సాక్షి, కామారెడ్డి: చిరుత పులి దాడిలో ఓ యువకుడు గాయపడిన ఘట న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట్ గ్రామంలో చోటుచేసు కుంది. గ్రామంలోని నాయికోటి మల్లేశ్‌కు చెందిన గొర్రెల మందపై మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో చిరుత పులి దాడి చేసింది. గొర్రెల అరుపులకు నిద్రలేచిన మల్లేశ్ చిరుతను అదరగొట్టి అక్కడి నుంచి తరిమేశాడు. అప్పటికే మందలోని ఒక గొర్రెను చిరుత హతమార్చింది. అనంతరం మల్లేశ్ బహిర్భూమికి వెళ్లిరాగా మళ్లీ గొర్రెల మందపై చిరుత దాడి చేస్తూ కనిపించింది. దీంతో చిరుతను తరిమేసేందుకు ప్రయత్నించిన మల్లేశ్‌పైకి వేగంగా దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన మల్లేశ్ పక్కనే ఉన్న సైకిల్ పాత టైరును తన మెడకు అడ్డుగా పెట్టుకుని చాకచక్యంగా తప్పించుకున్నాడు.
దీంతో అతడి చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే మల్లేశ్ అరుపులు వినిపించడంతో అతని తండ్రి భూమయ్య, భార్య సావిత్రి బయటకు వచ్చి లైట్లు వేసి గట్టిగా అరిచారు. దీంతో భయపడిన చిరుత అక్కడి నుంచి పారిపోయింది. మల్లేశ్‌ను 108లో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరుత పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలను తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిరుత దాడిలో గాయపడిన మల్లేశ్‌కు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని ఫారెస్ట్ డివిజనల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment