తెలంగాణ మంత్రి టి.హరీశ్ రావు సిద్దిపేటలో పలు రికార్డులు సృష్టించారు. ఆయన మూడు ఉప ఎన్నికలతో సహా ఆరుసార్లు ఇంతవరకు గెలిచారు. ఈ సారి గెలిస్తే ఏడోసారి గెలిచినట్లవుతుంది. 2004లో బీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటతో పాటు కరీంనగర్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తదుపరి జరిగిన ఉప ఎన్నికలో హరీష్ రావు విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయనకు తిరుగులేదు.
2018 ఎన్నికలలో హరీశ్‌రావు తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ సాధించారు. ఆయనకు తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాసరెడ్డిపై 118669 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2014లో ఆయనకు 93328 ఓట్ల ఆధిక్యత లభించింది. 2010 ఉప ఎన్నికలో ఆయనకు 95853 ఓట్ల మెజార్టీ లభించింది. 2009లో హరీష్ రావుకు 64677 ఓట్ల ఆధిక్యత, 2008 ఉప ఎన్నికలో 58935 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆయన 2004 లో జరిగిన ఉప ఎన్నికలో మాత్రం 24827 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆ తర్వాత నాలుగుసార్లు ఏభై వేల మించి మెజార్టీ సాధించడం, అందులోను ఒకసారి లక్ష ఓట్ల ఆధిక్యతను అధిగమించడం ఒక రికార్డే అని చెప్పాలి. హరీష్ పై ఐదుసార్లు పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్ధులకు డిపాజిట్లు రాకపోవడం కూడా మరో విశేషం
►ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా తెలంగాణ శాసనసభ ఎన్నికలలో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నారు. ఆయన ఇంతవరకు ఏడుసార్లు విజయం సాధించారు. 2004 నుంచి ఇంతవరకు ఓడిపోకుండా గెలుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వచ్చిన విబేధాల కారణంగా ఈటెల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పక్షాన పోటీచేసి గెలవడం ఒక సంచలనం. ప్రస్తుతం పోటీచేస్తున్న నేతలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అత్యధిక సార్లు గెలిచిన నేతగా ఈటల ఉన్నారు. ఆయన మూడు ఉప ఎన్నికలలో కూడా గెలిచారు. 2004, 2008 ఉప ఎన్నికలలో కమలాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తదుపరి ఆ నియోజకవర్గం రద్దు కావడంతో హుజూరాబాద్ నుంచి 2009, 2010 ఉ.ఎ., 2014, 2018, 2021 ఉప ఎన్నికలో విజయకేతనం ఎగురవేశారు.
►తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కె.తారక రామారావు 2009లో తన రాజకీయ జీవితం ఆరంభించినప్పుడు శాసనసభ ఎన్నికలలో తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికలలో తెలంగాణలో అప్పటి టీఆర్ఎస్ తీవ్ర సంక్షోభానికి గురైంది. తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసుకుని పోటీ చేసినా కేవలం పది సీట్లలోనే టీఆర్ఎస్ గెలిచింది.
ఆ క్రమంలో కేటీఆర్ కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కె.కె.మహేందర్ రెడ్డి నుంచి గట్టి పోటీని తట్టుకుని కేవలం 171 ఓట్ల ఆధిక్యతతోనే గెలిచారు. కాని ఆ తర్వాత మాతరం భారీ ఆధిక్యతలతో ఆయన గెలుస్తూ వస్తున్నారు. 2010 ఉప ఎన్నికలో 68220 ఓట్ల మెజార్టీ, 2014లో 53004 ఓట్లు, 2018లో 89009 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాజకీయాలలో రాణిస్తున్నారు. ఇంతవరకు నాలుగుసార్లు ఆయన పోటీచేయగా, మూడు సార్లు ఆయనకు ప్రత్యర్ధిగా మహేందర్ రెడ్డే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment