
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో గురువారం ఒక చిరుతపులి కలకలం రేపింది. వివరాలు.. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ పరిధిలో కాటేదాన్ రైల్వే ట్రాక్ వద్ద ఉన్న ఎన్‌హెచ్ 7 హైవేపై డివైడర్‌ను ఆనుకొని ఒక చిరుతపులి కూర్చొని ఉంది. కాగా చిరుతకు గాయాలు కావడంతో కదల్లేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన సుభానీ అనే లారీ డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు.
దానికి ఏమైందోనని దగ్గరికి వెళ్లి చూసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిరుతపులి లారీ డ్రైవర్‌ను గాయపరిచింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని గాయపడిన లారీ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఇరువైపుల ఉన్న రోడ్డును తమ పరిధిలోకి తెచ్చుకున్న పోలీసులు చిరుతపులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అయితే మత్తు మందు ఇచ్చేలోపే చిరుత అక్కడి నుంచి పారిపోయింది. దీంతో దాన్ని ఎలాగైనా పట్టుకొని తీరుతామని అధికారులు పేర్కొన్నారు.