సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయిన కూనంనేని సాంబశివరావు, కోదండరాం, పీఎల్.విశ్వేశ్వరరావు, జూలకంటి, వేం నరేందర్‌రెడ్డి, మల్లు రవి, మహేశ్‌కుమార్‌గౌడ్, బొంతు రామ్మోహన్ తదితరులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్, లెఫ్ట్, టీజేఎస్ ఐక్యతారాగం
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం సీఎం నివాసంలో గంటకుపైగా భేటీ
ఉమ్మడిగా పనిచేసి మల్లన్నను గెలిపిద్దామని కోరిన రేవంత్.. మీడియాకు నేతల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్, వామపక్షాలు, తెలంగాణ జనసమితి ఐక్యతారాగం ఆలపించాయి. నాలుగు పార్టీల కేడర్‌కు సమష్టి సందేశం ఇస్తూ ఉమ్మడిగా సమావేశమయ్యాయి. ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్‌రెడ్డి నివాసంలో శనివారం ఆయా పార్టీల నేతలంతా భేటీ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక సందర్భంగా నిర్వహించిన ప్రచారం, పోలింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ ఎం. కోదండరాం, ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వరరావు (టీజేఎస్), కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి, బాగం హేమంతరావు (సీపీఐ), ఎస్. వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, జి.నాగయ్య (సీపీఎం), మహేశ్‌కుమార్‌గౌడ్, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, బొంతు రామ్మోహన్ (కాంగ్రెస్) పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తమ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు అవసరమని, ఆయన గెలుపునకు సహకరించేలా మిత్రపక్ష పార్టీలు కేడర్‌ను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ ఈ భేటీలో సూచించారు. కలసికట్టుగా పనిచేసి తీన్మార్ మల్లన్నను గెలిపిద్దామని కోరారు. అనంతరం పలు అంశాలపై దాదాపు గంటపాటు నేతలంతా చర్చించారు.
భారీ మెజారిటీతో మల్లన్న గెలుస్తారు: మహేశ్‌కుమార్‌గౌడ్
ఈ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం రేవంత్ సమీక్షించారని చెప్పారు. సీపీఐ, సీపీఎం, జనసమితి పూర్తిగా మద్దతిస్తున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం బతకాలంటే మల్లన్న గెలవాలి: కూనంనేని
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం కోసం సీపీఐ శ్రేణులన్నీ కృషి చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే మల్లన్న గెలుపు అనివార్యమన్నారు. రాజకీయ పొత్తులో భాగంగా తాము మల్లన్నకు, కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.
మార్పు కోసం గెలిపించండి: ప్రొఫెసర్ కోదండరాం
టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలోనూ టీజేఎస్ మద్దతు కాంగ్రెస్‌కేనని చెప్పారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు, మార్పు కోసం కాంగ్రెస్ అభ్యరి్థని గెలిపించాలని టీజేఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మల్లన్నకు ఓటేయండి: సీపీఎం నేత వీరయ్య
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో విద్యాధికులు ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకొని ఓటేయాలని సీపీఎం నేత ఎస్. వీరయ్య కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తీన్మార్ మల్లన్నను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
దశాబ్ది ఉత్సవాలపై చర్చ.... విడివిడిగా భేటీ
సమావేశంలో భాగంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపైనా నాలుగు పార్టీల నేతలు చర్చించినట్లు తెలిసింది. దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని రావాలని కోరుతున్నామని, తెలంగాణ ఉద్యమకారులతోపాటు అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున సన్మానించాలని భావిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం. ఈ చర్చ సందర్భంగా సీపీఐ, టీజేఎస్ నేతలు దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై రేవంత్‌కు పలు సూచనలు చేశారు.
అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ప్రస్తావనకు రాగా మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఏం చేయాలనే విషయమై అధ్యయనం చేస్తున్నామని, ఎన్నికలు పూర్తయ్యాక అన్ని పార్టీలతో కలిపి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పినట్లు తెలియవచ్చింది. సంయుక్త సమావేశం అనంతరం సీఎం రేవంత్‌తో టీజేఎస్, సీపీఐ, సీపీఎం నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, గుడిసెలు వేసుకున్న పేదలకు ఆయా స్థలాల్లో పట్టాలు ఇవ్వాలని సీపీఎం నేతలు వినతిపత్రం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment