్.టిఆర్., చంద్రబాబు క్యాబినెట్లలో సభ్యునిగా ఉన్న దేవేందర్‌గౌడ్ 2008 నాటికి టిడిపిని వదలి సొంతంగా పార్టీని నవతెలంగాణ పేరిట ఏర్పాటు చేసి కొంత కాలం తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేసి మల్కాజిగిరి లోక్‌సభకు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీకి పోటీచేసి రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్నారు.ఆ తర్వాత తిరిగి టిడిపిలో పునః ప్రవేశించి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇక్కడ నుంచి పోటీచేసి గెలుపొందినవారిలో సుమిత్రాదేవి, ఉమా వెంకట్రామిరెడ్డి, కె.సురేంద్రరెడ్డి, దేవేందర్‌గౌడ్, మల్లారెడ్డి కూడా మంత్రి పదవులు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..