రంగారెడ్డిలో ఢీ అంటే ఢీ | In rural constituencies Competition from Congress to BRS | Sakshi
Sakshi News home page

రంగారెడ్డిలో ఢీ అంటే ఢీ

Published Thu, Nov 23 2023 4:59 AM | Last Updated on Thu, Nov 23 2023 7:20 PM

In rural constituencies Competition from Congress to BRS - Sakshi

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి.  ఇందులో గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఎనిమిది సెగ్మెంట్లు ఉన్నాయి. రాజేంద్రనగర్, చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్, మేడ్చల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం జీహెచ్‌ఎంసీ పరిధి చుట్టూ విస్తరించి ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆరు చోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించగా,  కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఇద్దరూ బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు ఆ ఎనిమిదికి ఎనిమిది చోట్ల కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ను ఢీకొంటోంది. 

రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్లల్లో బీజేపీ పటిష్టంగా ఉండటంతో త్రిముఖ పోరు నెలకొంది. మిగతా చోట్ల బీఆర్‌ఎస్‌– కాంగ్రెస్‌ల మధ్య ద్విముఖ పోటీ కనిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో సానుకూలత మెండుగానే ఉన్నా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై  అసంతృప్తి కనిపిస్తోంది. ఎమ్మెల్యేల అనుచరుల తీరుపై  ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ  ఎంతమేర తనకు అనుకూలంగా మలుచుకుంటుందనే విషయంపై ఫలితాల సరళి ఆధారపడ్డట్టు స్పష్టమవుతోంది. 

చేవెళ్ల త్రిముఖ పోటీలో గట్టెక్కేదెవరు? 
గత ఎన్నికలకు భిన్నంగా చేవెళ్లలో త్రిముఖ పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్‌ఎస్‌ నుంచి మరోసారి పోటీ చేస్తూ హ్యాట్రిక్‌ విజయం కోసం యత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన చేతిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓడిపోయిన కేఎస్‌ రత్నం ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ ఈసారి  షాబాద్‌ మండలానికి చెందిన యువ నేత భీమ్‌ భరత్‌ను బరిలోకి దింపింది. కాలె యాదయ్య తీరు, ఆయన అనుచరులపై ఆరోపణలు, కుటుంబ సభ్యులకు ఎక్కువ పదవులు ఇప్పించుకోవటం వంటి అంశాలు బీఆర్‌ఎస్‌కు  ప్రతికూలంగా మారాయి.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధినే యాదయ్య నమ్ముకున్నారు.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఎమ్మెల్యేపై అసంతప్తిని కాంగ్రెస్‌ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌ తీవ్రంగా యత్నిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ కొంత బలంగా ఉండటం, గతంలో జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేసిన రత్నంకు స్వతహాగా ఉన్న కేడర్‌ ఇప్పుడు క్రియాశీలంగానే పనిచేస్తోంది. దీంతో ఆయన కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది.  

పరిగి వారిమధ్యే పోరు 
బీఆర్‌ఎస్‌ – కాంగ్రెస్‌ల నుంచి గత ఎన్నికల్లో పోటీ పడ్డ అభ్యర్థులే మళ్లీ ఈసారి బరిలో నిలిచారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ మరోసారి బరిలో దింపింది. సీనియర్‌ నేత హరీశ్వర్‌రెడ్డి తనయుడుగా ఆయనకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. ఇటీవలే హరీశ్వర్‌రెడ్డి చనిపోవటంతో కొంత సానుభూతి  ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇక సీనియర్‌ నేత, గతంలో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన టి.రామ్మోహన్‌రెడ్డిపై పార్టీ మరోసారి నమ్మకాన్ని ఉంచింది. బీజేపీ నుంచి మారుతీకిరణ్‌ పోటీలో ఉన్నారు. కానీ ఇక్కడ పోటీ మాత్రం బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్యనే ఉంది.

