మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ కొంచెం వెనకంజ వేసినా.. పండగలు, వ్రతాలు, పెళ్లిళ్లు అంటూ ఇప్పుడిప్పుడే సందడి మొదలయ్యింది. వేడుకల వేళ వైవిధ్యంగా వెలిగిపోవాలంటే లంగా ఓణీ జోడీ కట్టాల్సిందే. ఆధునికపు హంగులు కోరుకునే నవతరమైనా సంప్రదాయ కట్టుతో మెరిసిపోవాల్సిందే!
వేడుకల్లో మనదైన మార్క్ కనిపించాలంటే కొంచెం వినూత్నంగా ఆలోచించవచ్చు. ప్లెయిన్ లెహంగా మీద లైట్‌వెయిట్ పట్టు శారీని ఓణీలా కట్టుకోవచ్చు. ముదురు ఎరుపు, పసుపు, పచ్చ, నీలం వంటి రంగుల ఎంపిక, టెంపుల్ జ్యువెలరీతో చక్కని సంప్రదాయ కళ తీసుకురావచ్చు.
కంచిబార్డర్‌ను హాఫ్‌వైట్ గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ జత చేసిన లెహంగా, అంచులు ఎంబ్రాయిడరీ చేసిన ఓణీ, మగ్గం వర్క్ బ్లౌజ్.. ఈ పర్పుల్ కాంబినేషన్ వేడుకకు వన్నెతెస్తుంది.
కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్‌కి కంచిబార్డర్ జత చేసి, అదే రంగు మగ్గం వర్క్ బ్లౌజ్, కాంట్రాస్ట్ దుపట్టా వేయడంతో మంచి కళ వచ్చేసింది. వేడుకలకు ఈ కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ప్లెయిన్ హాఫ్‌వైట్ రాసిల్క్ మెటీరియల్‌పైన ఎంబ్రాయిడరీ వర్క్ చేసి డిజైన్ చేసిన లెహంగా. మగ్గం వర్క్ చేసిన రెడ్ కలర్ ట్యునిక్, నెటెడ్ దుపట్టాతో సంప్రదాయ కట్టుతోనే ఆధునికపు హంగులు తీసుకురావచ్చు.
సంప్రదాయ డ్రెస్సులోనే ఆధునికంగా కనిపించాలనుకుంటే ఫిష్‌కట్ లెహంగాలు సెట్‌అవుతాయి. ఫ్లోరల్ ప్రింట్ ఉన్న రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన లెహంగా, జర్దోసీ వర్క్ చేసిన షార్ట్ స్లీవ్స్ బ్లౌజ్, నెటెడ్ ఓణీ ముచ్చటైన కాంబినేషన్‌గా ఆకట్టుకుంటుంది.
- రజితారాజ్ రావుల
డిజైనర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment