ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచే ఒకరికి చాన్స్
ఈటల పేరు దాదాపుగా ఖరారు !
పోటీలో అర్వింద్, డీకే అరుణ, రఘునందన్, కేవీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాకే, రాష్ట్ర నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నాయి. జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ.నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిలను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్న విషయం తెలిసిందే. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అటు నడ్డాను, ఇటు కిషన్‌రెడ్డిని తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కేబినెట్‌లో ఉండటంతో వీరిస్థానంలో అధ్యక్ష బాధ్యతలు వేరే వారికి అప్పగించనున్నారు. కర్ణాటకతోపాటు రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఏపీ, తమిళనాడు, కేరళలలో బలపడాలని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది.
రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేతకే అవకాశం ?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఒకరి అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఓసీ సామాజికవర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేఎల్పీనేతగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ సామాజికవర్గానికే చెందిన ఇస్తారని అంటున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎజెండాతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని హామీ కూడా ఇచ్చింది. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థలు, ఆ తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో సతా చాటడం అత్యవసరంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపుగా ఖరారైనట్టుగా పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడైన నేతగా, బీసీలతోపాటు అన్నివర్గాల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిగా, ఇరవై ఏళ్ల పాటు బీఆర్‌ఎస్‌లో నంబర్ –2గా, మంత్రిగా ఈటలకున్న అనుభవం బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పార్టీ నాయకత్వం గట్టిగా విశ్వసిస్తోంది.
రాజకీయంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసినందున, సంస్థాగతంగా బలపడేలా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా పార్టీని అన్నివిధాలా సంసిద్ధం చేసుకునేందుకు ఉపయోగపడే నేతలకే అధ్యక్ష పదవి దక్కుతుందదని భావిస్తున్నారు. అయితే రాష్ట్రపార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారిలో ఎంపీలు అర్వింద్, డీకే.అరుణ, రఘునందన్‌రావు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌తోపాటు మరికొందరు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment