ప్రజల ఆశల మీద నీళ్లు చల్లిన బడ్జెట్
మేం రెండు పంటలకు రైతుబంధు ఇస్తే.. కాంగ్రెస్ ఎగ్గొడతామని చెబుతోంది
గొర్రెల పథకాన్ని మూసేశారు.. దళితబంధు ప్రస్తావనే లేదు
రాష్ట్ర బడ్జెట్‌పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. బడ్జెట్‌లో ఏ ఒక్క వర్గానికి కూడా స్పష్టమైన హామీ లేదని, రైతులను పొగుడుతున్నట్టుగా పొగుడుతూనే ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టు కాకుండా రైతుబంధు, రైతుభరోసా వంటి పథకాల్లో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా చెప్పి రైతులను మోసం చేశారని, ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం పూర్తయిన అనంతరం గురువారం మధ్యాహ్నం మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన నైజాన్ని బయటపెట్టుకున్నది. గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఒక్క పథకంపై స్పష్టత లేదు.
గొర్రెల పథకం లేదు..దళితబంధు లేదు
యాదవులకు ఇస్తున్న గొర్రెల పెంపకం పథకాన్ని మొత్తానికి మూసేసినట్టు అర్థమవుతుంది. ఇప్పటికే యాదవులు చెల్లించిన డిపాజిట్లు కూడా వాసప్ ఇస్తుంది ఈ ప్రభుత్వం. కొత్త విషయం ఏమీలేదు. అత్యంత బడుగువర్గాలకు మేలు చేస్తున్నట్టుగా చెబుతూనే గొంతు కోసింది. దళితవర్గాల కోసం గతంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన దళితబంధు పథకం ప్రస్తావనే లేదు. ఇదీ చాలా దురదృష్టకరం. దళిత సమాజంపై ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి, ఫ్యూడల్ విధానానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం అవసరం లేదు.
మత్స్యకారులకు భరోసా లేదు. ఏ ఒక్కవర్గానికి కూడా ఈ బడ్జెట్‌లో భరోసా లేదు. బడ్జెట్‌లో విశేషమేమిటంటే ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క డబ్బుల గురించి చెప్పినప్పుడు ప్రతిమాటను ఒత్తిఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీలేదు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం కూడా లేని పరిస్థితి వచ్చింది. మహిళల పట్ల కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ దీనిని కూడా లక్ష కోట్ల రుణాలు అంటూ వీళ్లేదో ఇస్తున్నట్టు చెప్పారు.
ఉన్న స్కీంను చెప్పారే తప్ప..కొత్తగా ఏమీలేదు. వెరసి ఇది పాతదే. దురదృష్టం ఏమిటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఆరుమాసాల సమయం ఇవ్వాలని అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ, ఈ రోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీకి ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటికీ పాలసీ పార్ములేషన్ చేసేటట్టుగా కనిపిస్తలేదు.
ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం
వ్యవసాయం విషయంలో మాకు స్పష్టమైన అవగాహన ఉండే. ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని, మేం రెండు పంటలకు రైతుబంధు ఇచ్చాం. వీళ్లెమో ఎగ్గొడుతామని చెబుతున్నారు. రైతులకు ఇచ్చిన డబ్బును పాడు చేసినం..చెడగొట్టినం.. దుర్వినియోగం చేసినం అనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం అని తెలుస్తుంది.
ధాన్యం కొనుగోలు చేయలేదు. విద్యుత్ సరఫరా చేయడం లేదు. నీళ్లు సరఫరా చేయడం లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతుబంధు, రైతుభరోసా ప్రస్తావనే లేదు. రైతుభరోసా ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అరిస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు. కాబట్టి రైతులను ఈ ప్రభుత్వం వంచించింది. వృత్తి కార్మికులను వంచించింది’అని కేసీఆర్ అన్నారు.
భవిష్యత్‌లో బ్రహ్మాండంగా చీల్చి చెండాడబోతాం
‘ఇండస్ట్రీయల్ పాలసీ ఏమిటి? ఏం లేదు వట్టిదే గ్యాస్..ట్రాష్. ఇదేదో స్టోరీ టెల్లింగ్‌లాగా ఉంది తప్ప ఏం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి? పారిశ్రామిక పాలసీ ఏమిటి ? ఐటీ పాలసీ ఏమిటి? ఇంకా ఇతర అనేక పాలసీలు.. పేదవర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి? అనే ఏ ఒక్కదానిపై కూడా స్పష్టత లేదు.
చిల్లరమల్లర ప్లాట్‌ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగంలా లేదు. రాజకీయ సభల్లో చెప్పినట్టుగా ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా.. నిర్దిష్టంగా ఈ పనిని మేం ఇలా సాధిస్తాం.. మా గోల్స్, టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ, పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు.. రైతుల బడ్జెట్ కాదు.. ఎవరి బడ్జెటో రేపు మీకు విశ్లేషణలో తెలుస్తది. భవిష్యత్‌లో బ్రహ్మాండంగా చీల్చి చెండాడబోతాం’అని కేసీఆర్ తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment