కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం.. బీఆర్‌ఎస్ ఉనికి కోల్పోయాయి
రాష్ట్ర బీజేపీ చరిత్రలో తొలిసారి గణనీయమైన సీట్లు సాధించాం
ఢిల్లీలో మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రానున్నరోజుల్లో రాష్ట్రంలో బలమైన రాజకీయశక్తిగా ఎదుగుతామని, అధికారంలోకి వచ్చేందుకు సమష్టిగా కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, ప్రజలు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీని చూస్తున్నారని తెలిపారు. గురువారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరునెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం, బీఆర్‌ఎస్ ఉనికి కోల్పోయాయని దుయ్యబట్టారు. ప్రజల గుండెచప్పుడై సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తే.. ఇప్పటి వరకు బీజేపీ తొలిసారి గణనీయమైన స్థానాలు సాధించిందని తెలిపారు.
కాంగ్రెస్ తొండిఆట ఆడింది
బీజేపీ మూడోసారి గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేసి ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తొండిఆట ఆడిందని కిషన్‌రెడ్డి అన్నారు. అమిత్‌షా వీడియోను మార్ఫింగ్ చేసి దిగజారుడు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. ఇంత చేసినా ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపారని చెప్పారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని అన్నారు. ఆ పార్టీ మోసాలను ఎండగతామని, ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతామని తెలిపారు.
బెదిరించినా, భయపెట్టినా విజయం సాధించాం
లోక్‌సభ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి బెదింరిపులకు పాల్పడినా, భయపెట్టినా ఆయన సొంత జిల్లాతోపాటు, మల్కాజిగిరిలోనూ బీజేపీ విజయం సాధించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా, బీఆర్‌ఎస్‌కు కంచుకోటలాంటి మెదక్‌లో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారని చెప్పారు. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఆధిక్యం ప్రదర్శించిందన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం 39 కాగా.. ఇప్పుడు 40 శాతానికి పెరిగిందని చెప్పారు. ఈ ఎన్నికలు ఆరు నెలల పాలనకు రెఫరెండంగా ప్రకటించుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క శాతం ఓట్లు మాత్రమే అదనంగా సాధించిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచి 6 చోట్ల రెండో బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచామని చెప్పారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ పోటీ చేసినట్టు ఉందని, నాంపల్లి నియోజకవర్గాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
రామమందిరం రాజకీయఅంశం కాదు
దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఆధారంగానే బీజేపీ ఎన్నికలకు వెళ్లిందని, రామమందిరం రాజకీయ అంశం కాదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. భిన్న సంస్కృతులు, భిన్న భాషలకు నిలయమైన దేశంలో హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మోదీకి కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment