local issue
-
'ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్'
హైదరాబాద్: టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించి, భయపెట్టి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. టీఆర్ఎస్ లో చీలిక వస్తుందన్న ఆందోళన, అభద్రతాభావంతోనే కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలు-ఓట్లు-అధికారం తప్ప కేసీఆర్ కు ప్రజల బాధలు పట్టవన్నారు. అందుకే స్థానికత అంశంపై ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. స్థానికతపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
స్థానికతకు, సర్వేకు సంబంధం లేదు
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే టీ రామారావు కొన్ని మీడియా వర్గాలు దష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటంబ సర్వేపై ఎలాంటి అపోహాలొద్దని కేటీఆర్ సూచించారు. స్థానికతకు, సర్వేకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు స్థానికత, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర విషయాలపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు చైనాకు చెందిన విద్యుత్ ఉత్పత్తి యంత్రాల తయారీ పరిశ్రమ ప్రతినిధులు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. -
రాష్ట్రపతి దృష్టికి స్థానికత అంశం: రావెల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చిస్తారని ఏపీ సాంఘీకశాఖమంత్రి రావెల కిషోర్‌బాబు మీడియాకు తెలిపారు. శనివారం రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి 1956 వివాదాన్ని ఆయన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని రావెల అన్నారు. ఈ వివాదంపై త్వరలో ప్రధాని మోడీకి లేఖ రాస్తారన్నారు. స్థానికతపై కోర్టును కూడా ఆశ్రయిస్తామని రావెల కిషోర్ బాబు తెలిపారు. -
రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి ‘స్థానికత’!
లేఖ రాయూలని ఏపీ సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల స్థానికత నిర్ధారణకు అవసరమైన నిబంధనలు రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. ఈ అంశంపై రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించినట్టు సమాచారం. తె లంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై బుధవారం ఆయన లేక్‌వ్యూ అతిధి గృహంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిశోర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. భేటీ తర్వాత మంత్రి గంటా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన స్థానికత అంశంపై కోర్టుకు వెళతామని చెప్పారు. -
స్థానికతపై పది రోజుల్లో మార్గదర్శకాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకం వర్తింపులో పరిగణనలోకి తీసుకునే స్థానికత నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాల జారీకి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. వీటిని పది రోజుల్లోగా జారీ చేయాలని యోచిస్తోంది. ఫీజుల చెల్లింపు నిబంధనల కంటే ముందు స్థానికత నిర్ధారణకు మార్గదర్శకాలు ప్రధానమైనందున వాటి ని రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో విద్యార్థులకు నివాస ధ్రువీకరణ పత్రాలను జారీ చేయవద్దని రెవెన్యూ శాఖ తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా స్థానికతకు మార్గదర్శకాలను జారీ చేయాలని భావిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలు వెలువడితేనే రెవెన్యూ యంత్రాంగం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. పాత రికార్డులను అందుబాటులోకి తేవడం, స్థానికత నిర్ధారణకు పరిగణనలోకి తీసుకునే తదుపరి అంశాలపై చర్యలు చేపట్టడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయడం కుదురుతుంది. అందుకే త్వరగా మార్గదర్శకాలను రూపొందించేందుకు సంక్షేమ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో ఒకటీ రెండు రోజుల్లో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఐఏఎస్ అధికారులతో ఏర్పడే ఈ కమిటీ వారం రోజుల్లో మార్గదర్శకాలను రూపొందించి సీఎం కేసీఆర్‌తో చర్చించనుంది. అనంతరం ఉత్తర్వుల రూపంలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఇక ఫాస్ట్‌కు సంబంధించిన నిబంధనల రూపకల్పన చివరి దశకు చేరుకుంది. ఇందులో విద్యార్థి కనీస హాజరు, ఉత్తీర్ణత శాతం వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలి సింది. నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు, ప్రతిభావంతులైన విద్యార్థులకే పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. మొదటి సంవత్సరంలో ఆర్థిక సహాయం మంజూరైన విద్యార్థికి రెండో ఏడాది ఫీజు మంజూరు చేయాలంటే ఫస్టియర్‌లోనూ కనీస మార్కులు, హాజరు శాతం ఉండాలనే నిబంధనలను మార్గదర్శకాల్లో చేర్చుతున్నట్లు సమాచారం. -
స్థానికత వివాదంపై ప్రధానికి ఏపీ సర్కారు లేఖ!
హైదరాబాద్: లక్షన్నర లోపు రుణాలు మాఫీచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నాల్ని చేపట్టింది. సోమవారం లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో స్థానికత వివాదం, నామినేటెడ్ పోస్టుల రద్దుకు ఆర్డినెన్స్, రైతు రుణమాపీలపై ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రభుత్వం ఇన్సింటివ్‌లు ఇచ్చే యోచన చేస్తోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కోసం 1956 సంవత్సరాన్ని స్థానికతకు తెలంగాణ ప్రభుత్వం కటాఫ్ ఏడాదిగా పరిగణించడంపై ఏపీ సర్కారు ప్రధాని నరేంద్రమోడీకి లేఖరాయనుందని మీడియాకు తెలిపారు. స్థానికత వివాదంపై చర్చించేందుకు అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉల్లి ధరలు నియంత్రణకు 2కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
స్థానికత వెనుక కుట్ర
ఏపీ అఖిలపక్షం ఆందోళన సాక్షి, హైదరాబాద్: స్థానికతను నిర్ధారించడానికి 1956కు ముందునుంచి ఉన్న వారంటూ తెలంగాణ ప్రభుత్వం కుట్రచేసే ప్రయత్నం చేస్తోందని, దీనివల్ల ఉభ య ప్రాంతాల విద్యార్థులు నష్టపోతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఆందోళన వ్యక్తంచేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చాంబర్లో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ, ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. దాదాపు గంటసేపు చర్చలు జరిగాయి. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్థానికత నిర్ణయించే విషయంలో తెరమీదకు తెస్తున్న అంశంతోపాటు ఎంసెట్ కౌన్సెలింగ్‌పై చర్చించినట్టు చెప్పారు. ఒక వ్యక్తి స్థానికతకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలుండగా ఇదో సమస్యగా మారటం ఆందోళన కల్గించే అంశమని వైఎస్సార్సీపీ నాయకులు జ్యోతుల చెప్పారు. కోర్టుకు వెళ్లడంపై పరిశీలిస్తున్నాం: చంద్రబాబు తెలంగాణలో స్థానికత నిర్ధారణకు 1956వ సంవత్సరమే ప్రాతిపదికగా తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించటంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. శనివారం ఆయన శాసనసభ్యుల రెండు రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానికతపై తెలంగాణ సర్కారు నిర్ణయంపై ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నామన్నారు. కోర్టుకు వెళ్లటంతోపాటు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
స్థానికతకు గ్రామ కమిటీలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఫాస్ట్’కు విద్యార్థుల స్థానికత నిర్ధారణకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీలు ‘స్థానికత’ను నిర్ధారించి సిఫార్సు చేస్తేనే సంబంధిత ధ్రువపత్రాలను అందజేసేలా చర్యలు చేపట్టనుంది. గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఈ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కమిటీల ఏర్పాటు, విధివిధానాలపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే దీనిపై కసరత్తు పూర్తి చేసి మార్గదర్శకాలను జారీ చేసే అవకాశముంది. తెలంగాణ విద్యార్థుల ఫీజుల భారాన్ని మాత్రమే మోస్తామని స్పష్టం చేసిన ప్రభుత్వం.. స్థానికతకు ‘1956’ ఏడాదిని కటాఫ్‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం ఫీజు రీయింబర్స్‌మెంటు స్థానంలో ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ-ఫాస్ట్)’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు కూడా. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన 1974 ఏడాది నుంచి ఉన్న వారిని స్థానికులుగా భావించాలని ఒక దశలో ప్రతిపాదన వచ్చినా సీఎం కేసీఆర్ దానికి అంగీకరించలేదు. 1956నే కటాఫ్‌గా ఖరారు చేస్తూ... ఇక్కడి విద్యార్థుల్లో ఒక్కరికి కూడా నష్టం జరగకుండా.. తెలంగాణేతరుల్లో ఏ ఒక్కరికీ ఫీజు చెల్లించకుండా ఉండేలా మార్గదర్శకాలను రూపొందించాలని ఆయన ఆదేశించారు. దీంతో మూడు తరాలకు సంబంధించి నివాస ధ్రువీకరణ ఎవరు చేయాలన్న అంశంపై రెవెన్యూ, విద్య, సంక్షేమ, ఆర్థిక శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పరిశీలన జరిపారు. ఈ క్రమంలో విద్యార్థుల స్థానికతను నిర్ధారించడం కోసం గ్రామ స్థాయిలో కమిటీలు వేసి, వాటికి స్థానికతను నిర్ధారించే బాధ్యత అప్పగించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. క్షేత్రస్థాయి పరిశీలన వల్ల స్థానికత నిర్ధారణ లోపాలు లేకుండా, కచ్చితంగా జరుగుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కమిటీలో ఎవరుంటారు..? ఏ ప్రమాణాల మేరకు స్థానికతను నిర్ణయిస్తారు..? అన్న విషయాల మీద చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ కమిటీల స్వరూప స్వభావాల గురించి తుది నిర్ణయం తీసుకోకపోయినా.. గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆ కమిటీలను ఏర్పాటు చేయాలన్న అంశంపై ఉన్నతాధికారులు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెప్తున్నారు. గ్రామం నుంచి గతంలో ఎవరైనా వలస వెళ్లినా.. వారి బంధువులు, ఇరుగుపొరుగువారికి వారి వివరాలు తెలిసి ఉంటాయని.. వారు ఎంత కాలం ఎక్కడున్నారన్న సమాచారం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీనికితోడు గ్రామానికి చెందిన పెద్దల సహకారం కూడా తీసుకుని అర్హులైన వారెవరన్నది కమిటీలు నిర్ధారిస్తాయి. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో కసరత్తు పూర్తి చేసి మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది. -
విద్యార్థితో పాటు తండ్రి కూడా స్థానికుడైతేనే..
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థితో పాటు అతని తండ్రి కూడా తెలంగాణ స్థానికుడైతేనే పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్ అన్న విషయంపై ఇరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజులు చెల్లించబోమని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. -
అసెంబ్లీ ఉద్యోగుల విషయంలోనూ...
హైదరాబాద్: శాసనసభ ఉద్యోగుల విభజనలో సీమాంధ్ర ఉద్యోగులు స్థానికతను తప్పుగా చూపారని అసెంబ్లీ తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత వేణుగోపాల్ అన్నారు. 22 మంది సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ ప్రాంతానికి చెందినవారు పేర్కొన్నారని చెప్పారు. మరో 15 మంది సీమాంధ్ర ఉద్యోగులు తప్పుడు స్థానికతను చూపారంటూ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. వాటికి సంబంధించిన ఆధారాలు చూపడానికి అసెంబ్లీ కార్యదర్శిని రెండు రోజులు గడువు కోరామన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో కొనసాగుతామంటే సహించబోమని వేణుగోపాల్ అన్నారు. సచివాలయం ఉద్యోగుల విషయంలోనూ సీమాంధ్రులను తెలంగాణ వారిగా చూపారంటూ ఇప్పటికే అభ్యంతరాలు వచ్చాయి.