2023 అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు
బీఆర్‌ఎస్ గెలిచిన 39 స్థానాల్లో 36 చోట్ల ఆ పార్టీ ఓట్లను పంచుకున్న బీజేపీ, కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన కొన్నిచోట్ల, బీఆర్‌ఎస్ గెలిచిన చాలా స్థానాల్లో బీజేపీ పైచేయి
కాంగ్రెస్ గెలిచిన ‘లోక్‌సభ’ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకే ఆధిక్యత
బీజేపీ గెలిచిన స్థానాల్లో మాత్రం చాలాచోట్ల రెండో స్థానం
అసెంబ్లీలో గెలిచిన చాలాచోట్ల మూడోస్థానానికి పరిమితమైన బీఆర్‌ఎస్
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన కొన్ని స్థానాల్లో, బీఆర్‌ఎస్ గెలిచిన చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు బీజేపీ పైచేయి సాధించింది. రాష్ట్రంలోని 17 పార్ల మెంటు స్థానాలకు గాను హైదరాబాద్‌లో ఎంఐఎం విజయం సాధించగా, మిగతా 16 సీట్లను బీజేపీ, కాంగ్రెస్ సమానంగా పంచుకున్న విషయం తెలిసిందే.
అయితే కాంగ్రెస్ గెలి చిన 8 పార్లమెంటు స్థానాల్లోని 56 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కొన్నిచోట్ల మినహా కాంగ్రెస్సే ఆధిక్యతను కనబరిచింది. కాగా బీజేపీ గెలిచిన 8 లోక్‌సభ నియోజకవర్గాల్లోని 56 సెగ్మెంట్లలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. మూడు చోట్ల బీఆర్‌ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. అయి తే చివరికి స్వల్ప తేడాతోనైనా బీజేపీనే విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిచిన 39స్థానాల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక మినహా మిగతా 36 సెగ్మెంట్లలో ఆపార్టీ ఓట్లను కాంగ్రెస్, బీజేపీ పంచుకొన్నాయి. దీంతో బీఆర్‌ఎస్ 2,3 స్థానాలకే పరిమితమైంది.
బీఆర్‌ఎస్‌కు 2 స్థానాల్లోనే రెండో స్థానం
లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కచోట కూడా గెలవలేకపోయిన బీఆర్‌ఎస్ కేవలం మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ తరువాత రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఎంపీ స్థానంలో నాలుగో స్థానానికి పరిమితమైన బీఆర్‌ఎస్ మిగతా 14 చోట్ల మూడో స్థానం దక్కించుకుంది. మెదక్ పార్లమెంటు పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ కన్నా అధిక ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో గజ్వేల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కాగా, సిద్దిపేట స్థానం మాజీ మంత్రి హరీశ్‌రావు కంచుకోట. అయితే బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన రఘునందన్ రావు సొంత నియోజకవర్గం అయిన దుబ్బాకలో కూడా బీఆర్‌ఎస్‌కే మెజారిటీ రావడం గమనార్హం.
బీజేపీ వైపు బీఆర్‌ఎస్ ఓటర్ల మొగ్గు
బీజేపీ గెలిచిన 8 ఎంపీ సీట్లలో చాలాచోట్ల కాంగ్రెస్ రెండోస్థానంలో నిలవగా, బీఆర్‌ఎస్ మూడోస్థానానికి పరిమితమైంది. 2023లో బీఆర్‌ఎస్ గెలిచిన స్థానాల్లో కూడా ఈసారి బీజేపీకి మెజారిటీ వచ్చింది. అంటే జాతీయ స్థాయి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్‌ఎస్ ఓటర్లు కూడా ఈసారి బీజేపీ వైపే మొగ్గు చూపారన్న మాట. కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గంలో సైతం బీఆర్‌ఎస్ రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ బీజేపీకి మెజారిటీ ఓట్లు రావడం గమనార్హం. కరీంనగర్ లోక్‌సభ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కరీంనగర్, హుజూరాబాద్ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్ మూడోస్థానంలో నిలిచింది.
కరీంనగర్ పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్ సెగ్మెంట్‌లో మాత్రం కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు, మూడుస్థానాలు దక్కించుకున్నాయి. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో బీజేపీ విజయం సాధించగా, ఇక్కడ బీఆర్‌ఎస్ విజయం సాధించిన బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో సైతం మూడో స్థానానికే పరిమితమైంది. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించగా, 2023 నవంబర్‌లో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌ఎస్ గెలిచిన 18 సీట్లలోనూ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమవడం గమనార్హం.
కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో బీజేపీకే రెండో స్థానం
కాంగ్రెస్ గెలిచిన 8 ఎంపీ స్థానాల పరిధిలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు బీఆర్‌ఎస్ రెండో స్థానంలో నిలిచింది. కానీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సీన్ మారింది. బీజేపీ బలం ఏమ్రాతం లేని ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలలో మాత్రమే బీఆర్‌ఎస్ రెండోస్థానంలో నిలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యరి్థగా ఉంది. దాదాపు 50 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉండి భారీగా ఓట్లు సాధించడం గమనార్హం.
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ధర్మపురిలో మాత్రమే కాంగ్రెస్ కన్నా బీజేపీ స్వల్ప ఆధిక్యత సాధించగా, మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది. జహీరాబాద్ ఎంపీ పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, కాంగ్రెస్‌కు రెండో స్థానం దక్కింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యత సాధించగా, గద్వాలలో మాత్రం కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలవడం గమనార్హం. ఇక వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, పార్లమెంటు స్థానాల్లో దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మొదటి స్థానంలోనే నిలవగా, రెండోస్థానంలో బీజేపీ, మూడోస్థానంలో బీఆర్‌ఎస్ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment