![Who Is The Ruler Of Medchal Constituency - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/2/medchel-1.jpg.webp?itok=-cPeLjZU)
మేడ్చల్ నియోజకవర్గం
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రముఖ విద్యాసంస్థల అదినేత చామకూర మల్లారెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికలలో ఆయన మల్కాజిగిరిలో టిడిపి పక్షాన ఎమ్.పిగా గెలిచి ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఈ ఎన్నికలలో మేడ్చల్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 88066 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికి 2018లో టిక్కెట్ ఇవ్వలేదు.
మల్లారెడ్డి గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. మల్లారెడ్డికి 167009 ఓట్లు రాగా, లక్ష్మారెడ్డికి 78943 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ధి నక్కా ప్రబాకర్ గౌడ్‌కు సుమారు 25800 ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచారు. మల్లారెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడుసార్లు బిసి నేతలు, రెండుసార్లు ఎస్.సి.నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు.మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు గెలిస్తే, టిడిపి నాలుగుసార్లు గెలిచింది. టిఆర్‌ఎస్ రెండుసార్లు గెలిచింది.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇక్కడ నుంచి 1978లో గెలిచాకే ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నారెడ్డి మొత్తం ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వికారాబాద్, తాండూరులలో రెండేసి సార్లు, ఒకసారి సనత్‌నగర్‌లోను ఆయన గెలుపొందారు. గతంలో ఈయన నీలం, కాసు మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవి కూడా నిర్వహించిన ఈయన నాలుగు రాష్ట్రాలకు గవర్నరుగా ఉన్నారు. ఒకసారి చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. అదే సమయంలో మొదల్కెన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, తెలంగాణ ప్రజా సమితి పార్టీని విజయపథంలో నడిపించిన ఘనత పొందారు.
మేడ్చల్‌లో రెండుసార్లు గెలిచిన సమిత్రాదేవి మరో మూడుసార్లు ఇతర చోట్ల గెలిచారు. టిడిపిలో జడ్‌పి ఛైర్మన్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేసి, మంత్రి పదవిని అలంకరించిన టి.దేవేందర్‌గౌడ్ ఇక్కడ మూడుసార్లు విజయం సాధించారు. ఎన్.టిఆర్., చంద్రబాబు క్యాబినెట్‌లలో సభ్యునిగా ఉన్న దేవేందర్‌గౌడ్ 2008 నాటికి టిడిపిని వదలి సొంతంగా పార్టీని నవతెలంగాణ పేరిట ఏర్పాటు చేసి కొంత కాలం తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేసి మల్కాజిగిరి లోక్‌సభకు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీకి పోటీచేసి రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్నారు.ఆ తర్వాత తిరిగి టిడిపిలో పునః ప్రవేశించి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇక్కడ నుంచి పోటీచేసి గెలుపొందినవారిలో సుమిత్రాదేవి, ఉమా వెంకట్రామిరెడ్డి, కె.సురేంద్రరెడ్డి, దేవేందర్‌గౌడ్, మల్లారెడ్డి కూడా మంత్రి పదవులు చేశారు.
మేడ్చల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment