కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 421 హామీలపై ఆందోళనలతో ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాల ఖరారు
సర్కారు వాగ్దానాల అమలుపై పట్టుబట్టేలా నిరసనలు
ఇప్పటికే రైతులు, మహిళలు, నిరుద్యోగ సమస్యలపై వివిధ రూపాల్లో నిర్వహణ
ఏడు నెలల పాలనలో ప్రభుత్వ శాఖల్లోని అవినీతి, అక్రమాలపై పోరాటాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమలదళం పోరుబాట పట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడునెలలు దాటడంతో హామీల అమలుపై పట్టుబట్టేలా ఉద్యమకార్యాచరణకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 421 హామీలపై ప్రత్యక్ష ఆందోళనలతో వివిధవర్గాల సమస్యలపై ప్రజల్లోకి వెళ్లేలా ఆందోళన కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకోసం పార్టీపరంగా ఉన్న యువజన, మహిళా, కిసాన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మోర్చాల ద్వారా ఆందోళనలను ఇప్పటికే ప్రారంభించింది. రైతాంగానికి ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్ల ఎదుట ‘రైతు సత్యాగ్రహం’ నిర్వహించింది.
రైతులకిచ్చిన హామీల అమలుకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టకపోతే... ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లోనే పెద్దఎత్తున నిరసనలు నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి ఇచ్చిన ప్రధాన హామీలైన రుణమాఫీ రూ.2 లక్షలు, రైతు భరోసా కింద రైతుకూలీల అకౌంట్లలో రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు, ఫసల్ బీమా అమలు, రైతులకు క్వింటాల్ వరికి రూ.500 బోనస్ వంటివాటి అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనుంది.
మహిళలు, నిరుద్యోగుల సమస్యలపై..
ఎన్నికలకు ముందు మహిళా లోకానికి ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ మంగళవారం మహిళా మోర్చా నేతృత్వంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించింది. ఏడు నెలలు గడిచినా మహిళలకు ప్రతి నెలా రూ. 2 వేల సాయం అమలు కాకపోవడం, కొత్త రేషన్ కార్డులు పంపిణీ లేకపోవడం, ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందకపోవడంతో పాటు మహిళలకు రూ. 500కే వంట గ్యాస్, 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్ వాగ్దానాలు ఏమయ్యాయని ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇక నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి చెల్లింపు డిమాండ్‌తో పాటు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల జారీ కాకపోవడం వంటి సమస్యలపై యువమోర్చా ఉద్యమబాట ఉధృతం చేయనుంది.
అవినీతి, అక్రమాలపై ఆధారాల సేకరణ...
రాష్ట్రంలో సివిల్ సప్లయిస్, ఇతర శాఖల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెలికి తీసిన నేపథ్యంలో...ఈ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నందున ఆయా అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్రం దృష్టికే తీసుకెళ్లాలని పార్టీనాయకులు భావిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ శాఖలకు కేంద్రం నుంచి నిధులు, గ్రాంట్లు వస్తున్నందున, వాటిపై కేంద్రం విచారణ కోరేలా, ఆయా శాఖల్లో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి పూరిస్థాయిలోఆధారాలు సేకరించి అందజేయాలని నిర్ణయించినట్లు పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు.
స్థానిక ఎన్నికల నాటికి పట్టు సాధించాలని..
రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లోగా తొలుత గ్రామీణ (గ్రామపంచాయతీ, జిల్లా/మండల పరిషత్), వచ్చే ఏడాది ప్రథమార్థంలో పట్టణ (మున్సిపల్, కార్పొరేషన్) స్థానికసంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో పార్టీ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచుకుని క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలాన్ని పెంచుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో పోలింగ్‌బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యావత్ పార్టీ యంత్రాంగం నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనేలా కార్యాచరణను రూపొందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment