leapord
-
ఘోరం.. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి
ముంబై : పూణే జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతిని జిల్లా అటవీ శాఖ అధికారులు అధికారంగా ధ్రువీకరించారుపూణేలోని షిరూర్ తాలూకా పింపల్సుతి గ్రామానికి చెందిన రక్ష నిఖమ్ (4) ఇంట్లో ఆడుకుంటుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత చిన్నారిని నోట కరుచుకుని స్థానిక చెరుకు తోటల్లోకి తీసుకెళ్లింది. చిరుత పులి రాకను గమనించిన తల్లి కాపాడండి అంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రక్ష కోసం గాలింపు చర్యలు చేపట్టారు.రెండు గంటల పాటు గాలింపు చర్యల అనంతరం చెరుకు తోటలో చిన్నారి జాడ దొరికింది. చిన్నారిపై చిరుత తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడితో బాలిక తల,మొండెం వేర్వేరుగా కనిపించాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జున్నార్ ఫారెస్ట్ డివిజన్ అధికారి మితా రాజ్‌హన్స్ మాట్లాడుతూ బాలికపై దాడి చేసిన చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. -
ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..
-
తిరుమలలో చిరుత సంచారం
తిరుమల: తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద చిరుత సంచరించిన ఘటన శనివారం వెలుగుచూసింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అతిథిగృహం సమీపంలోకి ఓ వరాహం వచ్చింది. అదే సమయంలో వరాహాన్ని వెంబడిస్తూ చిరుత చేరుకుంది. కొంతసేపు వరాహం కోసం వేచి ఉన్న చిరుత అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అతిథి గృహంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పటివరకు కుక్కల కోసం తిరుమలలోని నివాసప్రాంతాలు, అతిథిగృహాల వద్దకు వస్తున్న చిరుతలు ప్రస్తుతం వరాహాల కోసం రావడం గమనార్హం. -
బైక్‌ను వెంబడించిన చిరుత; కేక్‌తో ప్రాణాలు కాపాడుకున్నారు
భోపాల్: తమను వెంబడిస్తున్న చిరుతపులిపై బర్త్‌డే కేక్‌ను విసిరి ఇద్దరు సోదరులు వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఫిరోజ్, సబీర్ మన్సూరీ ఇద్దరు అన్నదమ్ములు. కాగా గురువారం ఫిరోజ్ తన కుమారుడు పుట్టినరోజు కావడంతో కేక్ కొనుగోలు చేసేందుకు అతని సోదరుడు సబీర్ మన్సూరితో కలిసి బైక్‌పై జిల్లా కేంద్రానికి వెళ్లాడు. కేక్ కొనుగోలు చేసి తిరిగి గ్రామానికి వస్తుండగా దారి మధ్యలో ఉన్న చెరుకుతోట వద్ద ఒక చిరుతపులి వీరి బైక్‌ను వెంబడించింది. భయంతో వారిద్దరు తమ బైక్‌ను వేగంగా పోనిచ్చినప్పటికి చిరుత పులి వేగంగా వారిని సమీపించింది. బైక్‌పై వెనుకాల కూర్చున్న సబీర్ ఏం చేయాలో తెలియక తన చేతొలో ఉన్న కేక్‌బాక్స్‌ను చిరుత మీదకు విసిరాడు. అయితే అది ఏదైనా మారణాయుధం అని భావించిన చిరుత పులి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. అప్పటివరకు ప్రాణభయంతో పరుగులు పెట్టిన వారిద్దరు బతుకుజీవుడా అంటూ గ్రామానికి చేరుకున్నారు. ఊర్లోకి వెళ్లిన తర్వాత గ్రామస్థులకు విషయం చెప్పడంతో స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఫిరోజ్ అందించిన సమాచారం మేరకు చిరుత పులి వారి బైక్‌ను దాదాపు 500 మీటర్ల దూరం వెంబడించిందని అధికారులు తెలిపారు. తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం తమ చేతిలో ఉన్న కేక్‌బాక్స్‌ను విసిరేసి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. -
చిరుతను చూసినా బెదరలేదు.. గాయాలైనా పోరాటం..
సాక్షి, కామారెడ్డి: చిరుత పులి దాడిలో ఓ యువకుడు గాయపడిన ఘట న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో చోటుచేసు కుంది. గ్రామంలోని నాయికోటి మల్లేశ్‌కు చెందిన గొర్రెల మందపై మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో చిరుత పులి దాడి చేసింది. గొర్రెల అరుపులకు నిద్రలేచిన మల్లేశ్ చిరుతను అదరగొట్టి అక్కడి నుంచి తరిమేశాడు. అప్పటికే మందలోని ఒక గొర్రెను చిరుత హతమార్చింది. అనంతరం మల్లేశ్ బహిర్భూమికి వెళ్లిరాగా మళ్లీ గొర్రెల మందపై చిరుత దాడి చేస్తూ కనిపించింది. దీంతో చిరుతను తరిమేసేందుకు ప్రయత్నించిన మల్లేశ్‌పైకి వేగంగా దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన మల్లేశ్ పక్కనే ఉన్న సైకిల్ పాత టైరును తన మెడకు అడ్డుగా పెట్టుకుని చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీంతో అతడి చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే మల్లేశ్ అరుపులు వినిపించడంతో అతని తండ్రి భూమయ్య, భార్య సావిత్రి బయటకు వచ్చి లైట్లు వేసి గట్టిగా అరిచారు. దీంతో భయపడిన చిరుత అక్కడి నుంచి పారిపోయింది. మల్లేశ్‌ను 108లో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరుత పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలను తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిరుత దాడిలో గాయపడిన మల్లేశ్‌కు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని ఫారెస్ట్ డివిజనల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
బాత్రూంలో నక్కిన కుక్క.. ఇంతలో చిరుత ఎంట్రీ
బెంగళూరు: కర్ణాటకలోని బిలినెళ్లి అనే గ్రామంలోని ఓ ఇంటి మరుగుదొడ్డిలో బుధవారం ఓ వీధి కుక్కతో పాటు చిరుత పులి దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి యజమానురాలు బాత్రూం వెళ్దామని డోర్ తీయగా చిరుత, దాన్ని చూస్తూ భయంతో వణికిపోతున్న వీధి కుక్క దర్శనమివ్వడంతో వెంటనే అప్రమత్తమైన ఆమె.. డోర్‌కు గొల్లెం పెట్టి, పోలీసులకు సమాచారం చేరవేసింది. ఇంతకీ ఈ రెండు జంతువులు మరుగుదొడ్డిలోకి ఎలా చేరాయని ఆరా తీస్తే.. గ్రామంలో సంచరిస్తున్న వీధి కుక్క, అనుకోని అతిధి చిరుత కంట పడింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో వీధి కుక్క.. సమీపంలోని ఓ ఇంటి మరుగుదొడ్డిలో దాక్కుంది. ఆ కుక్క హమ్మయ్యా అనుకునే లోపు చిరుత దాన్ని వెంబడిస్తూ అదే బాత్రూంలోకి చేరింది. చిరుతను దగ్గరగా చూసిన కుక్క భయంతో వణికిపోతుండగా, ఇప్పుడెలా తప్పించుకుంటావు అన్నట్టుగా చిరుత గంభీరంగా కుక్క వైపు చూస్తుంది. ఇంతలో ఇంటి యజమానురాలు బాత్రూం డోర్ తీసి, పోలీసులకు సమాచారమిచ్చింది. హుటాహుటిన రంగప్రవేశం చేసిన పోలీసులు.. పులి బారి నుండి కుక్కను రక్షించి, పులిని బంధించాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు బాత్రూం పైకప్పును తొలగించి రెస్క్యూ అపరేషన్ చేపడుతుండగా.. చిరుత అమాంతంపైకి ఎగిరి, గోడల మీదుగా దూకుతూ అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ మొత్తం సన్నివేశాలన్నీ బాత్రూం డోర్ మధ్య సందుల్లో నుంచి స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
అధికారులకు చిక్కిన చిరుత మృతి
సాక్షి, హైదరాబాద్/నల్గొండ : నల్గొండ జిల్లాలో అటవీ అధికారులకు చిక్కిన చిరుత మృతి చెందింది. ఈ విషయాన్ని నెహ్రూ జూపార్కు అధికారులు స్వయంగా తెలిపారు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా మర్రిగూడం మండలం రాజపేట తండా వద్ద అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో చిరుత చిక్కుకొంది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుతకు మత్తు ఇచ్చి జీప్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. చిరుత కంచెలో ఇరుక్కు పోవడంతో దానికి బాగా గాయాలయి రక్తం బాగా పోయిందని వైద్యాధికారులు తెలిపారు. దీంతో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో వేడిమికి తట్టుకోలేక చిరుత మృతి చెందినట్లుగా నిర్థారించారు. -
అధికారులకు చుక్కలు చూపించిన చిరుత
సూరత్ : లాక్డౌన్ నేపథ్యంలో అడవిలో ఉండాల్సిన జంతువులు ఆహార అన్వేషణలో జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని దాహోడ్ ప్రాంతంలో శనివారం ఒక చిరుతపులి హల్చల్ చేసింది. మొదట ఒక ఇంట్లోకి దూరిన చిరుత కారు పక్కన నక్కి కూర్చుంది. కొద్దిసేపటికి ఇంటి యజమాని కారును తీద్దామని దగ్గరకు వచ్చి చూస్తే చిరుతపులి ఉన్నట్లు గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో వెంటనే యానిమల్ రెస్య్కూ ఆపరేషన్ టీమ్‌కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఆపరేషన్ రెస్క్యూ టీమ్ అక్కడిని చేరుకొని చిరుతను బంధించడానికి నానా ప్రయత్నాలు చేశారు. అయితే చిరుత అధికారులకు చిక్కకుండా ఇళ్లలోని గోడలు దూకుతూ స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అయితే పులిని పట్టుకునేందుకు పన్నిన వలను కూడా చేధించి అక్కడి నుంచి పరుగులు తీసింది. చివరకు ఎలాగోలా పోలీసుల సాయంతో చిరుతకు మత్తు మందు ఇచ్చిన అధికారులు దానిని బంధించి అక్కడినుంచి తీసుకెళ్లారు. చిరుతను పట్టుకునే క్రమంలో ఐదుగురు అధికారులకు తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆవు చనిపోయిందని రోడ్ల పైకి జనం క్వారంటైన్లో కోడికూర ఇవ్వలేదని.. -
రెండు బోన్లు, మేకలు, 23 కెమెరాలు, డ్రోన్
సాక్షి, హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లి-కాటేదాన్ ప్రధాన రహదారి పక్కన గురువారం గాయాలతో కనిపించిన చిరుత పులిని పట్టుకోవటంలో అటవీ అధికారులు రెండో రోజు కూడా విఫలమయ్యారు. చిరుతను పట్టుకోకుండానే నేటి ఆపరేషన్‌ను ముగించారు. రెండు బోన్లు, మేకలు ఎరగా వేసి, 23 కెమెరాలు, డ్రోన్‌తో వెతికినా చిరుత ఆచూకీ దొరకలేదు. ఆ మృగం రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ మీదుగా గండిపేట వైపు వెళ్లి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఇంటి బయట పడుకోరాదని పోలీసులు సూచించారు. చిరుత సమాచారం తెలిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని కోరారు. (లారీ డ్రైవర్ అత్యుత్సాహం; చిరుత దాడి) నిన్న జూపార్కుకు 3 కిలోమీటర్ల దూరంలో చిరుత గంట సేపు రోడ్డుపైనే ఉండగా.. అటవీ అధికారులకు ఉదయం 7.45కి సమాచారం అందించినా వారు 10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు ఆలస్యం చేయటం వల్లే చిరుత చిక్కలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే చిరుత ఆచూకీ కోసం మరో రోజు గాలిస్తామని అటవీ అధికారులు చెబుతుండటం గమనార్హం. చదవండి : (చిరుత కలకలం : రంగంలోకి కుక్కలు) -
ఇంకా దొరకని చిరుత.. కొనసాగుతున్న ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ శివారు మైలార్‌దేవ్‌పల్లి-కాటేదాన్ ప్రధాన రహదారి(ఎన్‌హెచ్ 7) హైవే రోడ్డు పక్కన గురువారం గాయాలతో కనిపించిన చిరుత ఆచూకి ఇంకా చిక్కలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి అధికారులు శ్రమిస్తున్నా చిరుత ఆచూకీ లభించలేదు. సమీపంలోని రైల్వే స్టేషన్ పక్కన చెట్లు ఎక్కువగా ఉండడంతో అక్కడే ఉంటుందని భావిస్తున్నారు. కల్వకుర్తి పరిసర ప్రాంతాల్లో తప్పించుకున్న చిరుత ఇదే అయి ఉంటుందని, శంషాబాద్ అటవీ ప్రాంతం మీదుగా వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చిరుత ఇంకా దొరక్కపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇళ్ళలో నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని అధికారులు స్థానికులను హెచ్చరించారు. డ్రోన్ కెమెరాల సాయంతో ఆ ప్రాంతమంతటా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాగా చిరుతపులికి సంబంధించిన అడుగులను అధికారులు గుర్తించారు. కాగా అడుగుల ఆధారంగా చిరుత ఫాంహౌస్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. చిరుతను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలతో పాటు ట్రాప్ కెమెరాల ఫీడ్ ఆధారంగా అధికారులు చిరుత ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చిరుతను బంధించేందుకు రెండు బోన్లతో పాటు ప్రత్యేక వలల ఏర్పాటు చేశారు. దీంతో పాటు అటవీశాఖకు చెందిన షూటర్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఎలాగైనా సరే చిరుతను పట్టుకొని తీరుతామని అధికారులు వెల్లడించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (లారీ డ్రైవర్ అత్యుత్సాహం; చిరుత దాడి) (చిరుత కలకలం : రంగంలోకి కుక్కలు) -
చిరుత కలకలం : రంగంలోకి కుక్కలు
సాక్షి, రంగారెడ్డి : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ పరిధిలో లారీ డ్రైవర్‌పై దాడి చేసి తప్పించుకుపోయిన చిరుత పులి ఆచూకి కోసం ఫారెస్ట్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే నాలుగు సార్లు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి గాలించినా చిరుత ఆచూకీ లభించలేదు. ఫారెస్ట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి చిరత కోసం విస్తృతంగా గాలించారు. అయినప్పటికీ అది చిక్కడం లేదు. దీంతో చిరుతను పట్టుకోవడంతో కోసం కుక్కలను రంగంలోకి దించారు అధికారులు. చిరుతను గుర్తించడానికి ఫాంహౌజ్‌లోకి కుక్కలను వదిలారు. బోన్లలో మేకలను ఎరవేసి చిరుతను బందించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 9 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. చిరత ఆచూకి లభించకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ( చదవండి : లారీ డ్రైవర్ అత్యుత్సాహం; చిరుత దాడి) కాగా, చిరుత ఆచూకీ లభించేంత వరకు కాటేదాన్, బుద్వేల్ వాసులు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. కుక్కల అరుపులు వినిపస్తే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. అలసిపోయిన చిరుత స్థానికంగా ఉన్న తోటలో నక్కినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. -
లారీ డ్రైవర్ అత్యుత్సాహం; చిరుత దాడి
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో గురువారం ఒక చిరుతపులి కలకలం రేపింది. వివరాలు.. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ పరిధిలో కాటేదాన్ రైల్వే ట్రాక్ వద్ద ఉన్న ఎన్‌హెచ్ 7 హైవేపై డివైడర్‌ను ఆనుకొని ఒక చిరుతపులి కూర్చొని ఉంది. కాగా చిరుతకు గాయాలు కావడంతో కదల్లేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన సుభానీ అనే లారీ డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దానికి ఏమైందోనని దగ్గరికి వెళ్లి చూసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిరుతపులి లారీ డ్రైవర్‌ను గాయపరిచింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని గాయపడిన లారీ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఇరువైపుల ఉన్న రోడ్డును తమ పరిధిలోకి తెచ్చుకున్న పోలీసులు చిరుతపులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అయితే మత్తు మందు ఇచ్చేలోపే చిరుత అక్కడి నుంచి పారిపోయింది. దీంతో దాన్ని ఎలాగైనా పట్టుకొని తీరుతామని అధికారులు పేర్కొన్నారు. -
పాఠశాలలోకి చిరుతపులి.. భయంతో పరుగులు
పిలిభిత్ : ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి ఒక చిరుతపులి ప్రవేశించి విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. పులిని చూసి హడలిపోయిన విద్యార్థులు తరగతి గదుల్లోకి పరుగులు తీశారు. అయితే చిరుతపులి పాఠశాల ఆవరణలో ఉన్న ఒక కుక్కపై దాడి చేసి దానిని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లోని బారాహీ అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకుపోయింది.ఈ క్రమంలో పాఠశాల ప్రధనోపాధ్యాయురాలు రావడంతో విద్యార్థులు ఆమెకు జరిగిందంతా వివరించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడంతో వారు వచ్చి పాఠశాలను సందర్శించి చిరుతపులి పాద ముద్రలు సేకరించారు. కాగా విద్యార్థుల భద్రతతో పాటు చిరుత కదలికలను గుర్తించేందుకు పాఠశాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీనియర్ పారెస్ట్ అధికారి అజ్మేర్ యాదవ్ తెలిపారు. అయితే చిరుతపులి ఒకట్రెండు రోజుల్లో తిరిగి అడవికి వెళ్లిపోతుందని అధికారులు భావిస్తున్నారు. -
పశువుల కోసం వచ్చి చిరుత చేతిలో..
కోల్‌కతా : చిరుతపులి దాడిలో టీ గార్డెన్ కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన పశ్చిమబెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 54 ఏళ్ల మార్థియస్ ముండా శనివారం సాయంత్రం తన పశువులను ఇంటికి తీసుకువెళ్లడానికి మెటెలి బ్లాక్‌లోని బారాదిఘీ టీ ఎస్టేట్‌కు వెళ్లాడు. పశువులను తీసుకొని ఇంటికి వెళుతుండగా అప్పటికే అక్కడి చెట్ల పొదల్లో దాక్కున్న ఓ చిరుతపులి అమాంతం వెనుకవైపు నుంచి అతని మీదకు దూకింది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ముండా గట్టిగా కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయినట్లు అటవీ అధికారి తెలిపారు. ఈ దాడిలో ముండా చేతికి, వీపు వెనుక భాగంలో తీవ్ర గాయాలవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించి డిశ్చార్జ్ చేసినట్లు అధికారి పేర్కొన్నారు. -
కడ్తాల్‌లో మళ్లీ చిరుత పంజా
సాక్షి, కడ్తాల్(రంగారెడ్డి) : కొన్ని నెలలుగా చిరుతపులి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లేగదూడలపై దాడి చేస్తూ రైతులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా కడ్తాల్ మండలం వాస్‌దేవ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నేరేళ్లుకోల్ తండాలో రైతు కేతావత్ దస్రునాయక్కు చెందిన పశువుల పాకపై శనివారం తెల్లవారు జామున చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో లేగదూడ మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే.. నేరేళ్లుకోల్తండాకు చెందిన రైతు కేతావత్ ద్రçసునాయక్ రోజు మాదిరిగానే శుక్రవారం సాయంత్రం వరకు పశువులను మేపి, తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న పాకలో వాటిని కట్టేసి ఇంటికి వచ్చాడు. తిరిగి శనివారం ఉదయం పశువుల పాలు పితికేందుకు పొలానికి వెళ్లి చూడగా.. పాక సమీపంలో లేగదూడ మృత్యవాత పడి ఉంది. వెంటనే రైతు తండా వాసులకు సమాచారం ఇవ్వడంతో వారంతా ఘటనా స్థలానికి చేరుకుని మృతిచెందిన దూడను పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారి దేవేందర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన లేగదూడను, చిరుత పులి సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇప్పటికైనా సంబంధిత అటవీ శాఖ ఉన్నతాధికారులు చిరుతను పట్టుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు. -
అది చిరుత కాదు హైనానే
సాక్షి, కొయ్యలగూడెం(పశ్చిమ గోదావరి) : గంగవరం అటవీ ప్రాంతంలో ఇటీవల చిరుతపులి తిరుగుతుందన్న వార్త కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అది చిరుతపులి కాదని హైనాగా అటవీశాఖాధికారులు నిర్ధారించారు. గత ఐదు రోజులుగా చిరుత సంచారం ప్రచారంతో గ్రామస్తుల్లో భయాందోళనలు గురయ్యారు. దీంతో అధికారులు పాదముద్రలు పరిశీలించి చిరుత లేదా హైనావి కావచ్చని నాల్రోజుల క్రితం చెప్పారు. అయితే ఏలూరు నుంచి తీసుకొచ్చిన సాంకేతిక పరికరాల సాయంతో ఆ పాదముద్రల్ని పరిశీలించి హైనావిగా నిర్ధారించారు. కన్నాపురం, ఏలూరు ఫారెస్ట్ సెక్షన్ అటవీశాఖాధికారులు, వైల్డ్ లైఫ్ సిబ్బందితో కలిసి హైనాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే అటవీప్రాంతంలోని మారుమూల ప్రదేశంలో బోనులు ఏర్పాటు చేశామన్నారు. రెండు రోజులుగా అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కొన్ని చోట్ల జంతువు పాదముద్రలను గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని అధికారులు చెప్పారు. -
బావిలో చిరుత...
ఇల్లంతకుంట(కరీంనగర్): కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట శివారులోని గుర్రాల ఆనందరెడ్డి వ్యవసాయబావిలో ఓ చిరుతపులి పిల్ల పడింది. మంగళవారం ఉదయం ఆనందరెడ్డి బావి వద్దకు వెళ్లగా అరుపులు వినిపించడంతో బావిలోకి చూశాడు. బావిలో చిరుత పులి ఉందని గమనించి పోలీసులకు, ఫారెస్టు అధికారులకు సమాచారం అందించాడు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుమితారావు వెంటనే అక్కడకు చేరుకుని వరంగల్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోని రెస్క్యూ టీంకు సమాచారమిచ్చారు. క్రేన్ సాయంతో బావిలోకి బోను దించినప్పటికీ చిరుత అందులోకి రాకపోవడంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి బయటకు తీశారు. చిరుత నీరసంగా ఉండటంతో వైద్యపరీక్షలు నిర్వహించి వరంగల్‌కు తరలించారు. చిరుత పిల్ల చిక్కడంతో పెద్దలింగాపూర్, సోమారంపేట శివార్లలోని గుట్టల ప్రాంతంలో మరో మూడు చిరుత పులులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. -
బిడ్డ కోసం చిరుతతోనే పోరాడిన తల్లి
లక్నో: అమ్మ అంటే నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడమే కాదు.. కలకాలం వెన్నంటి కాపాడే అమృతమూర్తి. కాలయముడే ముందు నిలబడినా బిడ్డల కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పోరాడే దేవత.. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ మాతృమూర్తి ఈ విషయాలను మరోసారి రుజువు చేసింది. అకస్మాత్తుగా దాడిచేసి తన బిడ్డను నోట కరుచుకొని పోతున్న చిరుతతో ధైర్యంగా పోరాడింది. అత్యంత సాహసంగా వ్యవహరించి క్రూర జంతువు సైతం తోక ముడిచేలా చేసింది. కాట్రాయన్ ఘాట్ గ్రామానికి చెందిన ఫూల్మతి (30) తన ఇద్దరు ఆడబిడ్డల్ని తీసుకుని పొలానికి బయలుదేరింది. అంతలో అక్కడకు దగ్గర్లో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం లోంచి వచ్చిన చిరుత వాళ్లపై దాడిచేసి, నాలుగేళ్ల గుడియాను ఈడ్చుకుంటూ పారిపోవడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా షాకైన ఫూల్మతి.. క్షణం ఆలస్యం చేయకుండా.. సాయం కోసం బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. పొద్దునే కావడంతో ఆ చుట్టుపక్కల ఎవరూ స్పందించలేదు. అయినా పెద్దగా కేకలు వేస్తూ.. చేతికి దొరికిన రాళ్లు, కర్రలతో చిరుతను కొట్టడం మొదలుపెట్టింది. దాదాపు అరగంటపాటు ఆ చిరుతపై ఒంటరి పోరాటం చేసింది. తర్వాత ఆమె కుటుంబసభ్యులు ఆమెకు తోడయ్యారు. చివరకు చిరుత బారినుంచి ఆ పాపను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా, మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. -
రాజధానిలో చిరుత సంచారం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ చుట్టుపక్కల గ్రామస్థులను ఇప్పుడో చిరుత వణికిస్తోంది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందన్న వదంతులు వినిపిస్తున్నాయి. తాజాగా.. రాములు గౌడ్ అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఒక లేగదూడ చనిపోయి పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. చిరుతపులి దాడిలోనే అది మరణించిందని వారు చెబుతున్నారు. బండ్లగూడ, కిస్మత్పూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఈ చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు రెండు గ్రామాల సర్పంచులు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు జూ అధికారులు గానీ, అటవీ శాఖాధికారులు గానీ ఎవరూ రాలేదు. ఇక లేగదూడ చిరుత దాడిలోనే మరణించిందా లేక మరేదైనాకారణం ఉందా అనే విషయాన్ని కూడా ఇంతవరకు నిర్ధారించలేదు. ఆ విషయం తేలితే గానీ చిరుత సంచారం కూడా నిర్ధారణ కాదు. ఈ విషయాన్ని తర్వగా తేల్చి, తమను చిరుత బారి నుంచి కాపాడాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
రాజేంద్రనగర్‌లో చిరుత సంచారం