సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టాం గిదో లెక్కా..!: కేసీఆర్‌ | BRS Leader KCR Fires On Congress Party | Sakshi
Sakshi News home page

సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టాం గిదో లెక్కా..!: కేసీఆర్‌

Published Thu, Jul 4 2024 5:48 AM | Last Updated on Thu, Jul 4 2024 5:48 AM

BRS Leader KCR Fires On Congress Party

గెలుపోటములకు అతీతంగా బీఆర్‌ఎస్‌ వెంటే తెలంగాణ సమాజం  

ఓటమితో దిష్టి తీసినట్టయ్యింది 

ప్రజలే టార్చ్‌లైట్‌ పట్టుకొని బీఆర్‌ఎస్‌ కోసం వస్తారు 

ఎర్రవల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాజీ సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టి తెలంగాణను సాధించి, కలబడి నిలబడిన సమాజం భవిష్యత్‌లో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. గెలుపోటములకు అతీ తంగా తెలంగాణ సమాజం ఎల్లవేళలా బీఆర్‌ఎస్‌కు అండగా ఉందని, భవిష్యత్‌లోనూ ఉంటుందని ఆయన ప్రకటించారు. బుధవారం ఎర్రవెల్లిలోని నివాసానికి వచ్చిన మహబూబాబాద్, మేడ్చల్, నల్లగొండ జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఉద్యమ చరిత్ర.. తెలంగాణ కోసం సాగించిన పోరును మరోసారి గుర్తు చేసుకున్నారు. రెండున్నర దశాబ్దాల బీఆర్‌ఎస్‌ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని చెప్పారు. తెలంగాణ సాధన కోసం నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకొని నిలబడ్డ పారీ్టకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఏ ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణ మరింతగా పొందుకుంటూ బీఆర్‌ఎస్‌ ముందడుగు వేస్తుందన్నారు. 

తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడ్డ దిక్కుమొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన, అటునుంచి పదేళ్ల ప్రగతిపాలన దాకా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణను అష్ట దిగ్భందనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు, వారు రాసిందే రాత, గీసిందే గీతగా నడిచేదన్నారు. 

అత్యంత శక్తివంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకోవడంతోపాటు తెలంగాణ వ్యతిరేకతకు, సమైక్యవాదానికి సింబాలిక్‌గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబును ఎదురించి నిలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పారు. శత్రువులు, ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్‌ఎస్‌ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయ్యిందని, తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణ కూడగట్టాలని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ కేసీఆర్‌ ప్రకటించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలే తిరగబడతారు 
ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని కేసీఆర్‌ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేశామని నాలిక కరుసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో మున్నెన్నడూ లేనివిధంగా ప్రశాంతమైన పాలన ద్వారా పదేళ్లపాటు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తూ, అన్నితీర్లా అండగా నిలబడ్డ బీఆర్‌ఎస్‌ను తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటున్నదన్నారు. 

కేసీఆర్‌ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజాఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు. తన చేష్టలతో తానే ప్రజలచేత ఛీ కొట్టించుకోవడమే యాబై ఏళ్ల కాంగ్రెస్‌ వైఖరి అని..ప్రజలు అనతికాలంలోనే కాంగ్రెస్‌ పాలనపై విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నదని కేసీఆర్‌ వివరించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్‌లైట్‌ పట్టుకొని వెతుక్కుంటూ జనం బీఆర్‌ఎస్‌ కోసం వస్తారని కేసీఆర్‌ అన్నారు. అప్పడిదాక ఓపిక ప్రజాసమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

ఈ సమావేశంలో మాజీమంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతారెడ్డి, నలమోతు భాస్కర్‌ రావు, రమావత్‌ రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్, బూడిద బిక్షమయ్యగౌడ్, తిప్పన విజయసింహారెడ్డి, నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, ఒంటెద్దు నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement