పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలి: కేటీఆర్
బీఆర్‌ఎస్ పాలనలో 400 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం..
కాంగ్రెస్ మాత్రం 420 హామీలతో మోసం చేస్తోంది
రుణమాఫీ చేయలేదు.. బోనస్‌పై మాట తప్పారు
చౌటుప్పల్, నకిరేకల్: ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీ స్కీంలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలో వచ్చారని.. ఆరు నెలలైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా హామీలేవీ అమలు కాలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలో, నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు నమ్మితే గోస పడుతామని తాము ముందే చెప్పామని.. ఇప్పుడు అదే జరిగిందని చెప్పారు. డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని.. ఇప్పటివరకు చేయకపోగా దేవుళ్ల మీద ఒట్లు పెడుతూ మరోసారి రైతులను మోసం చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. ధాన్యం బోనస్ విషయంలో కూడా రేవంత్‌రెడ్డి మాట తప్పారని.. సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటున్నారని విమర్శించారు.
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు..
కాంగ్రెస్ గ్యారంటీల విషయంలో రాహుల్‌గాందీ, ప్రియాంకా గాంధీ కూడా అబద్ధాలు ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా జాబ్‌లు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన 30వేల ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినవేనని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో 400కుపైగా సంక్షేమ కార్యక్రమాలు చేపడితే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పక్కా 420 వ్యక్తి అని వ్యాఖ్యానించారు. రేవంత్ తీరుతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో 1.5 లక్షల వివాహాలు జరిగాయని.. ఆ జంటలకు లక్ష రూపాయలతోపాటు 1.5 లక్షల తులాల బంగారాన్ని రేవంత్‌రెడ్డి బాకీ ఉన్నారన్నారు.
గోల్డ్ మెడలిస్టు కావాలా.. బ్లాక్ మెయిలిస్టా..
బీఆర్‌ఎస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గోల్డ్ మెడలిస్టు అని.. కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న వ్యక్తి పెద్ద బ్లాక్ మెయిలిస్టని కేటీఆర్ ఆరోపించారు. ఎవరు కావాలో పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలంటే బీఆర్‌ఎస్ ఆభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కిషోర్, అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు వార్తల రేవంత్‌ను జైల్లో పెట్టాలి: ‘ఎక్స్’లో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసత్య వార్తలను ప్రచారం చేయడం అలవాటుగా మార్చుకున్న సీఎం రేవంత్‌రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘మా బంధువుకు రూ.10 వేల కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్టు దక్కిందంటూ రేవంత్ గతంలో సిగ్గులేకుండా ఓ అబద్ధాన్ని తయారు చేశారు. ఇదే హాస్యగాడు సెక్రటేరియట్ కింద నుంచి నిజాం నగలను తవ్వుకెళ్లామనే అసత్య వాదనను సృష్టించారు. కేంద్ర హోంమంత్రి ఫేక్ వీడియోను కూడా సర్క్యులేట్ చేశారు. సీఎం హోదాలో ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్క్యులర్‌ను పోస్ట్ చేశారు. తప్పుడు వార్తల రేవంత్‌ను జైల్లో పెట్టాలి..’’అని కేటీఆర్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment