చేనేత పరవళ్లు | kalamkari clothes in machilipatnam | Sakshi
Sakshi News home page

చేనేత పరవళ్లు

Published Sun, Aug 7 2016 12:55 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

చేనేత పరవళ్లు

చేనేత పరవళ్లు

కుటీర పరిశ్రమలో అగ్రస్థానంలో ఉండేది చేనేత పరిశ్రమలే... నూలు నుంచి రాట్నం మీదుగా మగ్గం ద్వారా అద్భుతమైన డిజైన్లను.. నాణ్యమైన వస్త్రాలను అందించటంలో చేనేత కార్మికులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అగ్గిపెట్టెలో పట్టేంత ఆరడుగుల చీరను నేయగలిగిన సిద్ధహస్తులు తెలుగురాష్ట్రాల్లోని చేనేత కార్మికులు.

కృష్ణానదీ తీరాన ఉన్న చేనేత పరిశ్రమలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పూర్వ వైభవాన్ని ఇప్పుడిప్పుడే అందుకుంటున్నాయి. తెలుగురాష్ట్రాల్లో చేనేత వస్త్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. కృష్ణానదీతీరాన ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి, కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న పెడన కలంకారీ కళ, తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని పోచంపల్లి, మహబూబ్‌నగర్‌లోని గద్వాల్, నారాయణపేట వంటి ప్రాంతాలు చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు.  
 
మంగళగిరి చేనేత
గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత వస్త్ర పరిశ్రమకు పేరెన్నికగన్నది. ఇక్కడ ప్రత్యేక  పద్ధ్దతులతో పత్తి నుంచి వస్త్రాలను చేయటం తరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. పత్తిలోని గింజలను తొలగించి వాటిలోని మలినాలను చేప దంతాల ద్వారా శుభ్రం చేసి ఏకుతారు. అలా ఏకిన పత్తిని స్థూపాకారంగా చుట్టి రాట్నం ఉపయోగించి పత్తి నుంచి దారం తీస్తారు.

దారాల్లో గంజిని ఉపయోగించి గట్టిదనం వచ్చేంత వరకు సరిచేసి, మగ్గంతో వస్త్రాలను నేయటంలో ఇక్కడి వారు సిద్ధ్దహస్తులు. 1980 కాలంలో మంగళగిరి చేనేతకు స్వర్ణయుగం అని చెప్పాలి. అప్పటి నుంచి 2000వ సంవత్సరం వరకు మంగళగిరి చేనేతకు ఢోకా లేకుండా పోయింది. అనంతర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అప్పట్లో ఇతర ప్రాంతాల నుంచి శుభకార్యాల కోసం ఇక్కడికి వచ్చి మరీ దుస్తులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ కామర్స్, ప్రత్యేక వెబ్‌సైట్, సోషల్ మీడియా ద్వారా ఇక్కడి వ్యాపారులు ఆన్‌లైన్‌లో వస్త్రాలను విక్రయిస్తున్నారు.
 
 ఇండియా హ్యాండ్‌లూమ్ బ్రాండ్ ‘పోచంపల్లి ’
 తెలంగాణలో చేనేతలకు పురిటిగడ్డగా పోచంపల్లికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణలోని నల్లగొండలో భూదాన్‌పోచంపల్లిగా పేరొందిన పోచంపల్లి చేనేతకు అంతర్జాతీయ డిమాండ్ ఉంది. 1965కి ముందు ఈ గ్రామంలో గాజులు, పూసలను తయారు చేసి అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారు.. కాలక్రమేణా ఈ వృత్తి అంతరించటంతో ఇక్కడ ఉన్న పద్మశాలీలు కొందరు రుమాళ్లను, కాటన్ చీరలను నేయడం ప్రారంభించారు. 1974లో పోచంపల్లికి చెందిన కొంతమంది నేతకారులు తమిళనాడులోని తంజావూరులో పట్టు వస్త్రాల నేతలో శిక్షణ పొందారు. తర్వాతి కాలంలో పోచంపల్లి నేతలు పటోలా డిజైన్ చీరల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందాయి. పోచంపల్లి వస్త్రాల నేతల్లో 11 డిజైన్లు పేటెంట్ హక్కులు కలిగి ఉన్నాయి.
 
గద్వాల చీరలు
ఈ చీరలు కాస్తంత బరువుగా ఉంటాయి. ఇవి కాటన్, సిల్క్ కాంబినేషన్‌తో తయారవు తాయి. బంగారం, వెండి పూతలతో చీర అంచులను అందంగా నేయడం ఇక్కడి నేతగాళ్లకు కొట్టిన పిండి. ఈ చీరలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు, తిరుపతి వెంకన్న స్వామికి ఇక్కడి నుంచి ప్రతి ఏడాదీ పట్టు వస్త్రాలు వెళ్తుంటాయి.

నారాయణపేట పట్టుచీరలు చీరంతా ఒకే రంగులో ఉండి, అంచు మాత్రం బంగారు రంగులో ఉంటుంది. దాన్ని బట్టి చీరను చూడగానే, అది నారాయణపేట చీరే అని గుర్తుపట్టొచ్చు. అలాగే ఈ చీరలకు అడ్డం, నిలువులో చిన్న నుంచి పెద్ద సైజు గీతలు ఉంటాయి. ఈ చీరలకు పూర్తి నేచురల్ కలర్స్‌నే వాడతారు. మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం ఈ చీరలను కట్టినవారే. ఇక్కడి నేతగాళ్లు నేసిన కాటన్ చీరలు కూడా బాగా ప్రసిద్ధి పొందాయి.
 
పెడన కలంకారి
కలంకారి వన్నె తగ్గని సంస్కృతిగా, దేశంలోని మచిలీపట్నం కలంకారిగా పేరు.. 15వ శతాబ్దంలో మొదలైన రంగుల అద్దకం ఆంగ్లేయుల పాలన కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఇప్పటికీ లండన్ విక్టోరియా మ్యూజియంలో అలనాటి కలంకారీ వస్త్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నా యంటే ఈ అద్దకం విధానం గొప్పతనంతో పాటు వినియోగిస్తున్న సహజ రంగులే అందుకు కారణం. బ్రిటిష్ కాలంలో మచిలీపట్నంలోనే కలంకారి పరిశ్రమలు ఉండేవి.

తరువాత కాలంలో బ్రిటిష్‌వారి విధానాలతో మూతపడ్డాయి. స్వాతంత్య్రం అనంతరం కమలాభాయ్ చటోపాధ్యాయ్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కలంకారీకి పునరుత్తేజం వచ్చింది. అయితే అప్పటికే ఈ పరిశ్రమ మచిలీపట్నం నుంచి పెడనకు వెళ్లిపోయింది. అయినప్పటికీ మచిలీపట్నం కలంకారీగానే పేటెంట్ పొందటంలో విదేశాల్లో పేరు పొందింది. యూరప్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా ఖండాల్లోనూ ఈ దుస్తులకు మంచి డిమాండ్ ఉంది.
 
 కలంకారీ విధానం
 మచిలీపట్నం కలంకారీ కళలో అచ్చు వేయాల్సిన అద్దకం మూసలను పెద్ద చెక్కముక్కలతో తయారు చేస్తారు. దీనికి కూరగాయలతో తయారు చేసిన సహజ రంగులను చీరలు, ఇతర దుస్తులపై అద్దకం రంగులు వేస్తారు. ఈ చిత్రాల్లో పురాణగాథల నుంచి నేటి ట్రెండీ థీమ్స్ వరకు వివిధ ఆకృతులను చిత్రిస్తారు. ఒక డిజైన్ చేయటానికి చాలా రోజులు పడుతుంది. అద్దకం మరియు చేతితో అచ్చు వేయడం అనే ప్రక్రియ చాలా విసృ్తతమైనది.

పూర్తిగా ఒక వస్త్రంపై కలంకారీ చేయటానికి అనేక దశలు ఉన్నాయి. అనేక రకాలుగా ప్రింటింగ్ స్టైల్స్ కన్నా కలంకారీ వస్త్రానికి మంచి డిమాండ్ ఉంది. వస్త్రం యొక్క నాణ్యతను బట్టి దానిపై వేయవలసిన రంగులు కూడా వివిధ రకాలుగా మారుస్తారు. ప్రతి దశలోనూ దానికి పట్టి ఉంచే రంగులను శుభ్రం చేసి దానిపై పట్టేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కలంకారీలో ముఖ్యంగా నాలుగు రంగులు వినియోగిస్తారు. ఎరుపు రంగును భారతీయ మేదర చెట్టు నుంచి తీస్తారు. అలాగే పసుపు రంగును దానిమ్మ గింజల నుంచి లేదా మామిడి చెట్టు బెరడు నుంచి తీస్తారు. నీలం రంగును ఇండిగో (నీలిమందు చెట్టు) నుంచి, నలుపు రంగును మైరో బాలన్ పండు నుంచి తీస్తారు.
 
 నాణ్యత పెంపు
కలంకారీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు సహజ సిద్ధ్దమైన రంగులతో లినెన్ వస్త్రంపై చెక్క అచ్చులు (బ్లాక్స్) అద్దకంతో డిజైన్లు ముద్రించేవారు. కోల్‌కత్తాకు చెందిన ఆదిత్య బిర్లా నువో లిమిటెడ్ గ్రూపులోని జయశ్రీ టెక్స్‌టైల్స్ (జేఎస్టీ) కలంకారీ వస్త్రాలను మరింత నాణ్యతతో వేగంగా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
 
జియోగ్రాఫికల్ ఇండిగేషన్ రిజిస్ట్రీ (జీఐఆర్)
 పెడన గ్రామంలోని వె జిటబుల్ డై హ్యాండ్ బ్లాంక్ కలంకారీ ప్రింటర్స్ వెల్ఫేర్ అసొసియేషన్ సభ్యులు చెన్నై నుంచి కలంకారీ పరిశ్రమకు ‘జియాగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ’(జీఐఆర్)ను పొందారు. దీని ఫలితంగా మచిలీపట్నం కలంకారీగా గుర్తింపు పొందింది. పెడన గ్రామం మచిలీపట్నానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెడన పట్టణం, దాని అనుబంధ గ్రామాలైన పోలవరం, కప్పలదొడ్డిలో మాత్రమే కలంకారీ అద్దకాలు రూపొందుతాయి.
 - రత్నబాబు మోత్రపు
 సాక్షి, విజయవాడ
 
 వన్నె తగ్గని కళ
 ఎన్ని రకాల యంత్రాలు, పరికరాలు వచ్చిన చేనేత రంగంలో మాత్రం కలంకారిదే అధిక ప్రాధాన్యత. మా నాన్నగారి నుంచి మాక వారసత్వంగా వచ్చింది. 1950 నుంచి మా కుటుంబం కలంకారిపైనే జీవనాధారంగా ఉంది. ఇప్పటి వరకు పలు కార్పోరేట్ సంస్థలకు దుస్తులను, దుప్పట్లను, కర్టెన్లను పంపిణీ చేస్తున్నాం. హస్తకళ ఉన్నంతకాలం కలంకారి ఉంటుంది.
 - నాగేంద్ర, కలంకారి కళాకారుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement