సాక్షి, హైదరాబాద్: ‘ఫాస్ట్’కు విద్యార్థుల స్థానికత నిర్ధారణకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీలు ‘స్థానికత’ను నిర్ధారించి సిఫార్సు చేస్తేనే సంబంధిత ధ్రువపత్రాలను అందజేసేలా చర్యలు చేపట్టనుంది. గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఈ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కమిటీల ఏర్పాటు, విధివిధానాలపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే దీనిపై కసరత్తు పూర్తి చేసి మార్గదర్శకాలను జారీ చేసే అవకాశముంది. తెలంగాణ విద్యార్థుల ఫీజుల భారాన్ని మాత్రమే మోస్తామని స్పష్టం చేసిన ప్రభుత్వం.. స్థానికతకు ‘1956’ ఏడాదిని కటాఫ్‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం ఫీజు రీయింబర్స్‌మెంటు స్థానంలో ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ-ఫాస్ట్)’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు కూడా. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన 1974 ఏడాది నుంచి ఉన్న వారిని స్థానికులుగా భావించాలని ఒక దశలో ప్రతిపాదన వచ్చినా సీఎం కేసీఆర్ దానికి అంగీకరించలేదు. 1956నే కటాఫ్‌గా ఖరారు చేస్తూ... ఇక్కడి విద్యార్థుల్లో ఒక్కరికి కూడా నష్టం జరగకుండా.. తెలంగాణేతరుల్లో ఏ ఒక్కరికీ ఫీజు చెల్లించకుండా ఉండేలా మార్గదర్శకాలను రూపొందించాలని ఆయన ఆదేశించారు. దీంతో మూడు తరాలకు సంబంధించి నివాస ధ్రువీకరణ ఎవరు చేయాలన్న అంశంపై రెవెన్యూ, విద్య, సంక్షేమ, ఆర్థిక శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పరిశీలన జరిపారు. ఈ క్రమంలో విద్యార్థుల స్థానికతను నిర్ధారించడం కోసం గ్రామ స్థాయిలో కమిటీలు వేసి, వాటికి స్థానికతను నిర్ధారించే బాధ్యత అప్పగించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. క్షేత్రస్థాయి పరిశీలన వల్ల స్థానికత నిర్ధారణ లోపాలు లేకుండా, కచ్చితంగా జరుగుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కమిటీలో ఎవరుంటారు..? ఏ ప్రమాణాల మేరకు స్థానికతను నిర్ణయిస్తారు..? అన్న విషయాల మీద చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ కమిటీల స్వరూప స్వభావాల గురించి తుది నిర్ణయం తీసుకోకపోయినా.. గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆ కమిటీలను ఏర్పాటు చేయాలన్న అంశంపై ఉన్నతాధికారులు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెప్తున్నారు. గ్రామం నుంచి గతంలో ఎవరైనా వలస వెళ్లినా.. వారి బంధువులు, ఇరుగుపొరుగువారికి వారి వివరాలు తెలిసి ఉంటాయని.. వారు ఎంత కాలం ఎక్కడున్నారన్న సమాచారం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీనికితోడు గ్రామానికి చెందిన పెద్దల సహకారం కూడా తీసుకుని అర్హులైన వారెవరన్నది కమిటీలు నిర్ధారిస్తాయి. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో కసరత్తు పూర్తి చేసి మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది.
స్థానికతకు గ్రామ కమిటీలు!
Published Sun, Jul 20 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM
Advertisement