ఒక్క ఊరు.. రెండు కమిటీలు | Two Village Development Committees In Uttanur At Kamareddy | Sakshi
Sakshi News home page

ఒక్క ఊరు.. రెండు కమిటీలు

Published Tue, Sep 10 2019 11:35 AM | Last Updated on Tue, Sep 10 2019 11:35 AM

Two Village Development Committees In Uttanur At Kamareddy - Sakshi

టీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం ఎన్నుకున్న ఉత్తునూరు గ్రామ కమిటీ, టీఆర్‌ఎస్‌లోని మరోవర్గం ఎన్నుకున్న ఉత్తునూరు గ్రామ కమిటీ

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో విభేదాలు ముదురుతున్నాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. రెండు వర్గాలు వేరువేరుగా కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా.. గ్రామ కమిటీలను సైతం వేరువేరుగా ఎన్నుకుంటుండడం గమనార్హం.

సాక్షి, కామారెడ్డి: ఉత్తునూరు.. ఇది ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్‌ మండలంలోని గ్రామం. తెలంగాణ ఉద్యమం నుంచి అక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉంది. ప్రస్తుతం ఆ గ్రామంలో పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. గతంలో టీఆర్‌ఎస్‌లో ఉన్నవారు ఒక వర్గంగా, కొత్తగా చేరిన వారు మరో వర్గంగా విడిపోయి ఎవరికి వారు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు నుంచి మొదలుకొంటే గ్రామ కమిటీల ఎన్నిక వరకూ ఎవరికి వారే కార్యక్రమాలను చేపట్టడం చర్చనీయాంశమైంది. ఉత్తునూరులో ఇప్పుడు టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖకు రెండు కమిటీలు ఏర్పాటయ్యా యి. ఒక్క ఉత్తునూరులోనే కాదు నియోజక వర్గం అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. ఎమ్మెల్యే వర్గం, మాజీ ఎమ్మెల్యే వర్గాలుగా టీఆర్‌ఎస్‌ రెండుగా చీలిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఎల్లారెడ్డి నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉంది. అయితే గతేడా ది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై వ్యతిరేకత రావడం, పలుమార్లు ఓటమి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి జాజాల సురేందర్‌పై సానుభూతి వెల్లువెత్తడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి చెందింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఓడినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం రావడంతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కనుసన్నల్లోనే పాలన సాగేది. అయితే కొన్నాళ్లకే ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయన అనుచరులు కూడా టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. దీంతో ఎల్లారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

ఒక ఒరలో రెండు కత్తులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఎన్నికల ముందు వరకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అన్న రీతిలో రాజకీయ ఘర్షనలు జరిగేవి. అయితే సురేందర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన తరువాత పరిస్థితులు తలకిందులయ్యాయి. టీఆర్‌ఎస్‌ పార్టీలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు ఒక వర్గంగా, ఎమ్మెల్యే సురేందర్‌ అనుచరులు మరో వర్గంగా చీలిపోయారు. నియోజక వర్గ టీఆర్‌ఎస్‌ బాధ్యతలు ఎమ్మెల్యే సురేందర్‌కు అప్పగించడంతో అన్నింటా ఆయన అనుచర వర్గానిదే పైచేయిగా నిలుస్తోంది. దీంతో ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గం వారు ఆవేదనకు గురవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశంలోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వర్గానికే ప్రాధాన్యత దక్కింది.

దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. కొన్ని మండలాల్లో పాత క్యాడర్‌ స్వతంత్రంగా బరిలో దిగి విజయం సాధించింది. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, రామారెడ్డి మండలాల జెడ్పీటీసీ స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. గాంధారి, తాడ్వాయి, రాజంపేట, సదాశివనగర్‌ మండలాలలో మాత్రమే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి కొనసాగిన వారికి టికెట్లు దక్కకపోవడంతోనే పార్టీ ఓటమి చెందిందని మాజీ ఎమ్మెల్యే వర్గం ఆరోపించగా.. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చారని, అందు వల్లే టీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని సిట్టింగ్‌ ఎమ్మెల్యే వర్గం ఆరోపించింది. స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచి ఇరు వర్గాల మధ్య దూరం మరింత పెరిగింది.

సంస్థాగత ఎన్నికల్లో..
ఎల్లారెడ్డి నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణం విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలు ఒకవర్గంగా, ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌లో చేరిన వారు మరో వర్గంగా విడిపోయారు. పాత తరంలో కొందరు మాత్రమే ఎమ్మెల్యే వెంట నడుస్తుండగా, మెజారిటీ నేతలు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వర్గంలోనే కొనసాగుతున్నారు. దీంతో గ్రామ, మండల కమిటీల నియామకం విషయంలో ఇరు వర్గాలు ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో రెండు వర్గాలు గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గ్రామ కమిటీల ఎన్నికల తరువాత మండల కమిటీలను ఎన్నుకోనున్నారు. ముఖ్య నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement