ఫిరాయింపుదారులపై సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
వారిని మళ్లీ గెలిపించుకుంటేనే సీఎంకు దమ్మున్నట్లని వ్యాఖ్య
పార్టీ మారితే సభ్యత్వం రద్దు అవుతుందని రాహుల్ చెప్పలేదా?
జగిత్యాల: ‘సీఎం రేవంత్‌రెడ్డి.. నీకు దమ్ముంటే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. వారిని మళ్లీ గెలిపించుకుంటేనే దమ్మున్నోడివి’అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో సోమవారం జరిగిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సిగ్గులేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
2014లో అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రస్తుత సీఎం ప్రయతి్నంచి రూ. 50 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని, ఆ పరిస్థితుల్లోనే రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా బీఆర్‌ఎస్ ఎప్పుడూ వ్యవహరించలేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరితే రాళ్లతో కొట్టి చంపాలని స్వయంగా రేవంత్‌రెడ్డే వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దయ్యేలా రాజ్యాంగ సవరణ చేస్తామంటూ స్వయంగా రాహుల్‌గాంధీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసింది కేసీఆరేనని.. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని స్పష్టం చేశారు. 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలను చేర్చుకొనే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
కార్యకర్తలు, నాయకులు అధైర్యపడొద్దని, మళ్లీ పార్టీకి మంచిరోజులు వస్తాయని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, నాయకులు బాజిరెడ్డి గోవర్దన్, నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలన్నారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ అనే యువకుడికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన నిరుద్యోగ యువకులపై లాఠీచార్జి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే తమ పార్టీ నేతలను అడ్డుకోవడంపై మండిపడ్డారు. ప్రజాపాలనలో పరామర్శించే, నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment