Village committees
-
ఒక్క ఊరు.. రెండు కమిటీలు
అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ముదురుతున్నాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. రెండు వర్గాలు వేరువేరుగా కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా.. గ్రామ కమిటీలను సైతం వేరువేరుగా ఎన్నుకుంటుండడం గమనార్హం. సాక్షి, కామారెడ్డి: ఉత్తునూరు.. ఇది ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలంలోని గ్రామం. తెలంగాణ ఉద్యమం నుంచి అక్కడ టీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ప్రస్తుతం ఆ గ్రామంలో పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. గతంలో టీఆర్ఎస్లో ఉన్నవారు ఒక వర్గంగా, కొత్తగా చేరిన వారు మరో వర్గంగా విడిపోయి ఎవరికి వారు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు నుంచి మొదలుకొంటే గ్రామ కమిటీల ఎన్నిక వరకూ ఎవరికి వారే కార్యక్రమాలను చేపట్టడం చర్చనీయాంశమైంది. ఉత్తునూరులో ఇప్పుడు టీఆర్ఎస్ గ్రామ శాఖకు రెండు కమిటీలు ఏర్పాటయ్యా యి. ఒక్క ఉత్తునూరులోనే కాదు నియోజక వర్గం అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. ఎమ్మెల్యే వర్గం, మాజీ ఎమ్మెల్యే వర్గాలుగా టీఆర్ఎస్ రెండుగా చీలిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే గతేడా ది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై వ్యతిరేకత రావడం, పలుమార్లు ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి జాజాల సురేందర్‌పై సానుభూతి వెల్లువెత్తడంతో టీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం రావడంతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కనుసన్నల్లోనే పాలన సాగేది. అయితే కొన్నాళ్లకే ఎమ్మెల్యే జాజాల సురేందర్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ఎల్లారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒక ఒరలో రెండు కత్తులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఎన్నికల ముందు వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అన్న రీతిలో రాజకీయ ఘర్షనలు జరిగేవి. అయితే సురేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన తరువాత పరిస్థితులు తలకిందులయ్యాయి. టీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు ఒక వర్గంగా, ఎమ్మెల్యే సురేందర్ అనుచరులు మరో వర్గంగా చీలిపోయారు. నియోజక వర్గ టీఆర్ఎస్ బాధ్యతలు ఎమ్మెల్యే సురేందర్‌కు అప్పగించడంతో అన్నింటా ఆయన అనుచర వర్గానిదే పైచేయిగా నిలుస్తోంది. దీంతో ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గం వారు ఆవేదనకు గురవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గానికే ప్రాధాన్యత దక్కింది. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. కొన్ని మండలాల్లో పాత క్యాడర్ స్వతంత్రంగా బరిలో దిగి విజయం సాధించింది. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, రామారెడ్డి మండలాల జెడ్పీటీసీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గాంధారి, తాడ్వాయి, రాజంపేట, సదాశివనగర్ మండలాలలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. టీఆర్ఎస్లో మొదటి నుంచి కొనసాగిన వారికి టికెట్లు దక్కకపోవడంతోనే పార్టీ ఓటమి చెందిందని మాజీ ఎమ్మెల్యే వర్గం ఆరోపించగా.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చారని, అందు వల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం ఆరోపించింది. స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచి ఇరు వర్గాల మధ్య దూరం మరింత పెరిగింది. సంస్థాగత ఎన్నికల్లో.. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలు ఒకవర్గంగా, ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్లో చేరిన వారు మరో వర్గంగా విడిపోయారు. పాత తరంలో కొందరు మాత్రమే ఎమ్మెల్యే వెంట నడుస్తుండగా, మెజారిటీ నేతలు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వర్గంలోనే కొనసాగుతున్నారు. దీంతో గ్రామ, మండల కమిటీల నియామకం విషయంలో ఇరు వర్గాలు ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో రెండు వర్గాలు గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గ్రామ కమిటీల ఎన్నికల తరువాత మండల కమిటీలను ఎన్నుకోనున్నారు. ముఖ్య నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. -
స్థానికతకు గ్రామ కమిటీలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఫాస్ట్’కు విద్యార్థుల స్థానికత నిర్ధారణకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీలు ‘స్థానికత’ను నిర్ధారించి సిఫార్సు చేస్తేనే సంబంధిత ధ్రువపత్రాలను అందజేసేలా చర్యలు చేపట్టనుంది. గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఈ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కమిటీల ఏర్పాటు, విధివిధానాలపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే దీనిపై కసరత్తు పూర్తి చేసి మార్గదర్శకాలను జారీ చేసే అవకాశముంది. తెలంగాణ విద్యార్థుల ఫీజుల భారాన్ని మాత్రమే మోస్తామని స్పష్టం చేసిన ప్రభుత్వం.. స్థానికతకు ‘1956’ ఏడాదిని కటాఫ్‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం ఫీజు రీయింబర్స్‌మెంటు స్థానంలో ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ-ఫాస్ట్)’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు కూడా. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన 1974 ఏడాది నుంచి ఉన్న వారిని స్థానికులుగా భావించాలని ఒక దశలో ప్రతిపాదన వచ్చినా సీఎం కేసీఆర్ దానికి అంగీకరించలేదు. 1956నే కటాఫ్‌గా ఖరారు చేస్తూ... ఇక్కడి విద్యార్థుల్లో ఒక్కరికి కూడా నష్టం జరగకుండా.. తెలంగాణేతరుల్లో ఏ ఒక్కరికీ ఫీజు చెల్లించకుండా ఉండేలా మార్గదర్శకాలను రూపొందించాలని ఆయన ఆదేశించారు. దీంతో మూడు తరాలకు సంబంధించి నివాస ధ్రువీకరణ ఎవరు చేయాలన్న అంశంపై రెవెన్యూ, విద్య, సంక్షేమ, ఆర్థిక శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పరిశీలన జరిపారు. ఈ క్రమంలో విద్యార్థుల స్థానికతను నిర్ధారించడం కోసం గ్రామ స్థాయిలో కమిటీలు వేసి, వాటికి స్థానికతను నిర్ధారించే బాధ్యత అప్పగించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. క్షేత్రస్థాయి పరిశీలన వల్ల స్థానికత నిర్ధారణ లోపాలు లేకుండా, కచ్చితంగా జరుగుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కమిటీలో ఎవరుంటారు..? ఏ ప్రమాణాల మేరకు స్థానికతను నిర్ణయిస్తారు..? అన్న విషయాల మీద చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ కమిటీల స్వరూప స్వభావాల గురించి తుది నిర్ణయం తీసుకోకపోయినా.. గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆ కమిటీలను ఏర్పాటు చేయాలన్న అంశంపై ఉన్నతాధికారులు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెప్తున్నారు. గ్రామం నుంచి గతంలో ఎవరైనా వలస వెళ్లినా.. వారి బంధువులు, ఇరుగుపొరుగువారికి వారి వివరాలు తెలిసి ఉంటాయని.. వారు ఎంత కాలం ఎక్కడున్నారన్న సమాచారం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీనికితోడు గ్రామానికి చెందిన పెద్దల సహకారం కూడా తీసుకుని అర్హులైన వారెవరన్నది కమిటీలు నిర్ధారిస్తాయి. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో కసరత్తు పూర్తి చేసి మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది. -
అధైర్యం వద్దు.. భవిష్యత్ మనదే: వైఎస్ జగన్
* గ్రామ కమిటీలను పటిష్టం చేస్తాం.. * ప్రతి నెలా సామాజిక, రాజకీయ అంశాలపై చైతన్యం చేసే కార్యక్రమాలు * రెండోరోజు అరకు, విజయనగరం, అమలాపురం ఎంపీ నియోజకవర్గాలపై సమీక్ష * పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపిన జగన్మోహన్రెడ్డి * కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా పార్టీ యంత్రాంగమంతా తోడు ఉంటుంది సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: ‘‘ప్రతి కార్యకర్తకూ నాతో పాటు పార్టీ యంత్రాంగమంతా అండగా ఉంటుంది. వారికి ఏ చిన్న కష్టమొచ్చినా కలసికట్టుగా పోరాడదాం. ఏ ఒక్కరూ అధైర్యపడనవసరం లేదు. అధికారంలోకి రాలేదనే దిగులు అసలే వద్దు. భవిష్యత్తు మనదే. భరోసాతో ముందుకు కదలండి. ఏ కార్యకర్తకు ఏ చిన్న కష్టమొచ్చినా స్థానిక నాయకులే కాదు.. ఆయా జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులంతా ఏకమై అండగా ఉండాలి. అవసరమైతే పక్కనున్న జిల్లాల నుంచి కూడా నేతలు తరలి రావాలి. కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో చేపట్టిన పార్టీ సమీక్షలో రెండోరోజైన గురువారం అరకు, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపోటములపై అక్కడి నాయకులు, కార్యకర్తలతో జగన్ సుదీర్ఘంగా చర్చించారు. సంస్థాగతంగా నెలకొన్న సమస్యలతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ, బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు, కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఆయా నియోజకవర్గాల నేతలు, గెలుపొందిన ఎమ్మెల్యేలకు రానున్న ఐదేళ్లలో అవలంభించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. రెండోసారీ గెలవాలి.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ‘తొలిసారి గెలవడం గొప్పకాదు. పదవీకాలంలో విశ్వసనీయతతో పనిచేసి వారి మధ్యే ఉంటూ వారి సమస్యలపై పోరాడగలగాలి. అలా చేస్తూ రెండోసారి ప్రజలతో ఎన్నుకోబడినప్పుడే నాయకుడిగా మనకు నిజమైన పాస్‌మార్కులు లభించినట్టు’ అని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామ కమిటీలను పటిష్టం చేసి, తెలుగుదేశం ప్రభుత్వం అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలను, మోసాలను వాటి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి నెలా సామాజిక, రాజకీయ అంశాలపై చైతన్యం చేసే కార్యక్రమాలు చేపడతామని, అందుకు కావాల్సిన మెటీరియల్‌ను అవసరమైతే హైదరాబాద్ నుంచి పంపిస్తామని చెప్పారు. పార్టీ యువతకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే బాబు తపన.. ‘మనం బలమైన ప్రతిపక్షంగా అవతరించాం. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వపరంగా జరిగే లోపాలను ఎత్తి చూపేందుకు బలమైన ప్రతిపక్షం కావాలని అధికార పక్షం కోరుకుంటుంది. కానీ మన రాష్ర్టంలో అధికారం చేపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రజలకు సేవచేయడానికంటే ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న తపనతో పనిచేస్తారు’ అని జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు చేసే మోసాలను కప్పిపుచ్చేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 వంటి మీడియా సంస్థలు నిత్యం కంటికిరెప్పలా పనిచేస్తాయి. ఈ శక్తులన్నీ కలిపి చేసే కుట్రలను తిప్పికొట్టేందుకు మనం సిద్ధంగా ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ టార్గెట్‌గా అప్పుడే కుట్రలు, కుతంత్రాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు డబ్బు ఎర చూపి వార్ని తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి. అక్రమ కేసులు కూడా బనాయిస్తారు. కార్యకర్తలకు అండగా నిలవాల్సిన బాధ్యత నాయకులపై ఉంది’’ అని సూచించారు. బాబు బండారం త్వరలోనే బయటపడుతుంది.. ‘‘మరో పదిహేను రోజుల్లో వర్షాలు పడనున్నాయి. రైతులు రుణాల కోసం బ్యాంకర్ల వద్దకు వెళ్తారు. పాత రుణాలు చెల్లిస్తే కానీ వారికి కొత్త రుణాలు ఇవ్వరు. అప్పుడు చంద్రబాబు బండారం బయటపడుతుంది. ఇదొక్కటే కాదు.. ఆయన ఇచ్చిన అబద్ధపు హామీలు, మోసాలన్నీ ప్రజలందరూ త్వరలోనే తెలుసుకుంటారు. బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు కర్తవ్యాన్ని నిర్దేశించారు.