సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు హస్తం గూటికి చేరగా.. పార్టీ మారేందుకు మరికొందరు నేతలు సిద్ధంగా ఉన్నారు. మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్‌స్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన కొడుకు బండ్ల సాకేత్ రెడ్డితో కలిసి నిన్న శనివారం కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో పాటు ఎమ్మెల్సీ చల్ల వెంకట్రాంరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరునున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సీఎం రేవంత్‌తో భేటీ అయినట్టు సమాచారం. మరో రెండు లేదా మూడు రోజుల్లో వీరిద్దరూ హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. గద్వాల బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగిలేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే వెంట అందరూ కాంగ్రెస్ పార్టీలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఎసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, రానున్న రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment