రాజధానిలో చిరుత సంచారం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ చుట్టుపక్కల గ్రామస్థులను ఇప్పుడో చిరుత వణికిస్తోంది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందన్న వదంతులు వినిపిస్తున్నాయి. తాజాగా.. రాములు గౌడ్ అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఒక లేగదూడ చనిపోయి పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. చిరుతపులి దాడిలోనే అది మరణించిందని వారు చెబుతున్నారు.
బండ్లగూడ, కిస్మత్పూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఈ చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు రెండు గ్రామాల సర్పంచులు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు జూ అధికారులు గానీ, అటవీ శాఖాధికారులు గానీ ఎవరూ రాలేదు. ఇక లేగదూడ చిరుత దాడిలోనే మరణించిందా లేక మరేదైనాకారణం ఉందా అనే విషయాన్ని కూడా ఇంతవరకు నిర్ధారించలేదు. ఆ విషయం తేలితే గానీ చిరుత సంచారం కూడా నిర్ధారణ కాదు. ఈ విషయాన్ని తర్వగా తేల్చి, తమను చిరుత బారి నుంచి కాపాడాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.