ఈసారి రామ్మోహన్‌రెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండటం, నియోజకవర్గ పరిధిలోని కుల్కచర్ల డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి రావటం (ప్రస్తుత తాండూరు కాంగ్రెస్‌ అభ్యర్థి), మరికొందరు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు కాంగ్రెస్‌లోకి రావటంతో పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌ ముఖ్యనేత రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్‌  పరిగి నియోజకవర్గానికి పక్కనే ఉండటం కూడా ఆ పార్టీలో కొంత సానుకూలత కనిపించటానికి కారణమైంది. బీజేపీ అభ్యర్థి చీల్చే ఓట్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

వికారాబాద్‌ ద్విముఖ పోరు 
గత ఎన్నికల్లో విజయం సాధించిన మెతుకు ఆనంద్‌ను మరోసారి బీఆర్‌ఎస్‌ బరిలో దింపగా, కాంగ్రెస్‌ పార్టీ కూడా గత అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్‌నే పోటీకి నిలిపింది. ఆ ఎన్నికల్లో దాదాపు మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్‌ ఈసారి గట్టి పోటీనిస్తుండటంతో ఈ ఎన్నిక ఆసక్తిగా మారింది. మాజీ మంత్రి, స్థానికుడైన సీనియర్‌ నేత  చంద్రశేఖర్‌ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారి జహీరాబాద్‌ నుంచి పోటీలో నిలిచారు.

ఆయన కాంగ్రెస్‌లోకి రావటంతో ఆయన వెంట కాంగ్రెస్‌లోకి వచ్చిన వికారాబాద్‌ కేడర్‌ బలం ఇప్పుడు గడ్డంప్రసాద్‌కుమార్‌కు కలిసి రానుంది. స్థానికంగా బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నా.. పోటీ మాత్రం బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్యలోనే కేంద్రీకృతమైనట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యే ఆనంద్‌ పనితీరుపై కొన్ని ప్రాంతాల్లో  అసంతృప్తి కనిపిస్తోంది.  గడ్డం ప్రసాద్‌కుమార్‌ కాంగ్రెస్‌ హయాంలో మంత్రి హోదాలో వికారాబాద్‌ను పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉండటాన్ని ఆనంద్‌ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.  

మహేశ్వరం ముక్కోణపు పోటీ 
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున గెలిచి తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి దక్కించుకున్న సబితారెడ్డి ఈసారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీనియర్‌ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ అభ్యర్థిగా శ్రీరాములు యాదవ్‌ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంత్రి సబిత, మిగతా ఇద్దరు అభ్యర్థుల నుంచి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఏడు నెలల క్రితంహస్తం గూటికి చేరిన బడంగ్‌పేట మేయర్‌ పారిజాత నరసింహారెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా కేఎల్‌ఆర్‌ దక్కించుకున్నారు.

దీంతో స్థానికంగా పట్టున్న  పారిజాత తీవ్ర అసంతృప్తికి గురైనా, అనంతరం కొంత సయోధ్యతో ప్రచారంలో పాల్గొంటుండటం కేఎల్‌ఆర్‌కు కలిసివచ్చే అంశం. సబితారెడ్డి కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరటం జనంలో కొంత అసంతృప్తికి కారణమైంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి నుంచి సబితకు పూర్తిస్థాయి సహకారం అందటం లేదంటున్నారు. మరోవైపు, బీజేపీ అభ్యర్థి  శ్రీరాములుయాదవ్‌ ఇక్కడ పెద్దసంఖ్యలో ఉన్న తన సామాజిక వర్గం ఓట్లపై గురిపెట్టారు. ఈ విషయంలో ఆయనకు  సానుకూలత కనిపిస్తోంది. ఫలితంగా ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. 

ఇబ్రహీంపట్నం టఫ్‌ ఫైట్‌ 
గత ఎన్నికల్లో కేవలం 376 ఓట్లతో విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి నుంచి టఫ్‌ ఫైట్‌ ఎదురైంది. ఎమ్మెల్యేపై స్థానికంగా వ్యతిరేకత కనిపిస్తున్నా.. ఆయన మాత్రం  ప్రభుత్వ పథకాలు, స్థానికంగా జరిగిన పురోగతిని వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన సానుభూతి, స్థానికంగా కాంగ్రెస్‌కు నమ్మకమైన ఓటు బ్యాంకు ఉండటం మల్‌రెడ్డి రంగారెడ్డికి కలిసిరానున్నాయి.

అసైన్‌మెంట్‌ భూములను వెనక్కు తీసుకుంటున్న అంశం కొన్ని ప్రాంతాల్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. అంతర్గత రోడ్లు సరిగా లేకపోవటం, నిరుద్యోగ అంశంపై జనంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి అంశాలను కాంగ్రెస్‌ అభ్యర్థి అందిపుచ్చుకుని ప్రచారంలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా దయానంద్‌ గౌడ్‌ పోటీలో ఉన్నా.. పోటీ మాత్రం బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్యే కనిపిస్తోంది. 

రాజేంద్రనగర్‌ త్రిముఖ పోరులో గెలుపెవరిదో? 
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది. మణికొండ మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌ ముదిరాజ్‌ను కాంగ్రెస్‌ పార్టీ బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలో నిలిచి గెలుపు అంచుల వరకు వచ్చిన మజ్లిస్‌ పార్టీ ఈసారి ముస్లిమేతర అభ్యర్థి స్వామియాదవ్‌ను పోటీలో నిలిపింది. మజ్లిస్‌ అగ్రనేతలు స్థానికంగా ప్రచారంపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఇక ఈ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జీహెచ్‌ఎంసీ డివిజన్‌ మైలార్‌దేవుపల్లి కార్పొరేటర్‌ తోక శ్రీనివాసరెడ్డిని బీజేపీ బరిలో నిలిపింది.

నియోజవర్గ పరిధిలో మూడు జీహెచ్‌ఎంసీ డివిజన్‌లకు బీజేపీ కార్పొరేటర్లున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి గట్టిపోటీదారుగా మారిపోయారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నమ్ముకుని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌ పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీ బలాన్ని, బీసీ సామాజిక వర్గాల అండనే నమ్ముకున్నారు. మజ్లిస్‌ నుంచి నాన్‌ మైనారిటీ నేత బరిలో ఉండటంతో ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. 

మేడ్చల్‌మెరిసేది ఎవరో..?
మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్‌ అభ్యర్థి వజ్రేష్‌ యాదవ్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఓ పక్షం రోజుల క్రితం వరకు మల్లారెడ్డికి కొంత అనుకూల వాతావరణం ఉన్నా, పది రోజుల్లో బీఆర్‌ఎస్‌ నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలో నేతలు కాంగ్రెస్‌లోకి మారటం ఆయనపై ప్రభావాన్ని చూపుతోంది. బోడుప్పల్‌ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు, ఘట్‌కేసర్‌ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. మేడ్చల్, శామీర్‌పేటల్లోని కొందరు సర్పంచులు, ఓ వైస్‌ ఎంపీపీ కూడా పార్టీ కండువా మార్చుకోవటం కాంగ్రెస్‌కి కలిసి వచ్చింది.

ప్రజల్లో కాంగ్రెస్‌ పట్ల కొంత సానుకూల ధోరణికి ఈ నేతల మార్పులు తోడు కావటంతో కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరిగింది. కానీ ప్రచారంలో ఇంకా జోరుపెంచాలి. ఇక మంత్రిగా తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మల్లారెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మల్లారెడ్డి మాట తీరు, ఆయన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి అనుచరులపై ఉన్న ఆరోపణలు కూడా ఆయనకు కొంత ప్రతికూలంగా మారేలా ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి దయానంద్‌ గౌడ్‌ పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్యనే కనిపిస్తోంది. 

తాండూరు ఇద్దరి మధ్యనే తీవ్రపోటీ
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన పైలట్‌ రోహిత్‌రెడ్డి  ఆతర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి ఇప్పుడు కారు గుర్తుపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌నే అంటిపెట్టుకుని ఉన్నా పార్టీ టికెట్‌ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలుస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇచ్చి పార్టీ మారకుండా బీఆర్‌ఎస్‌ జాగ్రత్త పడింది.

ఆయన తన సోదరుడు నరేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న కొడంగల్‌లో ప్రచారానికే పరిమితమయ్యారు.  కుల్కచర్లకు చెందిన డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ తాండూరు అభ్యర్థిగా నిలబెట్టింది. గతంలో ఇది కాంగ్రెస్‌ పార్టీ స్థానం కావటం, ప్రభుత్వంపై స్వతహాగా ఉండే వ్యతిరేకత, ఎమ్మెల్యే అనుయాయులపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కలిసి వస్తుందని కాంగ్రెస్‌ బలంగా నమ్ముతోంది.

ఇక్కడి నుంచి పోటీకి బీజేపీ నేతలు సిద్ధపడ్డా, పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ నుంచి నేమూరి శంకర్‌గౌడ్‌ పోటీలో ఉన్నారు. దీంతో బీజేపీ నేతలు కొందరు కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీఎస్పీ నుంచి చంద్రశేఖర్‌ ముదిరాజ్‌ పోటీ పడుతున్నారు. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్‌ మండలాల్లో కాంగ్రెస్‌ బలంగా కనిపిస్తోంది. స్థానికంగా అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి..


-ఉమ్మడి రంగారెడ్డి గ్రామీణ నియోజకవర్గాల నుంచి గౌరీభట్ల నరసింహమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement