సాక్షి, హైదరాబాద్: ‘‘ఆగమాగం, పరేశాన్ ఎందుకు అయితున్నరు. మళ్లా మనమే గెలుస్తున్నం. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నాం. రెండు రోజులు నిమ్మళంగా ఉండండి. 3వ తేదీన అందరం కలసి సంబురాలు చేసుకుందాం..’’ అని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం పొద్దంతా ఓటింగ్ సరళి, ఇతర అంశాలపై సమీక్షించిన సందర్భంగా నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఈ నెల 4న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది.
ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుండటంతో.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు, కేబినెట్ భేటీ నిర్వహణకు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రగతిభవన్‌కు బారులు తీరిన నేతలు సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రగతిభవన్‌కు చేరుకోగా.. శుక్రవారం ఉదయం నుంచే బీఆర్‌ఎస్ నేతలు ప్రగతిభవన్‌కు బారులు తీరారు.
పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, మంత్రి నిరంజన్‌రెడ్డి, మధుసూదనాచారి, బాల్క సుమన్‌తోపాటు నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాలకు చెందిన నేతలు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆదివారం వెలువడే ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కే సానుకూలంగా ఉంటాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేసీఆర్‌తో భేటీ తర్వాత ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చిన నేతలంతా.. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో భేటీ అయ్యారు.
కేటీఆర్, హరీశ్‌రావులతో సమీక్ష
పార్టీ అధినేత కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావు ఇద్దరూ ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వార్‌రూమ్‌ల నుంచి, వివిధ వర్గాల నుంచి అందిన గణాంకాలు, నివేదికలతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జులు, అభ్యర్థుల నుంచి అందిన వివరాలను విశ్లేంచారు. కీలక నియోజకవర్గాలు గజ్వేల్, కామారెడ్డి, కొడంగల్‌లో ఓటింగ్ సరళిపైనా పోస్టుమార్టం చేశారు. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకుతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగానే ఓటింగ్‌లో పాల్గొన్నారని ఈ సందర్భంగా కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హంగ్ ఫలితాలకు అవకాశం లేదని, స్పష్టమైన మెజారిటీతోనే బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఎగ్జిట్ పోల్స్ కాదు.. ఎగ్జాక్ట్ పోల్స్ లెక్క!
అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ తనను కలసిన నేతలతో పేర్కొన్నట్టు తెలిసింది. బీఆర్‌ఎస్ పకడ్బందీగా చేసిన పోల్ మేనేజ్‌మెంట్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ చీల్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే బీఆర్‌ఎస్‌కే సానుకూలత ఉందని చెప్పినట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ కాకుండా ఎగ్జాక్ట్ పోల్‌నే లెక్క అని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారని.. ఏజెంట్ల నియామకం మొదలు ప్రక్రియ పూర్తయ్యేదాకా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారని సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడే క్రమంలో పార్టీ అభ్యర్థులతో టచ్‌లో ఉండాలని కేటీఆర్, హరీశ్‌రావులకు సూచించారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment